హౌసింగ్ బోర్డు భూముల రక్షణపై ప్రభుత్వం కీలక నిర్ణయం

హౌసింగ్ బోర్డు భూముల రక్షణపై ప్రభుత్వం కీలక నిర్ణయం
  • హౌసింగ్ ​బోర్డు జాగాల చుట్టూ ఫెన్సింగ్​
  • భూముల రక్షణకు సర్కారు నిర్ణయం
  • కబ్జాకు గురవుతున్న నేపథ్యంలో చర్యలు
  • 17 చోట్ల రక్షణకు టెండర్లు పిలిచిన ప్రభుత్వం

హైదరాబాద్, వెలుగు: హౌసింగ్ బోర్డు భూముల రక్షణపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రవ్యాప్తంగా భూముల ధరలు కోట్లలో పలుకుతుండగా పెద్ద ఎత్తున కబ్జాకు గురవడం, కోర్టుల్లో కేసుల దాఖలు చేయడం, అవి పరిష్కారం కాకుండా పెండింగ్ లో ఉండటం వంటి వివాదాల నేపథ్యంలో వాటిని రక్షించేందుకు చర్యలు ప్రారంభించింది. రాష్ట్ర హౌసింగ్‌‌‌‌‌‌‌‌ బోర్డు, డెక్కన్‌‌‌‌‌‌‌‌ ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌‌‌‌‌‌‌ ల్యాండ్‌‌‌‌‌‌‌‌ హోల్డింగ్ లిమిటెడ్‌‌‌‌‌‌‌‌(దిల్‌‌‌‌‌‌‌‌) ఆధీనంలో వందల ఎకరాల భూములు ఉన్నాయి.

హౌసింగ్ బోర్డులో అధిక శాతం భూములు హైదరాబాద్, రంగారెడ్డి చుట్టూ ఉన్న జిల్లాల పరిధిలో ఉన్నాయి. వీటన్నింటి చుట్టూ ఫెన్సింగ్ లేదా రక్షణ గోడ నిర్మించాలని , జియో గ్రాఫికల్ మ్యాపింగ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు టెండర్లు కూడా పిలిచింది. ఈ విషయంలో ఇదివరకే అధికారులు ఒక రిపోర్టును ప్రభుత్వానికి అందించగా, అందుకు అవసరమైన రూ.25 కోట్ల నిధులకు ఇటీవల ప్రభుత్వం అడ్మినిస్ట్రేటివ్​ సాంక్షన్ ఇచ్చింది. వీటితో హౌసింగ్‌‌‌‌‌‌‌‌బోర్డు, దిల్‌‌‌‌‌‌‌‌ పరిధిలో ఉన్న భూముల చుట్టూ ప్రహరీలు నిర్మించనున్నారు. 

ఇది హౌసింగ్ బోర్డు చరిత్ర..
నగర కేంద్రాల్లో పేద, మధ్య తరగతి ప్రజలకు తక్కువ ధరకే ఇండ్లను నిర్మించేందుకు ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వం ఈ హౌసింగ్ బోర్డును ఏర్పాటు చేసింది.  అయితే, హైదరాబాద్ స్టేట్ గా ఉన్నప్పుడే ఏడో అసఫ్ జా గా పేరొందిన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ దీన్ని ‘సిటీ ఇంప్రూవ్​మెంట్ బోర్డు’గా ఏర్పాటు చేశారు. భారత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 1960వ దశకంలో దీన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏపీ హౌసింగ్ బోర్డుగా మార్చారు. రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్, తెలంగాణ జిల్లాల్లోని భూములు తెలంగాణ హౌసింగ్ బోర్డుకు కేటాయించారు. రాష్ట్ర పరిధిలోని పట్టణ ప్రాంత మధ్య తరగతి ప్రజలకు తక్కువ ధరకే అనువైన ఇండ్లను నిర్మించి ఇవ్వాలనే ఉద్దేశంతో అప్పటి ప్రభుత్వం హౌసింగ్‌‌‌‌‌‌‌‌బోర్డు పరిధిలో 5,045 ఎకరాలు, దీని పరిధిలో ఏర్పాటు చేసిన దిల్‌‌‌‌‌‌‌‌కింద 1,800 ఎకరాలను సేకరించింది. హౌసింగ్‌‌‌‌‌‌‌‌బోర్డు కింద మేడ్చల్‌‌‌‌‌‌‌‌, హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, రంగారెడ్డితోపాటు నిజామాబాద్‌‌‌‌‌‌‌‌, వరంగల్‌‌‌‌‌‌‌‌, మహబూబ్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌జిల్లాల్లో ఇండ్ల నిర్మాణాల కోసం 4,230 ఎకరాలను వినియోగించారు. దాదాపు 124 ఎకరాల మేర న్యాయ సంబంధిత అంశాల్లో (లిటిగేషన్‌‌‌‌‌‌‌‌), కబ్జా వివాదాల్లో ఉండగా.. మరో 691 ఎకరాల భూమి మాత్రమే హౌసింగ్ బోర్డు పరిధిలో ఉంది. 

