- స్కీమ్‌లో లోపాలు, క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు గుర్తించేందుకు చేపట్టిన సర్కారు
- గ్రామాల్లో రోజుకు 40 ఇండ్లలో సర్వే.. వివరాలు సేకరిస్తున్న బృందాలు
- రిపోర్ట్‌కు తగ్గట్టు లోపాల సవరణ.. సమర్థవంతంగా స్కీమ్ నిర్వహణ
- మిషన్ భగీరథను జల్‌జీవన్ మిషన్‌తో అనుసంధానించనున్న సర్కారు
హైదరాబాద్, వెలుగు: మిషన్‌భగీరథ స్కీమ్‌లో లోపాలు, క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితులు తెలుసుకునేందుకు రాష్ట్ర సర్కారు సర్వే చేపడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా12,769 గ్రామాల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అధికారుల బృందాలు ఇంటింటికీ తిరుగుతూ వివరాలు సేకరిస్తున్నాయి. మరో వారంపాటు ఈ సర్వే సాగనుందని అధికారులు వెల్లడించారు. సర్వే పూర్తయ్యాక సమగ్ర రిపోర్ట్ విడుదల చేస్తామని చెబుతున్నారు. పక్కా సమాచారం తెలుసుకునేందుకు ఈ సర్వే బాధ్యతలను మిషన్ భగీరథ అధికారులకు కాకుండా వివిధ శాఖలకు చెందిన వారికి సర్కారు అప్పగించినట్టు తెలుస్తోంది. గ్రామ పంచాయతీల్లో రోజుకు 40 ఇండ్లలో ఉదయం, సాయంత్రం వేళ అధికారుల బృందాలు ఫీల్డ్‌సర్వే నిర్వహిస్తున్నాయి. ఈ సర్వే టీమ్ కు గ్రామాల్లోని పంచాయతీ సెక్రటరీలు, పంచాయతీ సిబ్బంది సహకరిస్తూ ఇంటింటి సర్వేలో పాల్గొంటున్నారు. టీమ్ లు ఇంటింటికీ వెళ్లి పలు ప్రశ్నలు అడుగుతూ వాటి వివరాలతోపాటు నల్లా వద్ద ఇంటి యజమాని ఫొటో తీసి యాప్ లో అప్ లోడ్ చేస్తున్నాయి.
స్కీమ్ ను సమర్థంగా నిర్వహించేందుకే సర్వే
మిషన్ భగీరథ స్కీమ్‌లో లోపాలు గుర్తించి, వాటిని సవరించాలని, స్కీమ్‌ను సమర్థంగా నిర్వహించాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. అలాగే, ఈ స్కీమ్‌ను కేంద్ర ప్రభుత్వ జల్‌జీవన్ పథకంతో అనుసంధానించాలని సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే అధికారుల బృందంతో ఫీల్డ్ సర్వే నిర్వహిస్తున్నారు. ఈ సర్వే రిపోర్ట్‌ను కేంద్ర ప్రభుత్వానికి అందజేయనున్నట్టు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం నుంచి జల్ జీవన్ స్కీమ్ కింద వచ్చే నిధులను కూడా ఉపయోగించుకొని అవసరమున్నచోట కొత్తగా పంప్ హౌస్ లు, ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మించాలని సర్కారు భావిస్తోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థికభారం తగ్గనుందని అధికారులు చెబుతున్నారు.
స్కీమ్ నిర్వహణ జీపీలకు.. శరవేగంగా రిపేర్లు
కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మిషన్ భగీరథ స్కీమ్ అమలును గ్రామ పంచాయతీలకు అప్పగించారు. ఇందులో భాగంగా గత 7 నెలలుగా నల్లాలు, మోటార్లు, పంప్ హౌస్ లు, ఓవర్ హెడ్ ట్యాంక్ లు ఇలా అన్నింటిని శర వేగంగా రిపేర్ చేస్తున్నారు. ఇప్పటివరకూ మొత్తం19 వేల నల్లాలు రిపేర్ చేసినట్టు అధికారులు చెబుతున్నారు. ఈ స్కీమ్ పై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టడంతో ప్రిన్సిపల్ సెక్రటరీ, ఈఎన్సీ నుంచి క్షేత్రస్థాయి అధికారుల వరకు నిత్యం అన్ని జిల్లాల్లో పర్యటిస్తూ.. స్కీమ్ అమలును తెలుసుకుంటూ.. ప్రభుత్వానికి రిపోర్టులు అందజేస్తున్నారు.