
అల్వాల్, వెలుగు : మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అనుచరుడు జనార్దన్‌రెడ్డి తన భూమిని కబ్జా చేసేందుకు, వినకుంటే చంపేందుకు ప్రయత్నిస్తూ బెదిరింపులకు పాల్పడడంతోనే తానుపారిపోయినట్టు బీజేపీ నేత తిరుపతిరెడ్డి తెలిపారు. ముందుగా విజయవాడ వెళ్లానని, అటు నుంచి వైజాగ్ వెళ్లినట్టు పేర్కొన్నారు. ఐదు రోజుల కిందట అదృశ్యమైన తిరుపతి రెడ్డి మంగళవారం హైదరాబాద్‌లోని పేట్‌బషీరాబాద్ డీసీపీ ఆఫీసుకు కుటుంబ సభ్యులతో కలిసి వచ్చారు. డీసీపీ సందీప్‌రావు, ఏసీపీ రామలింగరాజు తిరుపతిరెడ్డిని విచారించారు. అతని నుంచి ఆధారాలు సేకరించారు. అనంతం తిరుపతిరెడ్డి మీడియాతో మాట్లాడారు.
తాను వైజాగ్‌లో ఉండగా ఎమ్మెల్యే మైనంపల్లి 8 సార్లు ఫోన్ చేశారని, కానీ ఫోన్ లిఫ్ట్ చేయలేదని తెలిపాడు. తన భూమి కబ్జా చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని పలుమార్లు ఫిర్యాదులు చేసినా అల్వాల్ తహసీల్దార్, కమిషనర్ పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు. అల్వాల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా.. అప్పటి సీఐ గంగాధర్ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రజల కోసం పనిచేయాల్సిన పోలీసులు.. ఎమ్మెల్యేలు, మంత్రుల కోసం పని చేస్తున్నారని ఆరోపించారు. హైకోర్టు అడ్వకేట్ సలహా మేరకు డీసీపీ ఆఫీసుకు వచ్చినట్టు తెలిపారు.
తిరుపతిరెడ్డి మీడియాతో మాట్లాడుతుండగా కుటుంబసభ్యులకు , పోలీసుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పోలీసులు తిరుపతిరెడ్డి కుటుంబ సభ్యులను, మీడియాను పోలీస్ స్టేషన్ నెట్టివేయడం జరిగింది. దీనిపై అల్వాల్ సీఐ ఉపేందర్రావుని వివరణ కోరగా.. తిరుపతిరెడ్డిది కిడ్నాప్ కాదని
దర్యాప్తులో తేలిందని, ఘట్కేసర్ నుంచి విజయవాడ వైపు వెళ్లాడని వెల్లడించారు. అదృశ్యంపై కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా, అతని ఆచూకీ లభించడంతో కుటుంబ సభ్యులు, బంధువులు ఊపిరి పీల్చుకున్నారు.