ధాన్యం తగులబెట్టి రైతుల నిరసన

ధాన్యం తగులబెట్టి రైతుల నిరసన
  • వడ్లు కొనాలని పలుచోట్ల ధర్నాలు

వెలుగు నెట్​వర్క్​: వడ్లు కొనాలంటూ రాష్ట్రవ్యాప్తంగా రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. చెడుగొట్టువానలతో వడ్లు తడిసి.. మొలకలొస్తున్నా కొనుగోలు చేయకపోవడంపై మండిపడుతున్నారు. సర్కారు తీరును నిరసిస్తూ రోడ్డెక్కుతున్నారు. సోమవారం చాలా చోట్ల రైతులు ధర్నాలు, రాస్తారోకోలు చేశారు. 

తేమ పేరుతో కొర్రీలు పెట్టకుండా కొనుగోలు చేయాలని సూర్యాపేట, దంతాలపల్లి హైవే పై అఖిలపక్షం లీడర్లు  ధర్నా, రాస్తారోకో చేపట్టారు. సూర్యాపేట జిల్లా కుడకుడ  సెంటర్​లో  మొలకెత్తిన ధాన్యాన్ని తేమ పేరుతో కొనకుండా ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్​ నేత,  మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి,  సీపీఐ, సీపీ‌‌‌‌ఎం, టీ‌‌‌‌జే‌‌‌‌ఎస్ లీడర్లు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ వచ్చి స్పష్టమైన హామీ ఇవ్వాలని  దామోదరరెడ్డి డిమాండ్​ చేశారు. ఈ ఆందోళనతో సూర్యాపేట,  దంతాలపల్లి రోడ్డు మీద  భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అఖిలపక్ష నేతలతో  డీ‌‌‌‌ఆర్‌‌‌‌డీ‌‌‌‌ఏ పీడీ కిరణ్ కుమార్ మాట్లాడి.. వెంటనే  కొనుగోళ్లు జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ప్రెసిడెంట్​ చెవిటి వెంకన్న యాదవ్, టీ‌‌‌‌జే‌‌‌‌ఎస్ లీడర్​ధర్మార్జున్,సీపీ‌‌‌‌ఎం నేత మల్లు నాగార్జున రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం రామన్నగూడెం పీఏసీఎస్​సెంటర్​లో వడ్లు కొనుగోలు చేయాలని సూర్యాపేట, -జనగాం హైవేపై ధర్నా నిర్వహించారు. దీంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. తేమ శాతం లాంటి రూల్స్​తో రైతులను ఆఫీసర్లు ఇబ్బంది పెడుతున్నారని రైతులు ఆరోపించారు. ధాన్యం తడిసిన అంశాన్ని జిల్లా అధికారులకు తెలిజేస్తామని ఎస్సై మహేశ్​​ చెప్పడంతో ధర్నాను విరమించారు. ధర్నాలో సీపీఎం నాయకులు రమావత్ రాములు, పీఏసీఎస్​  మాజీ డైరెక్టర్ వజ్జ వినయ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. 

జనగామ మార్కెట్​కు తాళం
వడ్లను వెంటనే కొనాలని డిమాండ్​ చేస్తూ జనగామ అగ్రికల్చర్​ మార్కెట్​ యార్డు గేటుకు తాళం వేసి సుమారు 5 గంటల పాటు రైతులు ధర్నా చేశారు. దీంతో  ఆఫీసర్లు దిగి వచ్చి హామీ ఇచ్చారు. జనగామ  మార్కెట్​ కు రైతులు నెలన్నర కిందటినుంచి వడ్లు తెస్తున్నారు. ఇక్కడ సెంటర్​ ఏర్పాటు చేయకపోవడంతో 180 మంది రైతులకు చెందిన వడ్లు  యార్డులో పేరుకుపోయాయి. వానలు పడుతుండడంతో ధాన్యం కుప్పలు తడిసి, మొలకెత్తుతున్నాయి. ఎన్నిసార్లు అడిగినా సెంటర్​ ఏర్పాటు చేయకపోవడంతో రైతులు  ధర్నాకు దిగారు.  జిల్లా మార్కెటింగ్​ఆఫీసర్​ నాగేశ్వర శర్మ, మార్కెట్​ కమిటీ చైర్​ పర్సన్​ బాల్దె విజయ, మార్కెట్​ సెక్రటరీ జీవన్​ కుమార్​కలెక్టరేట్​కు వెళ్లి కలెక్టర్​ సీహెచ్​ శివలింగయ్యకు సమస్య వివరించారు. మార్కెట్​లో సెంటర్​ ఏర్పాటు సాధ్యం కాదని, దగ్గరలోని మరో సెంటర్​లో వడ్లు కొనేందుకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్​ ఆదేశించారు. మార్కెట్​ నుంచి సెంటర్​కు వడ్లను తరలించేందుకయ్యే ట్రాన్స్​పోర్ట్​ చార్జీలను మార్కెట్​కమిటీ భరించాలని సూచించారు.  అడిషనల్​ కలెక్టర్​ భాస్కర్​ రావు ధర్నా చేస్తున్న  రైతులతో మాట్లాడి.. చిటకోడూరు సెంటర్ కు వడ్లను తరలించి కొనుగోలు చేయిస్తామని హామీ ఇచ్చారు. దీంతో రైతులు ఆందోళన విరమించారు. రైతుల ధర్నాకు కాంగ్రెస్​ సంఘీభావం తెలిపింది. 

