ఉద్యమం బంద్.. రోడ్లు ఖాళీ చేస్తున్న రైతులు

ఉద్యమం బంద్.. రోడ్లు ఖాళీ చేస్తున్న రైతులు

న్యూఢిల్లీ: మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ సంవత్సర కాలంగా రైతులు చేస్తున్న పోరాటం ఇవాళ్టితో ముగిసింది. ఢిల్లీ సరిహద్దులైన సింఘూ, టిక్రీ, ఘాజీపూర్ నుంచి రైతులు ఖాళీ చేసి వెళ్తున్నారు. గుడారాలు, టెంట్లను తొలగించిన అన్నదాతలు.. కాసేపట్లో భారీ విజయోత్సవ ర్యాలీ చేపట్టనున్నారు. ఉద్యమంలో మృతి చెందిన 700 మంది రైతులకు తొలుత నివాళులర్పించనున్నారు. ట్రాక్టర్లపై ఇంటికి చేరుకునే రైతులకు స్వాగతం పలికేందుకు హైవేల వెంబడి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ధర్నా స్థలాన్ని ఖాళీ చేసేందుకు రెండు, మూడ్రోజుల సమయం పడుతుందని రైతు సంఘం నేత రాకేశ్ తికాయత్ తెలిపారు. తాను ఈ నెల 15న ధర్నా స్థలాన్ని ఖాళీ చేస్తానని తికాయత్ తెలిపారు.

కాగా, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వివాదాస్పద మూడు సాగు చట్టాలను రద్దు చేయాలని గతేడాది నవంబర్ 26న రైతులు ఆందోళనకు దిగారు. సంవత్సర కాలంగా జరిపిన ఈ నిరసనలతో ఎట్టకేలకు కేంద్రం దిగివచ్చింది. వివాదాస్పద చట్టాలను రద్దు చేసింది. మిగతా ఆరు డిమాండ్లను కూడా పరిష్కరించాలని రైతు సంఘాలు పట్టుబట్టాయి. దీనిపై కేంద్రం, రైతుల మధ్య పలు దఫాలుగా సంప్రదింపులు జరిగాయి. కేంద్రం ముసాయిదాపై చర్చించిన రైతు నేతలు.. ఆందోళన విరమిస్తున్నట్లు ప్రకటించారు. నిరసనల వల్ల ఇబ్బంది పడిన ప్రజలకు సంయుక్త కిసాన్ మోర్చా క్షమాపణ చెప్పింది.