చివరి దశలో ఫాంహౌజ్, యాదాద్రి రోడ్డు పనులు

చివరి దశలో ఫాంహౌజ్, యాదాద్రి రోడ్డు పనులు

యాదాద్రి, వెలుగు: సీఎం ఏ ఇబ్బంది లేకుండా యాద్రాద్రి వెళ్లేందుకు గోపాల్​పూర్​నుంచి యాదగిరిగుట్టకు వేస్తున్న రోడ్డు పనులు జెట్ స్పీడ్​తో సాగుతుంటే.. సీఎం దత్తత తీసుకున్న వాసలమర్రి రూపురేఖలు రెండేళ్లలో ఏమాత్రం మారలేదు. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి టెంపుల్​ను పునర్నిర్మించాలని సీఎం కేసీఆర్​నిర్ణయించి ఆ పనులను 2016లో ప్రారంభించారు. అప్పటి నుంచి ఆయన అనేకసార్లు గుట్టకు వచ్చారు. ఎర్రవెల్లి ఫాంహౌజ్ నుంచి యాదాద్రికి వెళ్లేందుకు గతంలో చిన్నరోడ్డు మాత్రమే ఉండేది. చిన్న రోడ్డు మీద ప్రయాణం సౌకర్యంగా లేకపోవడంతో 2019 డిసెంబర్​లో యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం గోపాల్​పూర్ నుంచి వాసాలమర్రి, తుర్కపల్లి మీదుగా గుట్టకు 20 కిలోమీటర్ల మేర కొత్త రోడ్డు పనులు ప్రారంభించారు. సీఎం ఫాంహౌస్​ కోసమే ఈ రోడ్డు వేస్తున్నారని ప్రతిపక్షాలు అప్పట్లో విమర్శించినా పట్టించుకోలేదు. అగ్రిమెంట్ ప్రకారం ఈనెలాఖరు నాటికి రోడ్డు పూర్తి చేయాల్సి ఉండడంతో పనులు స్పీడుగా సాగుతున్నాయి. 

రెండు సార్లు సర్వేలు.. డీపీఆర్​లు

2020 అక్టోబర్​ 31న  కేసీఆర్​జనగామ జిల్లా కొడకండ్లలో రైతు వేదిక ప్రారంభించి ఎర్రవెల్లికి తిరిగి వెళ్తూ వాసాలమర్రిలో ఆగారు. నవంబర్​ 1న గ్రామ సర్పంచ్​ఆంజనేయులును ఫాంహౌజ్​కు పిలిపించుకొని గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్టు, రూ.100 కోట్లతో బంగారు వాసలమర్రిగా మార్చనున్నట్టు  ప్రకటించారు. సీఎం ఆదేశాలతో ఆఫీసర్లు సర్వే చేసి.. డీపీఆర్​ రెడీ చేశారు. ఆ ప్లాన్​ సీఎం పేషీకి పంపినా చాలాకాలం పాటు పట్టించుకోలేదు. తిరిగి  2021 ఆగస్టు 4న రెండోసారి గ్రామానికి వచ్చిన కేసీఆర్​ దళితబంధును ప్రకటించారు. ఊరులోని పెంకుటిండ్లు మొత్తం కూలగొట్టి ఆరేడు నెలల్లో కొత్త ఇండ్లు కట్టిస్తానని హామీ ఇచ్చారు. ఈసారి కూడా ఆఫీసర్లు ఊళ్లో తిరిగి సర్వే చేశారు. ఇండ్లు, మౌలిక వసతులు, అభివృద్ధి పనులకు రూ. 165 కోట్లు అవసరమవుతాయని లెక్కగట్టి.. 2022 జులైలో మరోసారి డీపీఆర్ పంపారు.  దళితబంధు అమలయ్యింది కానీ మిగతా పనుల్లో ఒక్కటి కూడా మొదలుకాలేదు.