ధాన్యం తగులబెట్టి రైతుల నిరసన  
వడ్లను తరలించడంలో  ఆఫీసర్లు నిర్లక్ష్యం చేస్తున్నారంటూ మెదక్ జిల్లా చిలప్​చెడ్ మండలం చిట్కుల్  రైతులు సోమవారం జోగిపేట, - మెదక్ మెయిన్ రోడ్డుమీద రాస్తారోకో చేశారు. తడిసిన ధాన్యం రోడ్డుమీద పోసి తగులబెట్టారు.  కాంటా పెట్టిన ధాన్యం రైస్​మిల్​కు తరలించేందుకు లారీలు రాకపోవడంతో రైతులు రోడ్డెక్కి  రెండు గంటల పాటు రాస్తారోకో చేశారు. రాస్తారోకోతో వెహికల్స్​  నిలిచిపోయాయి. ఎస్సై మల్లారెడ్డి, తహసీల్దార్ సహదేవ్ అక్కడకొచ్చి లారీలు వచ్చేలాచర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వడ్లను  కొనక, కొన్నవాటిని లారీలు లేక తరలించకపోవడాన్ని నిరసిస్తూ మెదక్​ జిల్లా పాపన్నపేట, మిన్​పూర్ లలో  ధర్నా, రాస్తారోకోలు చేపట్టారు. మెదక్,  బోడ్మట్​పల్లి మెయిన్​రోడ్డుపై రెండు గంటల పాటు  రాస్తారోకో చేయగా వాహనాలు పెద్ద ఎత్తున ఆగిపోయాయి. కొనుగోలు కేంద్రాలదగ్గర కుప్పలకు కావలి కాయాల్సివస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యాన్ని తరలించడానికి లారీలు దొరకడంలేదని,  దొరికినా  మిల్లర్లు అన్​లోడ్ చేయడంలేదన్నారు.  మినుపూర్, పాపన్నపేట తహశీల్దార్ ఆఫీసు దగ్గరకూడా రైతులు రాస్తారోకో చేశారు. 

వడ్లను సెంటర్​కు తెచ్చి రోజులు గడుస్తున్న కొనడంలేదంటూ కరీంనగర్​ మండలం నగునూరులో రైతులు, బీజేపీ లీడర్లు స్టేట్​హైవేపై ధర్నాకు దిగారు. వడ్లు తెచ్చి వారమైనా  ఇప్పటికీ రైస్​మిల్ అలాట్ చేయలేదని బీజేపీ మండల అధ్యక్షుడు మాడిశెట్టి సంతోష్, రైతులు ఆరోపించారు. ఓటీపీ సాకుతో వడ్లు కొంటలేరన్నారు.  దాదాపు రెండుగంటల పాటు ధర్నా చేయడంతో రోడ్డుకు రెండుదిక్కులా వెహికల్స్​ నిలిచిపోయాయి. కొనుగోళ్లు వేగవంతమయ్యేలా చూస్తామని ఆఫీసర్లు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. జగిత్యాల రూరల్ మండలం తాటి పల్లి  గ్రామం దగ్గర నేషనల్​హైవేపై రైతుల ఆందోళన కు దిగారు. నూక  ఎక్కువ వస్తుందంటూ  రైస్ మిల్లర్లు ధాన్యం కొనుగోలు చేయడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ట్రాఫిక్ జామ్ కావడం తో పోలీసులు రైతులను సముదాయించి, ఆందోళన విరమింపజేశారు.  

కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం పల్వంచ వాగు వద్ద  హైవేపై  రైతులు రాస్తారోకో చేశారు.  తడిసిన వడ్లను కొనుగోలు చేయాలని,  కొనుగోళ్లు స్పీడప్​ చేయాలని డిమాండ్​ చేస్తూ  మంథని దేవునిపల్లి, పల్వంచకు చెందిన రైతులు రోడెక్కారు.  సెంటర్ల వద్ద వడ్లు అరబోసి రెండు, మూడు వారాలు దాటిందని కొనుగోళ్లు సకాలంలో చేపట్టకపోవటంతో  వానలకు వడ్ల కుప్పలు తడిసిపోతున్నాయని రైతులు తెలిపారు.  దీంతో కామారెడ్డి, - కరీంనగర్​రూట్​లో  గంటపాటు ​ రాకపోకలు నిలిచిపోయాయి.  పోలీసు, రెవెన్యూ ఆఫీసర్లు రైతులతో మాట్లాడి రాస్తారోకో  విరమింపజేశారు.

కాంగ్రెస్​ దీక్ష

వడ్లు వెంటనే కొనాలంటూ కాంగ్రెస్​ ఆధ్వర్యంలో యాదాద్రి కలెక్టరేట్​ వద్ద నిరసన దీక్ష చేపట్టారు.  టీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు మిల్లర్లతో కుమ్మక్కయినందువల్లే సెంటర్లలో వడ్లు సరిగా కొనడం లేదని డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్​కుమార్​రెడ్డి ఆరోపించారు.  వర్షాలకు తడిసి మొలకెత్తిన ధాన్యాన్ని దీక్షలో ప్రదర్శించారు.  వడ్ల కొనుగోలుకు సంబంధించి  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డ్రామా ఆడుతున్నాయని అనిల్​ విమర్శించారు. కార్యక్రమంలో ఆలేరు ఇన్​చార్జి​ బీర్ల అయిలయ్య, పీసీసీ కార్యదర్శి పోత్నక్ ప్రమోద్, తంగెళ్లపల్లి రవికుమార్, జనగాం ఉపేందర్, మహ్మద్ నజీర్, వల్లందాసు ఆదినారాయణ, బీసుకుంట్ల సత్యనారాయణ ఉన్నారు.

తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్​ చేస్తూ  నల్గొండ జిల్లా  నకిరేకల్​ మెయిన్​ సెంటర్​లో అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. వ్యవసాయ మార్కెట్​లో తడిసి మొలకెత్తిన ధాన్యాన్ని  ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని టీపీసీసీ కార్యనిర్వాహక కార్యదర్శి దైద రవీందర్​ డిమాండ్​ చేశారు.

వడ్లు కొనుగోలు చేయాలని డిమాండ్​ చేస్తూ యాదాద్రి కలెక్టరేట్​ వద్ద సీపీఐ, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. కలెక్టర్​ బయటకు రావాలని డిమాండ్​ చేస్తూ కలెక్టరేట్​ఎదుట బైఠాయించారు. అయినా ఆఫీసర్లు బయటకు రాకపోవడంతో కలెక్టరేట్​లోకి చొచ్చుకెళ్లడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ  తోపులాట జరిగింది. సీపీఐ లీడర్లను అరెస్ట్​ చేసి బొమ్మలరామారం స్టేషన్​కు తరలించారు.  

నెలరోజులైనా బార్​దాన్​ ఇయ్యలే

వడ్లు కొనాలని డిమాండ్​ చేస్తూ సోమవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లోని సొసైటీ సెంటర్​ దగ్గర  సోమవారం ఉదయం రైతులు ధర్నా చేశారు. తాము వడ్లు తెచ్చి నెలరోజులైనా బార్​దాన్​ ఇవ్వకపోవడంతో అవస్థలు పడుతున్నామని రైతులు వాపోయారు. ప్రభుత్వం కొనకుంటే తామే నేరుగా రైస్​మిల్లులకే  కొట్టేవాళ్లమని,  తూకం వేసిన వడ్లను మిల్లర్లు తీసుకెళ్లడంలేదని అన్నారు. ఇప్పటికే రెండు సార్లు తడిసిన వడ్లను ఆరబోసినట్టు చెప్పారు. ఆందోళన చేస్తున్న రైతులను సొసైటీ చైర్మెన్​బొలిశెట్టి శివయ్య కలిసి మాట్లాడారు. రైతులకు బార్​దాన్​ఇప్పించాలని, మిల్లులకు చేరిన వడ్లు వెంటనే అన్​లోడ్​ చేసుకునేలా చూడాలని ఆయన ఆర్డీఓకు ఫోన్​ చేసి కోరారు.  దీంతో రైతుల అందోళన విరమించారు.