వరంగల్‌‌లో అకాల వర్షంతో ఆగమవుతున్న రైతులు

వరంగల్‌‌లో అకాల వర్షంతో  ఆగమవుతున్న రైతులు

నర్సింహులపేట/మంగపేట/కమలాపూర్‌‌, వెలుగు : వరి కోతలు ముమ్మరంగా జరుగుతున్న టైంలో తుఫాన్‌‌ కారణంగా అకాల వర్షం పడుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి వరంగల్‌‌ జిల్లాలోని కమలాపూర్‌‌, మంగపేట, నర్సింహులపేటతో పాటు పలు మండలాల్లో మంగళవారం వర్షం పడింది. దీంతో కొనుగోలు కేంద్రాల్లో పోసిన వడ్లు తడిసిపోయాయి.

వడ్ల రాశులపై నిలిచిన నీటిని తొలగించేందుకు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మరో వైపు టార్పాలిన్లు అందుబాటులో లేకపోవడంతో వడ్లు తడవకుండా చూసుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. వడ్లు తడిసిపోతుండడంతో తేమ శాతం పెరిగి కొనుగోళ్లు కూడా ఆలస్యం అయ్యే అవకాశం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో పొలాల్లో వరి పంట నేలవాలడంతో కోసేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.