జమ్మికుంట పట్టణంలోని మక్కలు అన్ లోడ్ చేసు కుంటలేరని రైతుల ధర్నా

జమ్మికుంట పట్టణంలోని మక్కలు అన్ లోడ్ చేసు కుంటలేరని రైతుల ధర్నా
  •     జమ్మికుంట ఫ్లై ఓవర్​పై గంటన్నర పాటు ట్రాఫిక్ జామ్

జమ్మికుంట, వెలుగు: కరీంనగర్  జిల్లా జమ్మికుంట పట్టణంలోని కొత్తపల్లి బ్రిడ్జి వద్ద మక్క రైతులు రోడ్డెక్కారు. 15 రోజులుగా మక్కజొన్న, వడ్లను వ్యవసాయ మార్కెట్ కు తీసుకొచ్చారు. దీనికి తోడు జయశంకర్  భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి, చిట్యాల, రేగొండ, టేకుమట్ల మండలాలకు చెందిన రైతుల వడ్లకు జమ్మికుంట, హుజూరాబాద్  పట్టణాల్లోని మిల్లులకు ట్రక్  షీట్లు ఇచ్చారు. 

దీంతో మక్కల ట్రక్  షీట్లు ఇచ్చిన మిల్లులకు తీసుకెళ్తే, తాము కొనుగోలు చేయమని తమ వద్ద ఇప్పటికే స్టాక్ ఉందని చెప్పడంతో రెండు రోజుల నుంచి రైతులు మిల్లుల చుట్టూ తిరుగుతున్నారు. రైతులను పట్టించుకోకపోవడంతో పంటను కొనుగోలు చేయాలని డిమాండ్​ చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. గంటన్నర పాటు రాస్తారోకో నిర్వహించడంతో ఫ్లై ఓవర్ పై ట్రాఫిక్  నిలిచిపోయింది. విషయం తెలుసుకున్న అధికారులు రైతుల వద్దకు చేరుకొని పంట దిగుబడులు అన్​లోడ్​ చేసుకునేలా చూస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

గోపాల్ పేటలో రాస్తారోకో

రేవల్లి: యాసంగి వడ్ల కొనుగోళ్లలో ఆలస్యం చేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. వనపర్తి జిల్లా గోపాల్‌‌‌‌పేట్, ఏదుల, రేవల్లి మండలాలకు చెందిన రైతులు శుక్రవారం గోపాల్ పేట్  ప్రధాన రహదారిపై వడ్ల బస్తాల ట్రాక్టర్లతో రాస్తారోకో చేశారు. సొంత డబ్బులతో గన్నీ బ్యాగులు కొని హమాలీలుగా మారి వడ్లు తెచ్చినా అధికారులు, మిల్లర్లు లోడింగ్, అన్‌‌లోడింగ్ చేయకుండా ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

లారీల కొరత వేధిస్తోందని వాపోయారు. ఎమ్మెల్యే, కలెక్టర్  రావాలంటూ నినాదాలు చేశారు. ఆందోళనకారులను తరలించేందుకు యత్నించగా రైతులు, పోలీసుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. కలెక్టర్, ఉన్నతాధికారులు వచ్చి తరుగు లేకుండా వడ్లు కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చేంత వరకు కదిలేది లేదని రైతులు, మహిళలు రోడ్డుపై కూర్చోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

పురుగు మందు డబ్బాతో రైతు నిరసన..

ఎల్లారెడ్డిపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలోని ఐకేపీ సెంటర్​లో శుక్రవారం గ్రామానికి చెందిన గన్న రాజు రెడ్డి పురుగు మందు డబ్బాతో ఆందోళనకు దిగాడు. నెల రోజులుగా వడ్లు కొనుగోలు చేయకుండా వేధిస్తున్నారని, నిర్వాహకులు సీరియల్ గా వడ్లు కాంటా చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని రైతు చేతిలోని పురుగు మందు డబ్బాను లాక్కున్నారు.