- పంటలకు సరిపడా నీటి తడులు అందుతాయా?
- అయోమయంలో ఘనపూర్ ఆనకట్ట ఆయకట్టు రైతులు
మెదక్, పాపన్నపేట, వెలుగు: యాసంగి సాగుపై ఘనపూర్ ఆనకట్ట ఆయకట్టు రైతులు సందిగ్ధంలో ఉన్నారు. దుక్కులు దున్ని నారు మళ్లు తయారు చేసుకునే సమయం ఆసన్నమైనప్పటికీ సింగూర్ ప్రాజెక్ట్ నుంచి నీటి విడుదల విషయంలో అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. దీంతో వేలాది మంది రైతులు అయోమయానికి గురవుతున్నారు. మెదక్ జిల్లాలో పెద్ద సాగు నీటి ప్రాజెక్ట్‌లు లేవు. కొల్చారం, పాపన్నపేట మండలాల సరిహద్దులో ఉన్న మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయిన ఘనపూర్ ఆనకట్టనే ప్రధాన ఆధారం.
ఈ ఆనకట్ట కింద కొల్చారం, పాపన్నపేట, మెదక్ రూరల్, మెదక్ టౌన్, హవేలీ ఘనపూర్ మండలాల పరిధిలో 21,625 ఎకరాల ఆయకట్టు ఉంది. ఘనపూర్ ఆనకట్ట నీటి నిల్వ సామర్థ్యం కేవలం 0.135 టీఎంసీలు మాత్రమే. దీంతో సంగారెడ్డి జిల్లాలోని సింగూర్ ప్రాజెక్ట్ నుంచి విడతల వారీగా నీటిని విడుదల చేస్తేనే ఘనపూర్ ఆయకట్టు పంటలు సాగవుతాయి. కానీ సింగూర్ ప్రాజెక్ట్‌లో సరిపడా నీటి నిల్వ ఉన్నప్పటికీ నేషనల్ డ్యామ్ సేఫ్టీ రివ్యూ ప్యానెల్ సూచనల మేరకు ఆ ప్రాజెక్ట్‌కు రిపేర్లు చేపట్టనున్న నేపథ్యంలో యాసంగిలో నీటిని విడుదల చేయొద్దని అధికారులు నిర్ణయించారు.
చెరువుల్లో నీరుండడంతో..
గత ఆగస్టు, సెప్టెంబర్‌లో భారీ వర్షాలు కురవడంతోపాటు ఎగువ నుంచి మంజీరా నదికి భారీ వరద రావడంతో సింగూర్ ప్రాజెక్ట్ పూర్తి స్థాయిలో నిండింది. దీంతో ప్రాజెక్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయడంతో దాదాపు యాబై రోజుల పాటు ఘనపూర్ ఆనకట్ట పొంగి పొర్లింది. ఫలితంగా ఆనకట్టకు ఇరువైపులా ఉన్న మహబూబ్ నహర్, ఫతేనహర్ కాల్వలు నిండుగా ప్రవహించడంతో వాటి పరిధిలో ఉన్న చెరువులన్నీ పూర్తిగా నిండాయి.
ప్రస్తుతం ఘనపూర్ ఆనకట్టలో, చెరువుల్లో నీరుండడంతో ఆయకట్టు రైతులు యాసంగి సాగుకు సిద్ధమవుతున్నారు. గడిచిన వానాకాలంలో భారీ వర్షాల వల్ల వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగి రైతులు నష్టపోయారు. ఈ నేపథ్యంలో ఆయకట్టు రైతులందరూ యాసంగి పంటలు సాగు చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దుక్కులు దున్ని, నారుమళ్లు పోసుకుంటున్నారు. అవసరమైన ఎరువులు కొనుగోలు చేసుకుంటున్నారు. రైతులందరూ పూర్తి స్థాయిలో పంటలు సాగు చేస్తే ప్రస్తుతం చెరువుల్లో ఉన్న నీటి నిల్వలు పంటలు చేతికందే సమయానికి సరిపోతాయా లేదా అన్న సందేహంలో రైతులు ఉన్నారు.
ముఖ్యంగా పాపన్నపేట మండలంలోని నాగ్సానిపల్లి, శేరిపల్లి, గాంధారి పల్లి, లక్ష్మీనగర్, పొడ్చన్‌పల్లి, కొల్చారం మండల పరిధిలోని పోతంశెట్టిపల్లి, కిష్టాపూర్, రాంపూర్ గ్రామాల పరిధిలో పెద్ద చెరువులు లేకపోవడంతో ఫతేనహర్, మహబూబ్ నహర్ కాల్వల ద్వారా నీరు వస్తేనే పంటలు సాగయ్యే పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఆనకట్టలో ఉన్న నీటిని విడుదల చేస్తే ఆయా గ్రామాల పరిధిలో పంటలు సాగు చేసే అవకాశం ఉన్నా పంటలు ఎదిగే సమయంలో నీటి తడులకు ఇబ్బంది ఎదురయ్యే పరిస్థితి నెలకొంది. వచ్చేది ఎండాకాలం కావడంతో సకాలంలో సరిపడా నీటి తడులు అందకుంటే వేసిన పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందన్న ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది. అందువల్ల చివర్లో కొన్ని తడులకైనా సింగూర్ ప్రాజెక్ట్ నుంచి నీటిని విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు.
