
- స్కూల్స్, పార్కుల దగ్గరికి వచ్చే చిన్నారులను ట్రాప్ చేస్తున్న మహిళ
- మూడు కమిషనరేట్ల పరిధిలో 25 దొంగతనాలు
- నిందితురాలిని అరెస్ట్ చేసిన మలక్ పేట పోలీసులు
- 3.8లక్షల విలువ చే సే 57.6 గ్రాముల బంగారం.. 681 గ్రాముల వెండి స్వాధీనం
హైదరాబాద్,వెలుగు: చిన్నారులకు చాక్లెట్ ఆశ చూపి చోరీలకు పాల్పడుతున్న మహిళా దొంగ ఆటకట్టించారు సిటీ పోలీసులు. స్కూల్స్, పార్కుల దగ్గర రెక్కీ వేసి చిన్నారుల దగ్గరున్న బంగారు, వెండి ఆభరణాలను దోచుకుంటున్న ఘరానా మహిళను మలక్ పేట పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. నిందితురాలి దగ్గరి నుంచి 3.8లక్షలు విలువ చేసే 57.6 గ్రాముల బంగారం, 681 గ్రాముల వెండి స్వాధీనం చేసుకున్నారు. మూడు కమిషనరేట్ల పరిధిలో 25 చోరీలు చేసిన నిందితురాలి వివరాలను సిటీ సీపీ అంజనీకుమార్ వెల్లడించారు.
గుంటూరులో లేబర్ పని..హైదరాబాద్ లో చోరీలుఏపీ కడప జిల్లా ఎర్రముక్కపల్లికి చెందిన వెగ్నం అనురాధ(30) గుంటూర్ లోని ఓ హాస్పిటల్ లో లేబర్ గా పనిచేస్తోంది. భర్త చనిపోవడంతో అనూరాధ చోరీల బాట పట్టింది. అందుకోసం తాను ఉండే గుంటూర్ లో కాకుండా హైదరాబాద్ వచ్చి చోరీలు చేయడం ప్రారంభించింది. ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారులు,స్కూల్స్,పార్కుల వద్ద బాలికలను టార్గెట్ చేసేది. చిన్నారుల వద్దకు వచ్చి చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్ ఇప్పిస్తానని చెప్పి వారిని ట్రాప్ చేస్తుంది. తన ట్రాప్ లో చిక్కిన బాలికలను నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకెళ్ళేది. ఆ తర్వాత పరిసర ప్రాంతాలను గమనించి చిన్నారుల ఒంటిపై ఉన్న బంగారు చెవిదిద్దులు..వెండి పట్టీలు దొంగిలించేది. ఇలా హైదరాబాద్,సైబరాబాద్,రాచకొండ కమిషనరేట్ల పరిధిలో గతేడాది మార్చి నుంచి ఈ ఏడాది జూన్ 13 వరకు అనురాధ 25 చోరీలు చేసింది.
వారంలో రెండు రోజులు
వారంలో రెండు రోజులు చోరీలకు కేటాయించిన అనురాధ గుంటూరు నుంచి హైదరాబాద్ వస్తుంది. తెల్లవారుజామున గుంటూర్ లో ప్యాసింజర్ ట్రైన్ ఎక్కి జనరల్ బోగీలో సికింద్రాబాద్ చేరుకునేది. అక్కడి నుంచి తనకు బాగా తెలిసిన ప్రాంతమైన ఎల్ బీనగర్ కి వచ్చేది. ఇలా ఎల్ బీనగర్,సరూర్ నగర్,కర్మన్ ఘాట్ పరిసర ప్రాంతాల్లో అనురాధ రెక్కీ వేసేది. చిన్నారులు స్కూల్స్ కు వెళ్లే టైమ్ తో పాటు ఇంటి ముందు ఒంటరిగా ఆడుకునే పిల్లలను ట్రాప్ చేసేది. తనను ఎవరూ గుర్తించకుండా అనురాధ మంచి డ్రెస్ వేసుకుని కాలనీల్లో తిరిగేది. తన ట్రాప్ లో చిక్కిన చిన్నారులను షాప్ కి తీసుకెళ్తున్నట్లు నటిస్తూ వాళ్ళతో మాట్లాడుతూ ఉండేది. తనను ఎవరైనా గమనిస్తున్నట్లు తెలిస్తే పిల్లలను అక్కడే వదిలి వెళ్లిపోయేది. ఒకవేళ ఎవరూ తనను గమనించక పోతే ఆ బాలికల ఒంటిపై ఉండే బంగారు,వెండి ఆభరణాలను దొంగిలించి అనురాధ అక్కడి నుంచి పారిపోయేది.
