
- మహారాష్ట్రలోని సిరోంచ తాలూకాలో 30 గ్రామాల రైతులు ఆందోళన
- రీ సర్వే, పరిహారానికి డిమాండ్
మహాదేవపూర్, వెలుగు : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం మేడిగడ్డ వద్ద తెలంగాణ సర్కారు కట్టిన (లక్ష్మీ) బ్యారేజీ తో తాము గోస పడుతున్నామని మహారాష్ట్ర రైతులు ఆందోళనకు దిగారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా మంగళవారం మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా సిరోంచ తాలూకాలోని 30 గ్రామాలకు చెందిన 300 మంది రైతులు నిరసన ర్యాలీ నిర్వహించారు. సిరోంచ తహసీల్దార్ ఆఫీస్ ఎదుట టెంట్ వేసుకుని రిలే దీక్షలు ప్రారంభించారు.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంతో మహారాష్ట్రలోని సిరోంచ తాలుకాలో ఉన్న అప్స్ర్టీమ్లోని సుమారు 1000 ఎకరాలు నీట మునుగుతున్నాయని, తెలంగాణ సర్కారు 400 ఎకరాలను మాత్రమే సేకరించిందన్నారు. మరో 600 ఎకరాలు నీట మునుగుతున్నా పరిహారం లెక్క తేల్చడం లేదన్నారు. పంటలు పాడై మూడేండ్లుగా తాము అరిగోస పడుతున్నామన్నారు. డౌన్ స్ట్రీంలో మరో 600 ఎకరాలు ముంపునకు గురువుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మహారాష్ట్ర, తెలంగాణ ప్రభుత్వాలు రీ సర్వే నిర్వహించి, నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మేడిగడ్డ బ్యారేజీలోని మధ్య గేట్లు మాత్రమే ఎత్తాలని, చివరి గేట్లు (మహారాష్ట్ర వైపు )ఎత్తడంతో తమ వైపు ఎక్కువ భూమి కోతకు గురవుతుందని ఆరోపించారు. పంటలు నీట మునగకుండా గోదావరికి రెయిలింగ్ వేస్తూ కరకట్ట నిర్మించాలని డిమాండ్ చేశారు.