అటు కరోనా.. ఇటు అకాల వర్షాలు.. రైతన్నకు కోలుకోలేని దెబ్బ

అటు కరోనా.. ఇటు అకాల వర్షాలు.. రైతన్నకు కోలుకోలేని దెబ్బ

చేతికొచ్చిన పంట నేలపాలు
భారీ వర్షంతో రైతన్నలకు తీవ్ర నష్టం
మెదక్ జిల్లాలో 1767 ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు
సిద్దిపేట జిల్లాలో నేలవాలిన మొక్కజొన్న, రాలిన వడ్లు, మామిడి కాయలు

మెదక్, సిద్దిపేట, వెలుగు: మెదక్ జిల్లాలో బుధవారం రాత్రి, సిద్ది పేట జిల్లాలో గురువారం కురిసిన వడగండ్ల వర్షానికి రైతుల చేతికొచ్చిన పంటలు నేలపాలయ్యాయి. అకాలవర్షాలకు మెదక్ జిల్లాలో యాసంగి సీజన్లో సాగుచేసిన పంటలు పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయి. బుధవారం రాత్రిజిల్లాలో 10 మండలాల పరిధిలో భారీ వర్షం కురిసింది. దీంతో 1,528మంది రైతులకు చెందిన 1,767 ఎకరాల్లో పంటలు నేలవాలయని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పరశురామ్ తెలిపారు. వరి 1,702 ఎకరాల్లో, మొక్క జొన్న 51.6 ఎకరాల్లో, మొక్క జొన్న 14.3 ఎకరాల్లో దెబ్బ తిన్నాయి. పాపన్న పేట మండలంలో అత్యధికంగా 633 ఎకరాల్లో వరిపంట నేలకొరిగింది. వెల్దుర్తి మండలంలో 282 ఎకరాల్లో, కొల్చారంలో 198, రేగొడులో 127, టేక్మాల్లో 108 , చిన్న శంకరంపేటలో 110 ,హవేలీ ఘనపూర్లో 76, పెద్ద శంకరం పేటలో 59, రామాయంపేటలో 55, నర్సాపూర్ మండలంలో 54.15 ఎకరాల్లో కోతకు సిద్ధంగా ఉన్న వరి పంట దెబ్బతింది. పెద్ద శంకరం పేట మండలంలో 37, రేగొడులో 14, టేక్మాల్లో 0.6 ఎకరాల్లో మొక్క జొన్న పంట.. టేక్మాల్, రేగోడు మండలాల్లో 14.3 ఎకరాల్లో జొన్న పంటకు నష్టం వాటిల్లింది. జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు మండలాల వారీగా సర్వే చేసి రైతుల పంట నష్టం వివరాలను ప్రభుత్వానికి నివేదిక పంపారు.

సిద్దిపేట జిల్లాలో…
సిద్ది పేట జిల్లాలో గురువారం సాయంత్రం దాదాపు గంటకు పైగా కురిసిన వడగండ్ల వర్షం రైతన్నలకు అంతులేని నష్టాన్ని మిగిల్చింది. జిల్లాలోని కొమురవెల్లి, నంగునూరు, కొండపాక, జగదేవ్పూర్, గజ్వేల్, ములుగు, చేర్యాల, మద్దూరు మండలాల్లో పలుచోట్ల గోళికాయ సైజులో పడ్డ
రాళ్లతో వరి, మొక్కజొన్న పంటలు, మామిడి, కూరగాయల తోటలకు తీవ్ర నష్టం కలిగింది. గాలికి పలు గ్రామాల్లో చెట్లు విరిగి పోయాయి. కొమురవెల్లి మండలం లెనిన్ నగర్ వద్ద చేర్యాల రోడ్డుకు అడ్డంగా ఐదు భారీ వృక్షాలు నేల కూలడంతో దాదాపు రెండు గంటలకు పైగా
రాకపోకలు నిలిచిపోయాయి. కొండపాక మండలంలోని బందారం, అంకిరెడ్డిపల్లి, తిమ్మారెడ్డిపల్లి, లకుడారం, కుకునూరుపల్లి, మంగోలు, కొముర
వెల్లి మండలంలోని లెనిన్ నగర్, కిష్టంపేట, ఐనాపూర్, గౌరాయపల్లి, రాంపూర్, జగదేవ్ పూర్ మండలంలోని చాట్లపల్లి, మునిగడప, వట్టిపల్లి, దౌలాపూర్, జంగారెడ్డిపల్లి, బస్వాపూర్, ములుగు మండలం అడవిమజీద్ పల్లి, అలీనగర్, కొట్యాల, చేర్యాల మండలం నాగపురి, మద్దూరు
మండలం లద్నూర్, ధర్మారం, నంగునూరు మండలం సిద్దన్నపేట, గజ్వేల్ మండలం పిడిచేడ్లలో రాళ్ల వర్షం కురిసింది. ఈదురు గాలులకు
మొక్కజొన్న వాలిపోగా, వరి గింజలు, మామిడి కాయలు రాలిపోయాయి. పలు గ్రామాల్లోని కూరగాయల తోటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.