నెలకు నాలుగుసార్లు సిటీకి వచ్చి
అనురాధ సిటీకి వచ్చిన రోజు ఒక్కోసారి మధ్యాహ్నం వరకు తన చోరీ పని పూర్తి చేసుకుని సికింద్రాబాద్ వెళ్ళి ట్రెయిన్ లో గుంటూరుకు పారిపోయేది. ఇలా గతేడాది నుంచి వరుస చోరీలు చేస్తూ తప్పించుకు తిరుగుతున్న అనురాధ ఈ ఏడాది మే 16, జూన్ 12న మలక్ పేట్ లో చోరీ చేసింది. ఆ తర్వాత సిటీ నుంచి గుంటూరు వెళ్ళింది. ఎప్పటిలాగే మళ్ళీ ఈ నెల 9న సరూర్ నగర్ లో, 11న ఎల్ బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో, 13న జూబ్లీహిల్స్ చిన్నారుల ఒంటిపై బంగారాన్ని దోచుకెళ్లింది.
ఇలా ప్రతి నెలలో నాలుగు సార్లు చోరీల కోసం అనురాధ హైదరాబాద్ వచ్చేది. దొంగిలించిన బంగారం,వెండిని అమ్మి సొమ్ము చేసుకునేది. మలక్ పేట,సైదాబాద్,అంబర్ పేట,జూబ్లీహిల్స్,సరూర్ నగర్,మీర్ పేట,ఉప్పల్,ఎల్ బీనగర్,సనత్ నగర్ లో మొత్తం 25 చోరీలు చేసి పారిపోయింది
సీసీ ఫుటేజ్ పట్టించింది
మలక్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో మే, జూన్ నెలల్లో నమోదైన కేసుల్లో పోలీసులు దర్యాప్తు చేశారు. డిటెక్టివ్ ఇన్ స్పెక్టర్ నందు నాయక్ టీమ్ చోరీలు జరిగిన ప్రాంతాల్లో సీసీ ఫుటేజ్ ని సేకరించింది. రెండు చోరీల్లోని సీసీ ఫుటేజ్ లో ఒకే మహిళ ఉండడంతో సిటీలో జరిగిన ఇలాంటి చోరీల వివరాలను సేకరించారు. ఈ క్రమంలో ఇదే నెల ఎల్బీనగర్,సరూర్ నగర్,జూబ్లీహిల్స్ లో మరోసారి చిన్నారుల ఆభరణాలను దొంగిలించిన కేసుల వివరాలు రాబట్టారు. మలక్ పేట్ పోలీసులు సేకరించిన అన్ని ఫుటేజ్ ల్లో ఒకే మహిళ చోరీలు చేసినట్లు గుర్తించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితురాలి కోసం గాలించారు. కర్మన్ ఘాట్ నందనవనంలో బంగారాన్ని అమ్మేందుకు వచ్చిన అనురాధను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. నిందితురాలు దొంగిలించిన 62 గ్రాముల బంగారంలో 57.6 గ్రాముల ఆభరణాలను,681 గ్రాముల వెండి ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పేరెంట్స్ అలర్ట్ గా ఉండాలి
సీసీ కెమెరాల ఫుటేజ్ ద్వారా మహిళా దొంగ అనురాధను పట్టుకున్నాం. పేరెంట్స్ తమ పిల్లల విషయంలో అలర్ట్ గా ఉండాలి. అపరిచితుల వద్దకు చిన్నారులు వెళ్ళకుండా చూడాలి. అనుమానితులు కనిపిస్తే సిటీ పోలీస్ హాక్ ఐ,వాట్సాప్ నంబర్స్ కు సమాచారం అందించాలి. అంజనీకుమార్, సీపీ, హైదరాబాద్