అనాథలైన నలుగురు చిన్నారులు

అనాథలైన నలుగురు చిన్నారులు

చిట్యాల, వెలుగు: నాలుగేండ్ల క్రితం తండ్రి, ఇప్పుడు తల్లి జ్వరంతో మృతిచెందడంతో నలుగురు చిన్నారులు అనాథలయ్యారు. జయశంకర్​భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం పాశిగడ్డ తండాకు చెందిన భూక్య సురేశ్(39), వసంత(32) దంపతుల పిల్లలు తిరుపతి(16), లక్​పతి(11), సంజన(9), రాజేశ్(7). నిరుపేద కుటుంబం కావడంతో దంపతులు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారు. నాలుగేండ్ల క్రితం సురేశ్​జ్వరం బారిన పడి మృతిచెందాడు. కుటుంబపోషణ భారం తల్లి వసంతపై పడింది. కూలి పని చేసుకుంటూ నలుగురు పిల్లలను స్థానిక సర్కారు బడిలో చదివిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో వసంత 20 రోజుల క్రితం జ్వరం బారిన పడింది. అసలే ఆర్థిక సమస్యలతో సతమతమవుతుండడంతో హాస్పిటల్​కు వెళ్లకుండా ఇంటివద్దనే గడిపింది. రోజురోజుకు ఆమె పరిస్థితి విషమించడంతో చుట్టుపక్కలవారు గమనించి చిట్యాల గవర్నమెంట్ హాస్పిటల్​కు తరలించారు. పరిస్థితి విషమించడంతో బుధవారం రాత్రి మృతిచెందింది. తల్లి మృతితో పిల్లలు రోదనలు మిన్నంటాయి.

దాతల సహకారంతో దహన సంస్కారాలు

తల్లిదండ్రులను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న పిల్లలను చూసి చలించిపోయిన కొందరు  తమవంతుగా ఆర్థికసాయం అందించగా స్థానికులు గురువారం దహన సంస్కారాలు నిర్వహించారు. పిల్లల పరిస్థితిని తెలియజేస్తూ స్థానికులు కొందరు సోషల్​మీడియాలో పోస్టు చేశారు. దీంతో ప్రైమరీ స్కూల్​టీచర్లు వెంకట్​రెడ్డి, రమేశ్​రూ.10 వేలు ఆర్థికసాయం అందించారు. ఇదే గ్రామానికి చెందిన లావుడ్య సురేశ్​అనే కానిస్టేబుల్​రూ.5 వేలు అందజేశారు.