ఇంద్రవెల్లి, వెలుగు: ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని మిత్తల్ జిన్నింగ్ మిల్లులో కేస్లాగూడ గ్రామానికి చెందిన రైతులు మెస్రం మోతీరాం, భీంరావు పత్తిని సీసీఐ అధికారులు కొనుగోలు చేయకపోవడంతో ఆందోళనకు దిగారు. మంగళవారం ప్రధాన రహదారిపై ఎడ్ల బండ్లతో రాస్తారోకో చేపట్టారు. అరగంట పాటు ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఎడ్ల బండ్లు, చిన్న వెహికల్స్‌లో తీసుకొస్తున్న పత్తిని సీసీఐ అధికారులు కొనేందుకు నిరాకరిస్తున్నారని తెలిపారు.
దీంతో దళారులకు తక్కువ ధరకు అమ్మి నష్ట పోతున్నామని వాపోయారు. తమ నుంచి కొనుగోలు చేసిన పత్తిని దళారులు సీసీఐకి అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారని విమర్శించారు. ఎస్సై సాయన్న రైతులు, సీసీఐ అధికారులతో మాట్లాడి రాస్తారోకోను విరమింపజేశారు. నాణ్యత లేకపోవడంతోనే పత్తి పంటను కొనుగోలు చేయలేదని సీసీఐ ఆఫీసర్లు తెలిపారు.
