మెదక్ టౌన్, వెలుగు: మెదక్ జిల్లా హవేళీ ఘనపూర్ కొనుగోలు కేంద్రానికి లారీలను పంపకుండా ఇబ్బంది పెడుతున్నారని రైతులు వాపోయారు. సోమవారం మెదక్– బోధన్ హైవేపై బైఠాయించి ట్రాక్టర్, ధాన్యం బస్తాలను అడ్డుగా ఉంచి ఆందోళన చేశారు. తహసీల్దార్ సింధురేణుకతో రైతులు వాగ్వాదానికి దిగారు. లారీలు వచ్చేలా చర్యలు తీసుకుంటామని తహసీల్దార్, ఎస్సై సత్యనారాయణ నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. జిల్లాలోని కొనుగోలు కేంద్రాల్లో సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో మెదక్ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. సీపీఎం జిల్లా కార్యదర్శి నర్సయ్య, కార్యవర్గ సభ్యులు మల్లేశం పాల్గొన్నారు.
నల్గొండ: జిల్లాలో రైతులు పండించిన వడ్లను యుద్ధప్రాతిపదికన కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. కలెక్టర్‌ను కలిసి సమస్యలు పరిష్కరించాలని వినతిపత్రం అందజేశారు. సీపీఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యుడు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, డబ్బికార్ మల్లేశం, కందాల ప్రమీల, నారి ఐలయ్య, పాలడుగు నాగార్జున, నర్సిరెడ్డి పాల్గొన్నారు.
శాలిగౌరారం(నకిరేకల్): మండలంలోని అడ్లూరు రైతులు నకిరేకల్–శౌలిగౌరారం రోడ్డుపై రాస్తారోకో చేశారు. వడ్లు తరలించేందుకు డ్రైవర్లు భారీగా డబ్బులు అడుగుతున్నారని తెలిపారు. పంటను సకాలంలో మార్కెట్ యార్డుకు తీసుకెళ్లలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తహసీల్దార్ మాధవరావు అక్కడికి చేరుకొని సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
