సాగర్‌లో టీఆర్​ఎస్​కు కోవర్టుల భయం

సాగర్‌లో టీఆర్​ఎస్​కు కోవర్టుల భయం
  • సాగర్​లో ఎలక్షన్ హీట్
  • బై ఎలక్షన్​ ప్రచారానికి మరో ఐదు రోజులే మిగిలింది
  • బయటి నేతల్ని దింపిన టీఆర్​ఎస్​
  • సొంత లీడర్లు చెయ్యిస్తారేమోనని ఆ పార్టీలో డౌట్​
  • ‘పెద్దల’ ఇమేజీ గెలిపిస్తుందని కాంగ్రెస్​ ఆశలు
  • సత్తా చాటేందుకు బీజేపీ వ్యూహం

హైదరాబాద్, వెలుగు: నాగార్జునసాగర్​ ఎన్నికల రాజకీయం హీటెక్కింది. పోలింగ్​కు మరో వారం రోజుల సమయమే ఉంది. ఐదు రోజుల్లో ప్రచారం ముగియనుంది. దీంతో  అన్ని పార్టీలు పోటాపోటీగా ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ముఖ్య నేతలంతా సెగ్మెంట్​లో  అడ్డా వేశారు. వారాల తరబడి అక్కడే ఉంటూ ఊరూరా తిరుగుతున్నారు. లోకల్​ లీడర్లను వెంటబెట్టుకొని ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్లను కలుస్తున్నారు. ఈ నెల 17న పోలింగ్​ జరుగనుంది. 

టీఆర్​ఎస్​కు కోవర్టుల భయం
సాగర్​లో ఇతర పార్టీలకన్నా ముందే టీఆర్​ఎస్​ ప్రచారం మొదలుపెట్టింది. వేరే ఏరియాలకు చెందిన 20 మంది ఎమ్మెల్యేలను రంగంలోకి దింపింది. వీళ్లకు తోడు మరో 60, 70 మంది వివిధ స్థాయి లీడర్లు సెగ్మెంట్​లోనే మకాం వేసి క్యాంపెయిన్​ చేస్తున్నారు. అయితే.. సొంత లీడర్లు హ్యాండ్​ ఇస్తారన్న భయం టీఆర్​ఎస్​లో కనిపిస్తోంది. పార్టీలో కోవర్టులు ఉన్నట్టు, పార్టీకి వ్యతిరేకంగా పని చేయాలని వారు నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. రెడ్డి లీడర్లంతా కాంగ్రెస్​ అభ్యర్థి జానారెడ్డిని గెలిపించేందుకు అంతర్గతంగా ఏకమైనట్లు స్థానికంగా చర్చ నడుస్తోంది. ఈసారి జానారెడ్డిని గెలిపించుకోకపోతే భవిష్యత్తులో సెగ్మెంట్ తమ చేతుల్లో ఉండదనే భయం రెడ్డి లీడర్లలో  ఉన్నట్లు తెలుస్తోంది. ఎస్సీ, ఎస్టీలను సమీకరించే పనిని కూడా రెడ్డి లీడర్లే తీసుకున్నట్లు సమాచారం. యాదవ, ఇతర బీసీ కులాలను ఎట్లా సమీకరించాలనే అంశంపైనా వీళ్లు దృష్టి పెట్టినట్లు కొందరు నేతల మాటలను బట్టి తెలుస్తోంది. ప్రచార బాధ్యతలను సొంత జిల్లా నేతలకు ఇవ్వకుండా ఇతర లీడర్లకు ఇవ్వడం నెగెటివ్​ అవుతుందని టీఆర్​ఎస్​ లోకల్​ లీడర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే.. రెడ్డి కుల సమీకరణను టీఆర్​ఎస్​ హైకమాండ్​ గమనించినట్లు కనిపిస్తోంది. అందుకే ప్రచార సమయంలో కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డిపై వ్యక్తిగత విమర్శలు చేయొద్దని మంత్రులు, ఎమ్మెల్యేలను సీఎం కేసీఆర్ ​ఆదేశించినట్టు సమాచారం. జానారెడ్డిపై విమర్శలు చేస్తే ఆయనకే ప్లస్ అవుతుందని చెప్పినట్టు తెలుస్తోంది. ఉగాదిలోపు టీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్ రోడ్డు షోలు నిర్వహించాలని భావించారు. కానీ సీఎం కేసీఆర్ అందుకు అంగీకరించలేదని పార్టీ లీడర్లు చెప్తున్నారు. ఈ నెల 14న ఎన్నికల ప్రచార సభలో కేసీఆర్​ పాల్గొననున్నారు. ఈ సభకు లక్షమందిని సమీకరించే పనిలో టీఆర్​ఎస్​ లీడర్లు ఉన్నారు. 

