రైతులకొచ్చే పైసలన్నీ బ్యాంకుల జేబుల్లోకే : బ్యాంకు ఎదుట అన్నదాతల ఆందోళన

రైతులకొచ్చే పైసలన్నీ బ్యాంకుల జేబుల్లోకే : బ్యాంకు ఎదుట అన్నదాతల ఆందోళన

రైతుబంధు, పింఛన్లు, ధాన్యం సొమ్ము అప్పుల కింద జమ

రుణమాఫీ వస్తుందన్న ఆశలతో బాకీలు కట్టని అన్నదాతలు

రైతుల వెంటపడ్డ బ్యాంకర్లు.. అప్పులు కట్టాలంటూ ఒత్తిళ్లు

సమీపిస్తున్న ఖరీఫ్.. పెట్టుబడికి పైసల్లేని దుస్థితిలో రైతన్నలు

చందుర్తి/ జగదేవ్పూర్, వెలుగురైతు బంధు, ఆసరా ఫించన్లు, ధాన్యం డబ్బులు.. ఏవైతేనేం.. రైతుల ఖాతాలో పడ్డ ప్రతి పైసాను బ్యాంకులు అప్పుల కింద జమ కట్టుకుంటున్నాయి. నోటి కాడి బుక్క ఎత్తగొట్టినట్లు పేదలతో ఆడుకుంటున్నాయి. ఖరీఫ్​ సీజన్​లో పెట్టుబడికి ఉపయోగపడాల్సిన డబ్బును కూడా కొన్ని చోట్ల జబర్దస్తీగా జమ చేసుకుంటున్నాయని ఆందోళన వ్యక్తమవుతోంది. చివరికి ధాన్యం అమ్మితే వచ్చిన డబ్బును సైతం రైతుల చేతికివ్వకుండా బ్యాంకులే తీసుకుంటున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో నిత్యం ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. లక్ష రూపాయలలోపు పంట రుణాలను ప్రభుత్వం మాఫీ చేస్తుందన్న ధీమాతో ఉన్న రైతులు.. బ్యాంకులు వ్యవహరిస్తున్న తీరును చూసి నివ్వెరపోతున్నారు. పంట పెట్టుబడులకు తిప్పలు పడుతున్న సమయంలో.. కొత్త రుణాల మాట ఏమోగానీ, ఉన్న సొమ్మునూ తీసేసుకుంటూ నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతుబంధు పథకం ద్వారా రైతులకు ఎకరానికి రూ5 వేల చొప్పున ప్రభుత్వ పెట్టుబడి సాయం విడుదల చేసింది. విత్తనాలు, ఎరువుల కొనుగోలు కోసం ఆ డబ్బులను డ్రా చేసుకోవడానికి వెళ్లిన రైతులకు చేదు అనుభవం ఎదురవుతోంది.

బ్యాంకు ఎదుట రైతుల ఆందోళన

సిద్దిపేట జిల్లా జగదేవ్​పూర్​ గ్రామానికి చెందిన రైతు కొత్త వెంకట్​ నర్సింహారెడ్డి మంగళవారం రైతు బంధు డబ్బులు డ్రా చేయ్యడానికి ఇక్కడి స్టేట్​బ్యాంకుకు వెళ్లాడు. ఓచర్ రాసి డబ్బులు డ్రా చేసేందుకు క్యూ కట్టాడు. తీరా క్యాషియర్​ దగ్గరికి రాగానే ఆయన ఖాతాలో డబ్బుల్లేవని చెప్పారు. డబ్బులు గతంలో తీసుకున్న రైతుల పైసలన్నీ అప్పుల కిందికే..పంట రుణం కింద జమైందన్నారు. దీంతో నర్సింహారెడ్డి షాకయ్యాడు. ఇదేమిటని బ్యాంకు సిబ్బందిని ప్రశ్నించడంతో వాగ్వాదం జరిగింది. చేసేదేమీ లేక గ్రామంలో ఉన్న రైతు సమన్వయ సమితి సభ్యులకు ఫిర్యాదు చేశాడు. అందరూ కలిసి స్టేట్​ బ్యాంక్​ మేనేజర్​ వద్దకు వెళ్లారు. రైతు బంధు డబ్బులు ఎందుకు అప్పు కింద జమ కట్టారని నిలదీశారు. ఈ సమయంలో మాటామాటా పెరిగి, గొడవగా మారింది. దీంతో పోలీసులు వచ్చి సముదాయించారు. మేనేజర్​ తీరుపై మండిపడ్డ రైతులు కొంతసేపు బ్యాంకు ఎదుట ఆందోళన చేశారు.

రుణాలు క్లియర్​గా ఉంటే ఇస్తున్నం:
ఎస్​బీఐ మేనేజర్

రైతుబంధు డబ్బులు వచ్చిన రోజే అందరికీ ఇస్తున్నామని జగదేవ్​పూర్​ స్టేట్​బ్యాంకు మేనేజర్ అనుపమ చెప్పారు. కొందరు రైతులు పంట రుణాలకు చెందిన అకౌంట్లు ఇచ్చారని, దాంట్లో రైతు బంధు డబ్బులు జమవుతున్నాయని చెప్పారు. గతంలో పంట రుణాలు తీసుకుని రెన్యూవల్​ చేయించుకోని రైతుల డబ్బులు ఆ అకౌంట్లలో హోల్డ్ లో ఉంటున్నాయని, పంట రుణాలు క్లియర్ చేసి వారి డబ్బులు తీసుకోవాలని చెప్పామని వివరించారు. పంట రుణాలు క్లియర్​గా ఉన్న రైతులందరికీ రైతుబంధు డబ్బులిస్తున్నట్టు చెప్పారు.