మనసేలా వచ్చిందయ్యా నీకు..! కవల పిల్లలను దారుణంగా చంపిన తండ్రి

మనసేలా వచ్చిందయ్యా నీకు..! కవల పిల్లలను దారుణంగా చంపిన తండ్రి

ముంబై: కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే పిల్లల పాలిట కాలయముడు అయ్యాడు. కుటుంబ కలహాల వల్ల అల్లారుముద్దుగా పెంచుకున్న కవల పిల్లలను అత్యంత దారుణంగా గొంతు కోసి హత్య చేశాడు. పిల్లలను చంపేసిన తర్వాత నేరుగా పోలీస్ స్టేషన్‎కెళ్లి నేరం అంగీకరించి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఈ హృదయ విదారక ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. 

మహారాష్ట్రలోని వాషిమ్ జిల్లాకు చెందిన రాహుల్ చవాన్‎కు పెళ్లైంది. భార్య, ఇద్దరు కవల (ఆడ) పిల్లలు ఉన్నారు. పిల్లల వయస్సు రెండున్నర సంవత్సరాలు. ఇదిలా ఉంటే.. గత కొద్దిరోజులుగా రాహుల్ చవాన్‎కు భార్యతో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో 2025, అక్టోబర్ 21న ఫ్యామిలీతో కలిసి బైక్‎పై మనోరా తాలూకాలోని రుయిగోస్తా గ్రామానికి వెళ్తుండగా రాహుల్ చవాన్‎కు అతడి భార్యకు మరోసారి వాగ్వాదం జరిగింది. 

గొడవ ముదరడంతో అతడి భార్య బండి దిగి నడుచుకుంటూ తల్లిగారింటికి వెళ్లిపోయింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన రాహుల్.. తన కవల కుమార్తెలను బుల్ధానా జిల్లా అంధేరా గ్రామంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి హత్య చేశాడు. కనికరం లేకుండా కూతుర్లు ఇద్దరి గొంతులు కోసి దారుణంగా హతమార్చాడు. అనంతరం ఏమి తెలియనట్లు తిరిగి ఇంటికి వెళ్లిపోయాడు.

ఐదు రోజుల తర్వాత (అక్టోబర్ 26) వాషిమ్ జిల్లాలోని అసేగావ్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి రాహుల్ చవాన్ లొంగిపోయాడు. తన కవల కుమార్తెలను హత్య చేసినట్లు పోలీసుల ఎదుట నేరం అంగీకరించాడు. పోలీసులు వెంటనే అతన్ని అదుపులోకి తీసుకుని దర్యాప్తు ప్రారంభించారు. 

రాహుల్ చెప్పిన వివరాల ఆధారంగా పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి ఇద్దరు బాలికల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. రెండు మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్త ఆసుపత్రికి తరలించి.. రాహుల్ చవాన్‎పై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.