కాంగ్రెస్​ ‘పెద్దల’ ప్రతిష్ట
సాగర్  బై ఎలక్షన్​ కాంగ్రెస్​కు సవాల్​గా మారింది. పార్టీలోనే కాదు, రాజకీయాల్లోనూ అందరూ ‘పెద్దలు’ అని సంబోధించే జానారెడ్డి కాంగ్రెస్​ తరఫున బరిలో ఉన్నారు. ఆయన గెలుపోటములపై ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. దీంతో పార్టీ సీనియర్​ నేతలంతా సాగర్​లోనే అడ్డా వేసి ప్రచారం చేస్తున్నారు. పీసీసీ చీఫ్​ ఉత్తమ్​కుమార్​రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి, మండలి మాజీ ప్రతిపక్ష నేత షబ్బీర్​ అలీ, వర్కింగ్​ ప్రెసిడెంట్లు పొన్నం ప్రభాకర్​, కుసుమ కుమార్​, ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి, ఎమ్మెల్యే సీతక్క తదితరులు ప్రచారంలో పాల్గొంటున్నారు. ఎంపీ రేవంత్​ రెడ్డి కూడా శుక్రవారం నుంచి ప్రచారం మొదలుపెట్టారు. సాగర్​లోని 65 శాతం గ్రామాల్లో సర్పంచులు తమ పార్టీ వాళ్లే ఉండడం జానారెడ్డికి కలిసి వస్తుందని కాంగ్రెస్​ భావిస్తోంది. మరోవైపు పీసీసీ చీఫ్​ పదవిని ఆశిస్తున్న నేతలు మరింత ఎక్కువ ఉత్సాహంతో ప్రచారం సాగిస్తున్నారు. రాష్ట్ర కాంగ్రెస్​కు అధ్యక్షుడ్ని నియమించాలని పార్టీ హైకమాండ్​ కసరత్తు మొదలుపెట్టిన టైంలోనే ఈ  బై ఈఎలక్షన్​ సందడి మొదలైంది. దీంతో బై ఎలక్షన్​  తర్వాతే పీసీసీకి కొత్త అధ్యక్షుడ్ని నియమించాలని హైకమాండ్​ నిర్ణయించింది.

సత్తా చాటేందుకు బీజేపీ వ్యూహం
దుబ్బాక, జీహెచ్​ఎంసీ  ఎన్నికల్లో  గెలుపుతో జోష్​ మీద ఉన్న బీజేపీ.. సాగర్​ బై ఎలక్షన్​పైనా ఆశలు పెట్టుకుంది. పార్టీ ఓటు బ్యాంకు లేని సెగ్మెంట్  కావటంతో జీరో నుంచి ఇక్కడ పోరును మొదలుపెట్టింది. 2018 ఎన్నికల్లో సాగర్​ నుంచి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి నివేదితారెడ్డి రెండు  వేల పైచిలుకు ఓట్లు మాత్రమే సాధించారు. మూడేండ్ల వ్యవధిలో వచ్చిన ఈ బై ఎలక్షన్​ను  తమకు అనుకూలంగా మలుచుకోవాలని బీజేపీ భావిస్తోంది. జనరల్ సీటు అయిన సాగర్​ నియోజకవర్గంలో గిరిజన(లంబాడా) కమ్యూనిటీకి చెందిన రవినాయక్ ను బరిలోకి దింపి.. గిరిజనుల ఓట్లపై  ఆశలు పెట్టుకుంది. గుర్రంపోడులో గిరిజనుల భూములపై తాము చేసిన పోరాటం  కలిసి వస్తుందని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తోంది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జ్​ తరుణ్ చుగ్, స్టేట్​ చీఫ్​ బండి సంజయ్, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, పార్టీ సీనియర్ లీడర్​ వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్యే రఘునందన్ రావు  విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.