తలచుకుంటే ఏదైనా సాధ్యమే : సీఎం కేసీఆర్

తలచుకుంటే ఏదైనా సాధ్యమే : సీఎం కేసీఆర్

సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో మహారాష్ట్రకు చెందిన శరత్ జోషితో పాటు కొందరు రైతు నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. తన 50ఏండ్ల రాజకీయ జీవితంలో ఎన్నో ఆటుపోట్లు చూశానని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ అన్నారు. రైతుల శక్తి ఏంటో చూశామని, రైతు సమస్యలపై స్పష్టమైన అవగాహన ఉందని చెప్పారు. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందన్న ఆయన.. మన ఆలోచనల్లో, ఆచరణల్లో నిజాయితీ ఉండాలని, గెలవాలంటే చిత్తశుద్ధి ఉండాలని పిలుపునిచ్చారు. రైతుల పోరాటం న్యాయబద్దమైందని, తలచుకుంటే ఏదైనా సాధ్యమేనని స్పష్టం చేశారు.

తెలంగాణలో ఏమేం చేశామో ఒకసారి వచ్చి చూడండంటూ సీఎం కేసీఆర్ సవాల్ విసిరారు. కాళేశ్వరం ప్రాజెక్టును మీరంతా సందర్శించాలని కోరుతున్నానన్నారు. ఉత్తర్ ప్రదేశ్,పంజాబ్ ఎన్నికలు ఉండకపోతే కేంద్రం రైతు చట్టాలను వెనక్కి తీసుకునేది కాదని సీఎం ఆరోపించారు. రైతుల పోరాటంపై ప్రధాని మోడీ కనీసం సానుభూతి చూపించలేదన్న ఆయన.. ఆ సమయంలో రైతుల గోస చూసి తనకు కన్నీళ్లు ఆగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 750రైతులు చనిపోతే మోడీ స్పందించలేదని, రైతులను ఖలీస్థానీలు, ఉగ్రవాదులు అని అన్నారని సీఎం ఈ సందర్భంగా గుర్తు చేశారు.