కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కూతురి పాలిట కాలయముడయ్యాడు. సర్పంచ్ పదవి కోసం కన్న కూతురిని అత్యంత కిరాతకంగా చంపేశాడు. మానవ విలువలు మంటగలిసి పోతున్నాయనడానికి నిదర్శనమైన ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను నిజామాబాద్ సీపీ సాయి చైతన్య సోమవారం (ఫిబ్రవరి 2) మీడియాకు వెల్లడించారు. వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని ముద్ఖెడ్ మండలం కేరుర్ గ్రామానికి చెందిన పాండు రంగకు ముగ్గురు పిల్లలు.
పాండు రంగకు సర్పంచ్ కావాలని కోరిక. కానీ ముగ్గురు పిల్లలుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులు అనే నిబంధన అతడికి అడ్డంకిగా మారింది. దీనిపై ఏం చేయాలా అని ఆలోచించాడు. ఈ క్రమంలో అతడికి ఆ గ్రామ సర్పంచ్ ఓ నీచమైన ఐడియా ఇచ్చాడు. వచ్చే సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయాలంటే ముగ్గురి పిల్లల్లో ఒకరిని చంపేయాలని పాండు రంగకు సూచించాడు.
పదవి వ్యామోహంలో ఉన్న పాండు రంగ మంచి చెడు, ముందు వెనక ఆలోచించకుండా గుడ్డిగా సర్పంచ్ చెప్పిన పని చేశాడు. తన ఆరు సంవత్సరాల కూతురిని దారుణంగా చంపేశాడు. అనంతరం కూతురి డెడ్ బాడీని గోదావరి నదిలో పడేశాడు. చిన్నారి మృతదేహం నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం ఏఆర్పీ క్యాంప్ గ్రామ పరిధిలోని నిజాంసాగర్ D46వ కెనాల్‌కు కొట్టుకువచ్చింది.
స్థానికుల సమాచారం మేరకు బాలిక డెడ్ బాడీని స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. చనిపోయిన బాలికను ప్రాచి (6)గా గుర్తించారు. కన్న తండ్రి పాండు రంగ ప్రాచిని హత్య చేసినట్లు పోలీసుల నిర్ధారించారు. వచ్చే సర్పంచ్ ఎన్నికల్లో ముగ్గురు పిల్లలు ఉంటే పోటీకి అనర్హం అనే ఉద్దేశ్యంతో కూతురుని చంపేశాడని తెలిపారు. అందుకు ప్రేరేపించిన ప్రస్తుత సర్పంచ్ గణేష్‌ను కూడా అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. కేసును ఛేదించిన పోలీస్ సిబ్బందిని సీపీ సాయి చైతన్య ప్రశంసించారు.
