- మనస్తాపంతో ఆలయ కోనేరులో దూకిన తండ్రీకొడుకులు
- లింగాలఘణపురం మండలం బండ్లగూడెంలో విషాదం
రఘునాథపల్లి (లింగాలఘణపురం), వెలుగు : నెల రోజుల కింద భార్య చనిపోవడంతో ఆ బాధను తట్టుకోలేక ఓ వ్యక్తి కొడుకుతో కలిసి కోనేరులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన జనగామ జిల్లా లింగాలఘణపురం మండలం బండ్లగూడెంలో శుక్రవారం జరిగింది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం... లింగాలఘణపురం మండల కేంద్రానికి చెందిన వరయూరు లక్ష్మీనరసింహాచార్యులు (40) ఏడేండ్ల కింద బండ్లగూడెంలోని బండగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో అర్చకుడిగా నియమితులయ్యారు. భార్య శ్రీదేవి, కుమారుడు పవనకుమారాచార్యులు (20)తో కలిసి మండల కేంద్రంలో ఉంటూ.. రోజూ బండ్లగూడెం గుడికి వచ్చి పూజలు నిర్వహించేవారు. లక్ష్మీనరసింహాచార్యులు భార్య శ్రీదేవి గత నెలలో చనిపోయారు.
అప్పటినుంచి తండ్రీకొడుకులు మానసికంగా కుంగిపోయారు. బుధవారం నుంచి ఇద్దరూ కనిపించకపోవడంతో గ్రామస్తులు, మిగతా కుటుంబసభ్యులు తెలిసినచోటల్లా వెదికారు. శుక్రవారం ఉదయం బండగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ గుండంలో తండ్రీకొడుకుల మృతదేహాలు కనిపించాయి. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో డీసీపీ రాజమహేంద్రనాయక్, సీఐ శ్రీనివాస్‌రెడ్డి, ఎస్సై శ్రావణ్‌కుమార్ ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు.
