
- మినిస్టర్, సీఎంఓ సెక్రెటరీల టూర్‌కు అడ్డు తగిలిన చిన్నోనిపల్లి గ్రామస్థులు
- అప్పుడు రూ.70 వేలిచ్చి ఇప్పుడు పొమ్మంటే ఎట్లా అని ప్రశ్న?
- రూ.20 లక్షలివ్వాలని డిమాండ్
- కరెంట్ కట్‌చేసి ఖాళీ చేయించాలన్న స్మితా సబర్వాల్
గద్వాల/అయిజ, వెలుగు: ‘ఇన్నేండ్లు రిజర్వాయర్ గురించి ఎందుకు మాట్లాడలే...ఇప్పుడొచ్చి భూములివ్వాలంటే ఎట్లా? మాకు రిజర్వాయర్ అవసరం లేదు. సాగు చేసుకుంటున్న భూములు, ఉంటున్న ఇండ్లను ఇచ్చేది లేదు’ అంటూ చిన్నోనిపల్లి రిజర్వాయర్ లో భూములు కోల్పోయిన రైతులు, ముంపు గ్రామస్తులు శుక్రవారం ఆందోళన చేశారు. రిజర్వాయర్ పరిశీలనకు వచ్చిన ఎక్సైజ్ మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్, సీఎంఓ సెక్రెటరీ స్మితా సబర్వాల్, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, అబ్రహంల వెహికిల్స్‌ను అడ్డుకునే ప్రయత్నం చేయగా పోలీసులు ఆపారు. సీఎంఓ సెక్రెటరీ ఒకవైపు ఆఫీసర్లతో సమీక్ష చేస్తుండగానే మరొకవైపు గ్రామస్తులు, రైతులు ప్రభుత్వానికి, మినిస్టర్ కు, సీఎం కేసీఆర్ కు, ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేసిన వినిపించుకోలేదు. తమ సమస్యలు వినకుండా ఆఫీసర్లతో రివ్యూ చేయడం ఏమిటని నిలదీశారు. ముందు తమ ప్రాబ్లమ్స్ విన్నాకే అధికారులతో మీటింగ్ పెట్టుకోవాలన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ 2006లో నెట్టెంపాడు ఎత్తిపోతల స్కీంలో భాగంగా 2300 ఎకరాల్లో1.6 టీఎంసీల కెపాసిటీతో రిజర్వాయర్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారన్నారు. దీన్ని తాము గతంలోనే అడ్డుకున్నామని, కానీ, బలవంతంగా భూమిని సేకరించిన తర్వాత పనులను ఆపేశారన్నారు. దీంతో తమ ఇండ్లల్లో ఉంటూ పొలాలు సాగు చేసుకుంటున్నామన్నారు. అప్పుడే ఊరిని, పొలాలను ఖాళీ చేయించి ఉంటే ఎక్కడికైనా వెళ్లి బతికేవాళ్లమని, ఇప్పుడు వచ్చి వెళ్లిపొమ్మంటే ఎక్కడికి వెళ్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పట్లో పరిహారం కింద ఎకరాకు కేవలం రూ.75 వేలు మాత్రమే ఇచ్చారని, ఇప్పుడు ఎక్కడ చూసినా ఎకరం పొలం రూ.20 లక్షలకు తక్కువ లేదన్నారు. అప్పటి రేటుతో ఇప్పుడు తాము పొలాలు కొనే పరిస్థితి లేదన్నారు. ఇప్పటి మార్కెట్ వాల్యూకు అనుగుణంగా పరిహారం ఇవ్వాలన్నారు. అలాగే గ్రామంలో కుటుంబాలు పెరగడంతో కొత్తగా ఇండ్లు కట్టుకున్నామని, వాటికి కూడా నష్టపరిహారం చెల్లించాలన్నారు. ఆర్ఆర్ కాలనీలో డబుల్‌బెడ్ రూమ్ ఇండ్లు కట్టించిన తర్వాతే తాము విలేజ్ ఖాళీ చేస్తామన్నారు. అంతవరకు ఊరిని వదిలి పోయే ప్రసక్తే లేదన్నారు.
45 రోజుల్లో కంప్లీట్ చేయాలి
రిజర్వాయర్ నిర్మాణాన్ని 45 రోజుల్లో కంప్లీట్ చేయాలని సీఎంఓ సెక్రెటరీ స్మితా సబర్వాల్ఆఫీసర్లను ఆదేశించారు. శుక్రవారం హెలికాప్టర్ లో మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, అబ్రహంలతో కలిసి నేరుగా రిజర్వాయర్ ప్రాంతానికి చేరుకొని పనులను పరిశీలించారు. ఆఫీసర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇరిగేషన్ ఆఫీసర్లపై ఫైర్ అయ్యారు. చిన్న చిన్న రీజన్స్‌తో పనులు ఇన్నిరోజులు పెండింగ్ పెట్టడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకోసం లేట్ చేశారని, ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారని ప్రశ్నించగా వారు ఆన్సర్ఇవ్వలేదు. దీంతో అసహనం వ్యక్తం చేశారు. రూ.39 కోట్లతో నిర్మించాలనుకున్న ప్రాజెక్టులో దాదాపుగా రూ.33 కోట్ల పనులు పూర్తయ్యాయని, మిగతా రూ.6కోట్ల పనులకు ఇంత లేట్చేయడం కరెక్ట్‌కాదన్నారు. పాత కాంట్రాక్టర్లకు నోటీసులివ్వాలని, పనులు చేయకపోతే వేరే కాంట్రాక్టర్ ద్వారా 45 రోజుల్లో కంప్లీట్ చేయించాలన్నారు. పనులపై వారం వారం సమీక్ష ఉంటుందని, ఎప్పటికప్పుడు రిపోర్ట్స్ఇవ్వాలన్నారు. విలేజ్ లో కరెంట్ కట్ చేసి గ్రామస్థులను ఖాళీ చేయించాలని ఆదేశించారు. అడిషనల్ కలెక్టర్ శ్రీ హర్ష, ఇరిగేషన్ ఆఫీసర్లు ఉన్నారు.