- వడ్లకు మద్దతు ధర చెల్లింపులో మిల్లర్లు, రైతుల మధ్య ఘర్షణ
- కొనుగోళ్లను నిలిపివేసిన మిల్లర్లు
- ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి జోక్యంతో ముగిసిన వివాదం
మిర్యాలగూడ, వెలుగు: వడ్లకు మద్దతు ధర చెల్లించకుండా కొర్రీలు పెడుతున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ఆందోళనతో మిల్లర్లు కొనుగోళ్లు నిలిపివేయడంతో నల్గొండ జిల్లా నార్కట్పల్లి, అద్దంకి ప్రధాన రహదారిపై ధర్నాకు దిగారు. సోమవారం సాయంత్రం మిర్యాలగూడ మండలం యాద్గార్ పల్లి గ్రామ శివారులోని ఓ రైస్ మిల్లుకు ఓ రైతు తెచ్చిన వడ్ల నాణ్యత సరిగా లేదని, మిల్లు గుమస్తా అడిగిన ధర రాదని చెప్పాడు. కనీసం మద్దతు చెల్లించాలని రైతు కోరగా, ఈ విషయంపై ఘర్షణ జరిగింది. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న మిర్యాలగూడ మిల్లర్లు అప్పటి నుంచి మంగళవారం ఉదయం 11 గంటల వరకు వడ్ల కొనుగోళ్లు నిలిపివేశారు.
రైతుల ఆందోళన..
సీజన్ ప్రారంభంలో చెల్లించినట్లుగానే ధర పెట్టాలని డిమాండ్ చేస్తూ మంగళవారం రైతులు వేములపల్లి మండలం శెట్టిపాలెం పరిధిలోని మహా తేజ మిల్లు వద్ద అద్దంకి, నార్కెట్ పల్లి హైవేపై ఆందోళనకు దిగారు. పచ్చ గింజ, తాలు, ఇతర సాకులతో మిల్లర్లు సరైన ధర చెల్లించడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల రాస్తారోకోతో ట్రాఫిక్ నిలిచిపోయింది. వేములపల్లి ఎస్సై వెంకటేశ్వర్లు రైతులతో మాట్లాడి ఆందోళన విరమింపజేశారు. విషయం తెలుసుకున్న మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మంగళవారం అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్, డీఎస్పీ రాజశేఖర్ రాజుతో కలిసి మిల్లర్లతో చర్చించారు. రైతులకు మద్దతు ధర చెల్లించాలని, సమన్వయంతో వడ్లు కొనుగోలు చేయాలని ఆదేశించారు.
