- నష్టపోతున్న జొన్న, మక్క, శనగ, పల్లి, సన్ ఫ్లవర్ రైతులు
- మార్కెట్‌లో అగ్గువ ధరలకు అమ్మకాలు
హైదరాబాద్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం ప్రైస్ సపోర్ట్ స్కీమ్‌ను అమలు చేయకపోవడంతో రాష్ట్రంలో ప్రత్యామ్నాయ పంటలైన జొన్న, మక్కజొన్న, శనగ, పల్లి, సన్‌ఫ్లవర్ రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలో వరి ప్రత్యామ్నాయంగా పంటలు సాగు చేయాలని ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నప్పటికీ, ఆ పంటలకు సరైన మద్దతు లేక రైతులు నష్టపోతున్నరు. కేంద్రం అనుమతి లేకపోవడంతో మద్దతు ధర దక్కక, మార్కెట్ ఇంటర్‌వెన్షన్ స్కీమ్ అమలు కాకపోవడంతో రైతులు అగ్గువ ధరలకు పంటలను ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకొని నష్టాల్లో
మునుగుతున్నారు.
ఒకవైపు వరి సాగును తగ్గించి ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను మళ్లించాలని సర్కారు చెబుతున్నా.. మరోవైపు ఆ పంటల కొనుగోళ్లను పట్టించుకోకపోవడం ప్రహసనంగా మారింది. అలాగే మార్కెట్ ఇంటర్‌వెన్షన్ స్కీమ్ అమలులో కేంద్రం నిర్లక్ష్యం కారణంగా రాష్ట్రంలో పంట కొనుగోళ్లు నిలిచిపోతున్నాయి. పంట కోతలు పూర్తయినా కొనుగోలు కేంద్రాలు ప్రారంభంకాకపోవడం, పరిమిత స్థాయిలో మాత్రమే పనిచేయడం రైతుల ఆందోళనకు దారితీస్తోంది.
జొన్న కొనుగోలు కేంద్రాలే చాల్ కాలే
పంట కోతలు మొదలై రోజులు గడుస్తున్నా కొనుగోళ్లు ప్రారంభించడం లేదు. సాధారణంగా కేంద్రం అనుమతితో నాఫెడ్ ఆధ్వర్యంలో మార్క్‌ఫెడ్ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి పంటలను మద్దతు ధరకు కొనుగోలు చేయాలి. కానీ, ప్రస్తుతం ఈ ప్రక్రియ పూర్తిగా స్తంభించింది. జొన్న పంట కోతలు ముగిసినా కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాలేదు. కేంద్రం నుంచి అనుమతులు రాకపోగా, రాష్ట్ర సర్కారు వద్ద జొన్నల కొనుగోళ్ల ఫైల్ పెండింగ్‌లోనే ఉంది. దీంతో జొన్నలకు మద్దతు ధర రూ.3,699 ఉండగా, మార్కెట్‌లో రూ.2 వేల లోపే రైతులు అమ్ముకోవాల్సి వస్తోంది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
శనగ కొనుగోళ్లు మధ్యలోనే నిలిపివేత
శనగ కొనుగోళ్లకు కేంద్రం 29 వేల టన్నులకే అనుమతి ఇవ్వడంతో లక్ష్యం పూర్తికాగానే కొనుగోళ్లు నిలిపివేశారు. రాష్ట్రంలో సుమారు 2 లక్షల టన్నుల దిగుబడి అంచనా ఉన్నప్పటికీ, మిగిలిన పంటకు కొనుగోలు లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మద్దతు ధర రూ.5,875 ఉన్నా, ప్రైవేట్ మార్కెట్‌లో రూ.4 వేల నుంచి 5 వేల మధ్య మాత్రమే ధర లభిస్తోంది.
మక్క రైతుల గోస
మక్కజొన్న రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 12.94 లక్షల ఎకరాల్లో మక్కసాగు జరిగి, 39 లక్షల టన్నుల దిగుబడి అంచనా ఉన్నప్పటికీ కొనుగోలు కేంద్రాలు తగినంతగా లేవు. గ్రామ స్థాయిలో ఏర్పాటు చేయాల్సిన కేంద్రాలను మండల స్థాయికి పరిమితం చేయడంతో రైతులు దూర ప్రాంతాలకు పంటలు తరలించాల్సి వస్తోంది. దీంతో మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో మక్కలు పోటెత్తుతున్నాయి. కొనుగోళ్లు లేటవడంతో రైతులు వ్యవసాయ మార్కెట్లలో ప్రైవేటు వ్యాపారులకు రూ.1400 నుంచి రూ.1600 లోపే అగ్గువకు అమ్ముకుంటున్నరు. దీంతో భారీ నష్టాలు చవిచూస్తున్నారు.
వరికి ప్రాధాన్యం, ప్రత్యామ్నాయాలపై నిర్లక్ష్యం
ఒకవైపు వరిసాగును పరిమితం చేయాలని ప్రభుత్వం సూచిస్తుండగా, మరోవైపు వరి కొనుగోళ్లకు మాత్రం భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 8,251 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించి ఇప్పటికే 2 వేలకు పైగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఈ సీజన్లో రూ.22 వేల కోట్లు ఖర్చుచేసి దాదాపు 90 లక్షల టన్నుల ధాన్యం సేకరణకు సిద్ధమయ్యింది. అయితే, ప్రత్యామ్నాయ పంటల విషయంలో మాత్రం అదే స్థాయి దృష్టి పెట్టకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.
“ప్రత్యామ్నాయ పంటలు వేయమంటరు. కానీ, పంట అమ్ముకునే పరిస్థితులు కల్పించరు” అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం లోపంతో మద్దతు లేక రైతులు నష్టాల్లో కూరుకుపోతున్నారు. పీఎస్‌ఎస్, మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్‌లను సమర్థంగా అమలు చేసి రైతులకు మద్దతు ధర కల్పించకపోతే పంటల కొనుగోళ్లపై ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు

