పంజిమ్ (గోవా): ఇండియా ఆతిథ్యం ఇస్తున్న ప్రతిష్టాత్మక ఫిడే వరల్డ్ కప్ చెస్‌లో తెలంగాణ గ్రాండ్ మాస్టర్ ఎరిగైసి అర్జున్‌తో పాటు వరల్డ్ చాంపియన్ డి. గుకేశ్, మరో స్టార్ ఆర్. ప్రజ్ఞానంద ఫేవరెట్లుగా బరిలోకి దిగుతున్నారు. శనివారం మొదలయ్యే ఈ మెగా ఈవెంట్‌కు వరల్డ్ టాప్–3 ర్యాంకర్లు మాగ్నస్ కార్ల్‌సన్, హికారు నకమురా, కరువానా దూరంగా ఉండటంతో ఇండియా ప్లేయర్లకు ఇది గోల్డెన్ చాన్స్‌గా మారింది.
2026 ఫిడే క్యాండిడేట్స్ టోర్నమెంట్‌కు మూడు క్వాలిఫికేషన్ బెర్తులు అందించే ఈ టోర్నీ అందరికీ కీలకం కానుంది. క్యాండిడేట్స్ బెర్తు అందుకోవాలని అర్జున్ టార్గెట్‌గా పెట్టుకోగా.. కొన్ని రోజులు ఆటకు దూరంగా ఉండి రెస్ట్ తీసుకున్న గ్రాండ్‌మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద గత పెర్ఫామెన్స్‌ను రిపీట్ చేయాలని చూస్తున్నాడు. వరల్డ్ చాంపియన్ కావడంతో గుకేశ్, రాబోయే క్యాండిడేట్స్ టోర్నీ అర్హత దాదాపు ఖాయం కావడంతో గుకేశ్‌కు ఈ టోర్నీ పెద్దగా ఇంపార్టెంట్ కాదు.
వరల్డ్ చాంపియన్ అవ్వాలన్న కలతో ఉన్న అర్జున్ ఆ టోర్నీకి ఎంట్రీ ఇచ్చే క్యాండిడేట్స్ బెర్త్ కోసం తీవ్రంగా కృషి చేయాల్సి ఉంటుంది. దాంతో అందరి దృష్టి తెలంగాణ స్టార్ పైనే ఉండనుంది. ఇక, సీనియర్లు విదిత్ సంతోష్ గుజరాతీ, పెంటేల హరికృష్ణతో పాటు యంగ్ ప్లేయర్లు నిహాల్ సరీన్, అరవింద్ చిదంబరం కూడా అర్హత స్థానాలపై కన్నేశారు. ఈసారి ఇండియా నుంచి ఏకంగా 24 మంది ప్లేయర్లు వరల్డ్ కప్‌లో పాల్గొంటున్నారు.
నెదర్లాండ్స్‌కు చెందిన అనీష్ గిరి, జర్మనీ ప్లేయర్ విన్సెంట్ కీమర్, ఉజ్బెకిస్తాన్‌కు చెందిన నోదిర్‌బెక్ అబ్దుసతొరోవ్ వంటి టాలెంటెడ్ ప్లేయర్లు కూడా బరిలో ఉన్నారు. మొత్తం 80 దేశాల నుంచి 206 మంది ప్లేయర్లు ఈ ఎనిమిది రౌండ్ల నాకౌట్ ఈవెంట్‌లో పోటీపడతారు. ప్రతి మ్యాచ్‌లో రెండు క్లాసికల్ గేమ్‌లు ఆడతారు.
స్కోరు సమమైతే, విన్నర్‌ను నిర్ణయించడానికి ర్యాపిడ్, బ్లిట్జ్ ఫార్మాట్‌లో టై-బ్రేక్‌లు జరుగుతాయి. కాగా, వరల్డ్ టాప్ 50 ర్యాంకర్లు ఈ టోర్నీలో నేరుగా రెండో రౌండ్‌లో పోటీ పడనున్నారు. శుక్రవారం జరిగిన కార్యక్రమంలో వరల్డ్ కప్‌ను ఆవిష్కరించారు. ఈ టోర్నీకి ఇండియా చెస్ లెజెండ్ విశ్వనాథన్ ఆనంద్ పేరు పెట్టారు.
