బయటి వ్యక్తుల జోక్యం వల్లే సస్పెండ్

బయటి వ్యక్తుల జోక్యం వల్లే  సస్పెండ్
  • ఇండియా ఫుట్‌‌‌‌బాల్‌‌‌‌పై ఫిఫా బ్యాన్‌‌‌‌
  • అండర్‌‌‌‌17 విమెన్స్‌‌‌‌ వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌ ఇండియాలో జరగదన్న ఫిఫా
  • బయటి వ్యక్తుల జోక్యం వల్లే ఏఐఎఫ్​ఎఫ్​ను సస్పెండ్​ చేసినట్టు వెల్లడి
  • ఇంటర్నేషనల్​  పోటీలకు ఇండియా ఆటగాళ్లు దూరం

న్యూఢిల్లీ:  క్రీడల్లో రాజకీయాలు, ప్రభుత్వం, కోర్టుల జోక్యం కారణంగా  దేశంలో ఓ ఆట ఉనికికే ప్రమాదం ఏర్పడింది. ఆలిండియా ఫుట్‌‌‌‌బాల్‌‌‌‌ ఫెడరేషన్‌‌‌‌ (ఏఐఎఫ్‌‌‌‌ఎఫ్‌‌‌‌)పై  ప్రపంచ ఫుట్‌‌‌‌బాల్‌‌‌‌ సమాఖ్య (ఫిఫా) మంగళవారం నిషేధం విధించింది. ఏఐఎఫ్‌‌‌‌ఎఫ్‌‌‌‌లో బయటి వ్యక్తుల ప్రమేయం కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. దాంతోపాటు  ఇండియా ఆతిథ్యం ఇవ్వాల్సిన  ఫిఫా అండర్‌‌‌‌17 విమెన్స్‌‌‌‌ వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌ ప్రస్తుతానికి మన దేశంలో జరగదని స్పష్టం చేసింది. షెడ్యూల్‌‌‌‌ ప్రకారం ఈ మెగా టోర్నీ అక్టోబర్‌‌‌‌ 11–30 మధ్య జరగాల్సి ఉంది. 85 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉన్న ఏఐఎఫ్‌‌‌‌ఎఫ్‌‌‌‌పై బ్యాన్‌‌‌‌ పడటం ఇదే తొలిసారి. ఈ కారణంగా ఇండియా ఫుట్‌‌‌‌బాల్‌‌‌‌ భవిష్యత్తు అంధకారంగా మారింది. ఫిఫా నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఏఐఎఫ్ఎఫ్ తన సభ్యత్వ హక్కులన్నీ కోల్పోతుంది. సస్పెన్షన్‌‌‌‌ ఎత్తివేసే వరకు  ఇండియా క్లబ్స్‌‌‌‌, అనుబంధ ప్లేయర్లు, రిఫరీలు, అధికారులు ​ఇంటర్నేషనల్‌‌‌‌ పోటీల్లో పాల్గొనడానికి వీల్లేదు. బ్యాన్‌‌‌‌ కొనసాగితే ఫిఫా నుంచి ఏటా లభించే రూ. 4 కోట్ల నిధులను కూడా  ఆలిండియా ఫెడరేషన్‌‌‌‌ కోల్పోనుంది.

