వడ్లు కొనాలంటూ రోడ్డెక్కిన రైతులు

వడ్లు కొనాలంటూ రోడ్డెక్కిన రైతులు
  •  యాదాద్రి, కామారెడ్డి, సిరిసిల్ల జిల్లాల్లో ఆందోళన

యాదాద్రి/ కోనరావుపేట/ నిజాంసాగర్, వెలుగు: కొనుగోలు సెంటర్లకు తీసుకొచ్చిన వడ్లను వెంటనే కొనాలని డిమాండ్​ చేస్తూ బుధవారం రాష్ట్రంలో పలుచోట్ల రైతులు ఆందోళకు దిగారు. యాదాద్రి జిల్లా బీబీనగర్​మండలం గూడూరు పీఏసీఎస్​లో కాంటా వేసిన వడ్లను తరలించకపోవడంతో రెండ్రోజుల కింద  కురిసిన వానకు తడిచిపోయాయి. దీంతో రైతులు బుధవారం గూడూరు వద్ద హైదరాబాద్, హనుమకొండ నేషనల్​హైవేపై బైఠాయించారు.

వెంట తెచ్చిన వడ్లకు నిప్పు పెట్టారు. గంటకు పైగా ఆందోళన కొనసాగడంతో  వరంగల్​వైపు వెళ్లే  వాహనాలు భారీగా నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న పోలీసులు స్పాట్​కు వచ్చి రైతులకు నచ్చచెప్పే ప్రయత్నం చేసినా.. వారు విన్పించుకోలేదు. దీంతో కొద్దిసేపు రైతులు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. చివరకు ఆఫీసర్లతో మాట్లాడుతామని పోలీసులు చెప్పడంతో రైతులు ఆందోళన విరమించారు.

వడ్ల కొనుగోలులో జాప్యాన్ని నిరసిస్తూ కామారెడ్డి జిల్లా మహమ్మద్ నగర్ మండలం కొమలాంచలో రైతులు రాస్తారోకో చేశారు. వారం రోజులుగా కొనుగోళ్లు చేపట్టడం లేదని, కొన్న వడ్లను కూడా రైస్​మిల్లులకు తరలించడం లేదన్నారు. దీంతో రోజుల తరబడి సెంటర్లలో పడిగాపులు కాయాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్ వచ్చి సమస్యను పరిష్కరించాలని డిమాండ్​చేశారు.

రైతుల ఆందోళనతో రోడ్డుకు ఇరువైపులా వెహికల్స్​భారీగా ఆగిపోయాయి. దీంతో తహసీల్దార్ వచ్చి  రైతులతో మాట్లాడి.. వెంటనే కొనుగోళ్లు చేపడతామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మల్కపేటలో వడ్లు కొనాలని రైతులు రోడ్డెక్కారు. కొనుగోలు కేంద్రంలో వడ్లు పోసి నెలలు గడుస్తున్నా లారీలు రావడం లేదని, దీంతో వడ్ల బస్తాలు పేరుకుపోతున్నాయని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

కొనుగోళ్లు, తరలింపును స్పీడప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయకపోతే కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ముట్టడిస్తామని వారు హెచ్చరించారు. రైతులు గంటకుపైగా రోడ్డుపై బైఠాయించడంతో ట్రాఫిక్ జామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయింది. దీంతో పోలీసులు, సొసైటీ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రామ్మోహన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు అక్కడికి చేరుకొని లారీలు పంపిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించారు.