ఉమ్మడి పాలమూరు జిల్లాలో వరి సాగుకే రైతుల మొగ్గు.. 9 లక్షల ఎకరాల్లో వరి సాగు అంచనా

ఉమ్మడి పాలమూరు జిల్లాలో వరి సాగుకే రైతుల మొగ్గు.. 9 లక్షల ఎకరాల్లో వరి సాగు అంచనా
  • ఉమ్మడి పాలమూరు జిల్లాలో 9 లక్షల ఎకరాల్లో వరి సాగు అంచనా
  •     నిరుడు కంటే 30 వేల ఎకరాలు అధికం
  •     ఏరువాక దాటినా జాడ లేని వాన
  •     పత్తి విత్తుకున్నా రాని మొలకలు
  •     డ్రిప్​తో నీటిని అందిస్తున్న రైతులు

మహబూబ్​నగర్, వెలుగు : ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లాలో ఏటా వరి సాగు పెరుగుతోంది. ఈ ఏడాది కూడా నిరుడు కంటే దాదాపు 30 వేల ఎకరాల్లో పంట అధికంగా సాగయ్యే అవకాశం ఉన్నట్లు వ్యవసాయ శాఖ రూపొందించిన లెక్కలు చెబుతున్నాయి. అయితే ఎల్​నినో ఎఫెక్ట్​ వల్ల ఈ ఏడాది వర్షాలు ఆశించిన స్థాయిలో ఉండవని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. ఈ నేపథ్యంలో వరి సాగుపై రైతుల్లో అనిశ్చితి నెలకొంది. సీజన్​ ప్రారంభం కావడంతో వరి నార్లు పోసుకోవాలా? వద్దా? అనే అనుమానం వెంటాడుతోంది.

ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన

వరి సాగుకు నీరు ఎక్కువ అవసరం ఉన్నందున రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని వ్యవసాయ శాఖ ఆఫీసర్లు సూచిస్తున్నారు. వారం రోజులుగా గ్రామాలకు వెళ్లి రైతులను కలుస్తున్నారు. ఎల్​నినో ఎఫెక్ట్​ వల్ల వర్షాలు ఆశించిన స్థాయిలో ఉండవని, వరికి బదులు తక్కువ నీరు అవసరమయ్యే కూరగాయలు, ఆకుకూరలు, కంది, మక్కలు, జొన్న వంటి పంటలు వేసుకోవాలని చెబుతున్నారు. రైతు వేదికల్లో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి, వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా హైదరాబాద్​ నుంచి వ్యవసాయ శాస్ర్తవేత్తలతో మాట్లాడించి రైతుల సందేహాలను నివృత్తి చేస్తున్నారు. ఆరుతడి పంటలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సబ్సిడీలు, ఏ పంటకు ఎంత మద్దతు ధర చెల్లిస్తుందనే విషయాలను వివరిస్తున్నారు. 

వానలు రాకుంటే పత్తికి కష్టకాలమే

ఉమ్మడి పాలమూరు జిల్లాలో వరి తర్వాత రెండో ప్రధాన పంటగా రైతులు పత్తి సాగు చేస్తున్నారు. రోహిణి కార్తెలో వేసవి దుక్కులు చేసుకున్న రైతులు మే చివరి వారం నుంచి ఉమ్మడి జిల్లాలో పత్తి విత్తనాలను విత్తుకున్నారు. ఈ నెల మొదట్లో వర్షం పడడంతో వానలకు ఢోకా ఉండదని భావించారు. కానీ, రెండు వారాలైనా ఇంత వరకు వర్షాలు పడడం లేదు. అక్కడక్కడా వర్షం పడుతున్నా.. ఆ వర్షానికి భూమి పదునెక్కడం లేదు. దీంతో పత్తి విత్తుకున్న చోట్ల ఇంత వరకు మొలకలు రాలేదు. దీంతో రెండు రోజుల నుంచి బోరు సౌలత్​ ఉన్న రైతులు డ్రిప్​ ద్వారా నీటి తడులను అందిస్తున్నారు. నీటి వసతి లేని వారు వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ వారంలోగా వర్షాలు పడకుంటే విత్తనాలు భూమిలోనే ముక్కిపోయే అవకాశం ఉంది. 

భూగర్భ జలాలు అంతంతే..

భూగర్భ జలాలు కూడా వేగంగా అడుగంటిపోయాయి. గతేడాది భారీ వర్షాలు, ప్రాజెక్టులకు సమృద్ధిగా వరద రావడంతో అక్టోబరులో రీచార్జ్​ అయ్యాయి. కానీ, ఈ ఏడాది ఫిబ్రవరి మొదటి వారం నుంచే ఎండలు మొదలవడంతో యాసంగి సాగుకు బోర్ల వినియోగం పెరిగింది. దీంతో భూగర్భ జలాలు తగ్గిపోయాయి. ప్రస్తుతం ఉన్న నిల్వల ప్రకారం వరి సాగుకు బోర్లను వినియోగిస్తే కేవలం నార్లు పోసుకోవడానికి, కరిగెట్ట చేసుకోవడానికి, పంటకు మొదటి తడులు ఇవ్వడానికి మాత్రమే సరిపోతాయని వ్యవసాయ శాఖ హెచ్చరిస్తోంది.

వర్షాలు పడ్డాకే నార్లు పోసుకోవాలి

ఎల్​నినో ఎఫెక్ట్​ వల్ల ఈసారి ఆశించిన స్థాయిలో వర్షాలు ఉండవని వాతావారణ శాఖ చెబుతోంది. దీంతో నీరు ఎక్కువగా అవసరమయ్యే వరి సాగు తగ్గించాలని రైతులకు చెబుతున్నాం. వరి సాగు చేసుకునే రైతులు వర్షాలు పడ్డాకే నార్లు పోసుకోవాలి. 10 ఎకరాల్లో వరి సాగు చేస్తున్న రైతులు ఐదెకరాల్లో సాగు చేసుకోవాలని సూచించాం. తక్కువ నీరు అవసరమయ్యే ఇక్కడి నేలలకు అనువుగా ఉండే మక్క, ఇతర ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలి. 
-వెంకటేశ్, డీఏవో, మహబూబ్​నగర్​

ఉమ్మడి జిల్లాలో వరి సాగు ఇలా..
జిల్లా    గత వానాకాలం    ఈ సీజన్​                     అంచనా
నాగర్​కర్నూల్​        1,80,753    1,92,796
నారాయణపేట        1,88,813    1,98,253
మహబూబ్​నగర్​        1,98,034    2,01,000
వనపర్తి        1,80,000    1,81,000
గద్వాల        1,16,120    1,20,‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌000