
న్యూఢిల్లీ: కేంద్రం కొత్తగా ప్రవేశపెట్టిన అగ్రి బిల్లులపై పలు రాష్ట్రాల్లో రైతులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పంజాబ్, హర్యానాల్లో ఈ బిల్లులకు వ్యతిరేకంగా రైతులు పెద్ద ఎత్తున నిరసనలకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ బిల్లులపై చర్చించేందుకు పంజాబ్‌కు చెందిన 30 రైతు సంఘాలతో కేంద్రం సమావేశం నిర్వహించింది. అయితే ఈ మీటింగ్‌కు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ గైర్హాజరయ్యారు.
సమావేశానికి పిలిచి తీరా మంత్రి రాకపోవడంతో నిరాశకు గురయ్యారు. మంత్రి స్థానంలో అగ్రికల్చర్ సెక్రటరీ సమావేశానికి హాజరయ్యారు. మీటింగ్‌కు మంత్రి ఎందుకు హాజరు కాలేదని, ఆయన రావాల్సిందేనని రైతులు డిమాండ్ చేశారు. ‘చర్చలపై మేం సంతృప్తిగా లేం. అందుకే మీటింగ్ నుంచి మేం బయటకు వచ్చేశాం. ఈ నల్ల చట్టాలను తొలగించాలి. మా డిమాండ్లను ముందుకు తీసుకెళ్తానని సెక్రటరీ అన్నారు’ అని సమావేశానికి హాజరైన ఓ రైతు సంఘ నాయకుడు చెప్పారు.