- మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
మెహిదీపట్నం, వెలుగు: పెండింగ్ లో ఉన్న ఫీజు బకాయిలను రిలీజ్ చేయాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. ఫీజు బకాయిలు రిలీజ్ చేయాలని, పాత పద్ధతిలోనే ఫీజు రీయింబర్స్మెంట్ కొనసాగించాలనే డిమాండ్ తో శుక్రవారం మాసబ్ ట్యాంక్ లోని ఉన్నత విద్యా మండలి ఎదుట తెలంగాణ విద్యార్థి జేఏసీ చైర్మన్ వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. విద్యార్థులు నినాదాలతో హోరెత్తించారు.
ఉన్నత విద్యా మండలి ఆఫీస్ లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్, వేముల రామకృష్ణ మాట్లాడుతూ.. ఫీజు రీయింబర్స్ మెంట్ స్కీమ్‌ను రాష్ట్ర ప్రభుత్వం సరిగా అమలు చేయకపోవడంతో రాష్ట్రంలోని 14 లక్షల మంది ఉన్నత విద్యకు దూరమయ్యే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్ లో ఉన్న రూ.10 వేల కోట్ల బకాయిలను రిలీజ్ చేయాలన్నారు.
ఫీజు రీయింబర్స్మెంట్ స్కీమ్‌పై కోర్టు స్టే విధించినా, కౌన్సెలింగ్ నిర్వహించి అడ్మిషన్ ప్రక్రియ ఎలా చేపడతారని ప్రశ్నించారు. జీవోలు, కమిటీల పేరుతో ప్రభుత్వం కాలయాపన చేస్తే సహించేది లేదన్నారు. కమీషన్లు రావనే నిధులు విడుదల చేయడం లేదన్నారు. రాష్ట్రంలోని అన్ని విద్యార్థి సంఘాలతో చర్చలు జరిపి ఈ నెల 7న చలో ఇందిరాపార్కు చేపడతామని హెచ్చరించారు. జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందగోపాల్, ఉదయ్, నరేశ్, జగన్, ప్రవీణ్, హరీశ్, మహేశ్, అనిత, జగన్, వంశీ పాల్గొన్నారు.
