దేశంలో వాహనదారు ఉపయోగించే ఫాస్ట్‌ట్యాగ్ విధానంలో మరో కొత్త మార్పును ప్రభుత్వం అమలు చేసింది. అక్టోబర్ 31, 2024 నుంచి కేంద్ర ప్రభుత్వం కొత్త KYV(Know Your Vehicle) నిబంధనను ప్రవేశపెట్టింది. దీని ద్వారా వాహనం దానికి అనుసంధానమైన ఫాస్ట్‌ట్యాగ్ సరిపోతున్నాయా లేదా అనే విషయాన్ని నిర్ధారించాల్సి ఉంటుంది. దీనిని ఫాస్ట్‌ట్యాగ్(FASTag) మోసాలను అరికట్టడమే లక్ష్యంగా రూపొందించారు.
దేశంలోని అనేక ప్రాంతాల్లో ట్రక్కులు, కార్ల కోసం తీసుకొచ్చిన ఫాస్ట్‌ట్యాగ్ లను మార్చి వాడుతున్నారన్న ఫిర్యాదులు ప్రభుత్వానికి ఎక్కువయ్యాయి. ఇలాంటి చర్యల వల్ల ప్రభుత్వానికి భారీ ఆదాయ నష్టం జరుగుతోంది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ట్రాన్స్‌పోర్ట్ శాఖ కొత్తగా KYV విధానాన్ని తీసుకువచ్చింది. దీనిలో భాగంగా ప్రతి వాహన యజమాని మూడేళ్లకు ఒకసారి తన వాహనానికి సంబంధించిన వివరాలను అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది. అందులో రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (RC), వాహన ముందుభాగం ఫోటో, ఫాస్ట్‌ట్యాగ్ స్పష్టంగా కనిపించేలా ఫొటో, వాహన నంబర్ ఉన్న ఫోటోతో పాటు వాహనం ప్రక్క నుంచి తీసిన ఫొటోలు.. వాహనంలో ఎన్ని యాక్సిల్స్ ఉన్నాయో చూపించే విధంగా ఉండాలి. ఈ వివరాలను ఫాస్ట్‌ట్యాగ్ జారీచేసే బ్యాంకు లేదా సంస్థ వాహన్ డేటాబేస్‌తో సరిపోల్చి అథెంటికేషన్ పూర్తి చేయాల్సి ఉంటుంది.
కేవైసీ అథెంటికేషన్ పూర్తి కాకపోతే ఫాస్ట్‌ట్యాగ్ ఆటోమేటిక్‌గా నిలిపివేయబడుతుంది. అందువల్ల అన్ని వాహనదారులు నిర్దేశిత గడువులోపు తమ KYV ప్రక్రియను పూర్తి చేయాల్సిందే. ఈ విధానం వాహనాలను సరిగ్గా గుర్తించేలా చేస్తూ టోల్ చార్జీలలో పారదర్శకత తీసుకురానుంది. ఫాస్ట్‌ట్యాగ్ యూజర్లు తమ బ్యాంకు యాప్ లేదా అధికారిక ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా వివరాలను అప్‌డేట్ చేయవచ్చు. ఫోటోలు స్పష్టంగా ఉండేలా, ఫైల్ సైజు పరిమితికి లోబడి అప్లోడ్ చేయాల్సి ఉంటుందని అధికారులు సూచిస్తున్నారు.
వాహనదారులు సకాలంలో KYV ప్రక్రియను పూర్తి చేయకపోతే టోల్ గేట్ల వద్ద ట్యాగ్ పనిచేయకపోవచ్చు. ఈ కొత్త వ్యవస్థ వాహన మోసాలను తగ్గించటంలో మరియు నియంత్రణను బలోపేతం చేయటంలో కీలక పాత్ర పోషిస్తుందని రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు. ఫాస్ట్‌ట్యాగ్ సదుపాయం నిరంతరంగా కొనసాగాలంటే వాహనదారులు అన్ని అవసరమైన పత్రాలను సమయానికి అప్ డేట్ చేయటం తప్పనిసరిగా వారు హెచ్చరిస్తున్నారు.
