మహబూబాబాద్, వెలుగు : మహబూబాబాద్ జిల్లా గార్ల మండల రైతులకు నష్టం కలిగించే మున్నేరు – పాలేరు లింక్ కెనాల్‌ను రద్దు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం మహబూబాబ్ జిల్లా గార్ల మండలం బుద్ధారం వద్ద సర్వేను అడ్డుకొని, ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా మున్నేరు జలసాధన కమిటీ నాయకులు మాట్లాడుతూ గార్ల మండలంలోని చెరువులు ఎండిపోతున్నాయని, భూగర్భ జలాలు పడిపోతున్నాయని, మొదట ఇక్కడి చెరువులు నింపిన తర్వాతే ఇతర ప్రాంతాలకు నీటిని తరలించాలని డిమాండ్ చేశారు. మున్నేరు – ఆకేరు వాగుల లింక్ కెనాల్‌కు బదులు మున్నేరు వాగుపై రిజర్వాయర్ నిర్మించి మున్నేరు పరివాహక ప్రాంతంలోని 60 వేల ఎకరాలకు సాగు నీరు, ప్రజలకు తాగునీరు అందించాలని కోరారు.
లింక్ కెనాల్ కారణంగా గార్ల మండల రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాభిప్రాయం మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోతే పోరాటం తప్పదని హెచ్చరించారు. గార్ల, బయ్యారం మండలాల పోలీసులు, ఆఫీసర్లు రైతులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా వారు వినిపించుకోలేదు. దీంతో ల్యాండ్ సర్వేను ఆఫీసర్లు తాత్కాలికంగా వాయిదా వేశారు. కార్యక్రమంలో మున్నేరు జలసాధన కమిటీ కన్వీనర్ గంగావత్ లక్ష్మణ్‌నాయక్, జంపాల విశ్వ, సీపీఐ నాయకుడు కట్టెబోయిన శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ శీలంశెట్టి రమేశ్, పల్లెబోయిన లింగయ్య, కట్టెబోయిన బిక్షమయ్య, లింగాల చెన్నయ్య, బానోత్ ఈర్యానాయక్, అలువాల శ్రీనివాస్ పాల్గొన్నారు.