మరోవైపు దిల్‌‌‌‌‌‌‌‌పరిధిలోనూ 900–-1000 ఎకరాల వరకు పలు వివాదాల్లో ఉన్నట్టు తెలుస్తున్నది. అంటే.. 800 ఎకరాలు మాత్రమే వివాదాలు లేని భూమి ఉంది. ఏపీ, తెలంగాణ విభజన తర్వాత ఈ భూముల పంపకాల్లో వివాదాలు తలెత్తడంతో అప్పటి కేంద్ర ప్రభుత్వం వీటిని షెడ్యూల్‌‌‌‌‌‌‌‌–9 లో చేర్చింది. రాష్ట్రాలు విడిపోయి పదేండ్లవుతున్నా ఈ సమస్యకు పరిష్కారం లభించలేదు. అయితే, హౌసింగ్‌‌‌‌‌‌‌‌, దిల్‌‌‌‌‌‌‌‌భూములు కబ్జాల బారిన పడకుండా కాపాడుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నదని హౌసింగ్ బోర్డు అధికారులు చెబుతున్నారు.  

మూడు విడతలుగా టెండర్లు
హౌసింగ్ బోర్డు భూములను పరిరక్షించేందుకు  ప్రభుత్వం రెండు విడతలుగా టెండర్లు పిలిచింది. తొలి విడతగా గత నెల 27న , ఈ నెల 8న టెండర్లు ఆహ్వానించింది. ఈ నెల 14, 28వ తేదీ వరకు టెండర్లు దాఖలు చేయడానికి చివరి తేదీ అని టెండర్లలో అధికారులు పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 17 ప్రదేశాల్లో ప్రహరీలు, కంచెలు నిర్మించనున్నారు. త్వరలోనే మూడో దశ టెండర్​ ప్రక్రియ చేపడతామని ఓ ఉన్నతాధికారి తెలిపారు. మూడు దశల్లో కలిపి ఫెన్సింగ్ కు ప్రభుత్వం రూ.25 కోట్లు కేటాయించిందని ఆయన వెల్లడించారు. వీటికి త్వరగా నిర్మాణాలు చేపడతామని హౌసింగ్ అధికారులు చెబుతున్నారు. కబ్జాకు గురైన వాటిని తిరిగి పొందేందుకు న్యాయపరంగా అడ్వకేట్లతో చర్చిస్తున్నామని, వీటిని త్వరగా పరిష్కరించుకుంటామని అంటున్నారు.

ఫెన్సింగ్ ఏర్పాటు చేయనున్న ప్రాంతాలు ఇవే..
వట్టి నాగుల పల్లి ( రాజేంద్ర నగర్ ),  రాయదుర్గం, బాచుపల్లి, చింతల్, ఖైతలాపూర్, కేపీహెచ్ బీ కాలనీ, మామిళ్లగూడ ( నల్గొండ),  దేవరకొండ, మునుగోడు, మారేడుపల్లి, కోహెడ (రంగారెడ్డి ),  మంగల్ పల్లి, రావిర్యాల, పోచారం ( ఘట్​కేసర్ )  రాజిపేట (పరకాల), గొర్రెకుంట ( గీసుకొండ)  జగిత్యాల, మరిపెడ, చుంచుపల్లి ( భద్రాద్రి కొత్తగూడెం)  రత్నాపూర్ ( నిర్మల్ ), ఎన్సాన్ పల్లి, ఇబ్రహీంనగర్  ( సిద్దిపేట )