
- సీఎం రేవంత్‌రెడ్డికి ఎఫ్‌జీజీ ప్రెసిడెంట్ పద్మనాభరెడ్డి లేఖ
హైదరాబాద్, వెలుగు: మేడ్చల్ జిల్లాలోని మల్కాజ్‌గిరిలో భూముల ఆక్రమణలకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డిని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ (ఎఫ్‌జీజీ) ప్రెసిడెంట్ పద్మనాభరెడ్డి కోరారు. ఈ అంశంపై శుక్రవారం లేఖ రాశారు. 2003లో 9 మంది అధికారులు (ఏడుగురు జీహెచ్‌ఎంసీ, ఒక తహసీల్దార్, ఒక సబ్ రిజిస్ట్రార్) నేరపూరిత కుట్రతో జయగిరి లక్ష్మీ నరసింహస్వామి మల్కాజిగిరి దేవస్థానం భూములను నకిలీ పత్రాలతో ఓ కాంట్రాక్టర్‌కు రిజిస్టర్ చేశారని తెలిపారు. అక్కడ ఇల్లు నిర్మించుకునేందుకు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ అనుమతి కూడా ఇచ్చారని లేఖలో పేర్కొన్నారు.
ఈ దేవాలయ భూముల కబ్జాపై పత్రికల్లో వార్తలు రావడంతో విజిలెన్స్ డైరెక్టర్ విచారణ జరిపి 2014 లో ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చారని గుర్తు చేశారు. ఆ అధికారులపై చర్యలుతీసుకోవాలని నివేదికలో పేర్కొన్నారని తెలిపారు. విజిలెన్స్ ఇచ్చిన రిపోర్ట్‌ను ప్రభుత్వం ఆమోదిస్తూ.. జీహెచ్ ఎంసీ కమిషనర్‌కు పంపించారని లేఖలో స్పష్టం చేశారు. అయితే, గత 11 ఏండ్లుగా ఈ రిపోర్ట్ పై అధికారులు చర్యలు తీసుకోలేదని తెలిపారు. ఈ అంశంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని సీఎంను పద్మనాభ రెడ్డి కోరారు.