‘థర్డ్‌‌‌‌ పార్టీ జోక్యంతో పాటు ఇంటర్నేషనల్‌‌‌‌ ఫెడరేషన్‌‌‌‌  చట్టాలను ఉల్లంఘిస్తున్నట్టు స్పష్టంగా తేలడంతో ఏఐఎఫ్‌‌‌‌ఎఫ్‌‌‌‌ను సస్పెండ్‌‌‌‌ చేయాలని   ఫిఫా కౌన్సిల్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ బ్యూరో   నిర్ణయించింది. ఇది తక్షణమే అమల్లోకి వస్తుంది. ఏఐఎఫ్‌‌‌‌ఎఫ్‌‌‌‌ ఎగ్జిక్యూటివ్ కమిటీ అధికారాలను పరిపాలకుల కమిటీ (సీఓఏ)కి అప్పగించే ఉత్తర్వులను రద్దు చేయడంతో పాటు సమాఖ్య రోజువారీ వ్యవహారాలపై పూర్తి నియంత్రణను ఏఐఎఫ్‌‌‌‌ఎఫ్‌‌‌‌ తిరిగి పొందిన తర్వాతే సస్పెన్షన్‌‌‌‌ను ఎత్తి వేస్తాం’ అని ఫిఫా తన ప్రకటనలో తెలిపింది.  ఫిఫా నిర్ణయంపై ఏఐఎఫ్‌‌‌‌ఎఫ్‌‌‌‌తో పాటు కేంద్ర క్రీడా శాఖ కంగుతిన్నది. ఏఐఎఫ్‌‌‌‌ఎఫ్‌‌‌‌ కేసు విషయంలో అత్యవసర విచారణ చేపట్టాలని కేంద్రం సుప్రీంకోర్టును కోరింది.  ఇప్పుడు సుప్రీం తీసుకునే నిర్ణయమే ఇండియా ఫుట్​బాల్​ భవితవ్యాన్ని తేలుస్తుంది.

బ్యాన్‌‌‌‌ ఎందుకు?

ఏఐఎఫ్‌‌‌‌ఎఫ్‌‌‌‌ అధ్యక్షుడు ప్రఫుల్ పటేల్‌‌‌‌ను సుప్రీంకోర్టు మే 18వ తేదీన పదవి నుంచి తప్పించినప్పటి నుంచే  భారత సమాఖ్యపై  ఫిఫా బ్యాన్‌‌‌‌  కత్తి వేలాడుతోంది. ప్రఫుల్‌‌‌‌ పదవీకాలం 2020 డిసెంబర్‌‌‌‌లోనే ముగిసినా ఎన్నికలు నిర్వహించని కారణంగా సుప్రీంకోర్టు ఆయనను పదవి నుంచి తప్పించి ఏఐఎఫ్​ఎఫ్​ బాధ్యతలను ముగ్గురు సభ్యులతో కూడిన పరిపాలకుల కమిటీ (సీఓఏ)కి ఇచ్చింది.   ఈ కమిటీ  ఏఐఎఫ్ఎఫ్​కి నూతన  రాజ్యాంగ ముసాయిదాను రూపొందించి,  ఈనెల 28వ తేదీన ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. అయితే, ఏఐఎఫ్ఎఫ్​ ఎగ్జిక్యూటివ్​ కమిటీలో  కో ఆప్షన్​ సభ్యులుగా 50 శాతం ఉన్న  ప్రముఖ ఆటగాళ్ల  సంఖ్యను 25 శాతానికి తగ్గించాలని ఫిఫా  చెప్పినా సీఓఏ వినలేదు.   భైచుంగ్ భూటియా, ఐఎం విజయన్​ సహా  36 మంది ప్రముఖ ఆటగాళ్లను  చేర్చింది. దీన్ని ఫిఫా తప్పుబట్టింది.  ఎలక్టోరల్ కాలేజీలో వ్యక్తిగత సభ్యుల చేరికపై తమ వ్యతిరేకతను కేంద్ర మంత్రిత్వ శాఖకు సోమవారమే తెలియజేసిన  ఫిఫా 24 గంట్లోనే ​ఏఐఎఫ్​ఎఫ్​పై బ్యాన్​ విధించింది.

హాకీ ఇండియాపైనా వేలాడుతున్న కత్తి

హాకీ ఇండియా (హెచ్‌ఐ)పై కూడా నిషేధం కత్తి వేలాడుతోంది.  ప్రస్తుతం హెచ్‌ఐ.. పరిపాలకుల కమిటీ (సీఓఏ) ఆధ్వర్యంలో నడుస్తోంది. అదే టైమ్‌లో సవరించిన రాజ్యాంగాన్ని ఆమోదించడంతో పాటు హెచ్‌ఐకి కొత్తగా ఎన్నికలు ఎప్పట్లోగా నిర్వహిస్తారో చెప్పాలని సీఓఏను ఇంటర్నేషనల్‌ హాకీ ఫెడరేషన్ (ఎఫ్‌ఐహెచ్‌) కోరింది. ఈ నేపథ్యంలో ఇద్దరు సభ్యులతో కూడిన ఎఫ్‌ఐహెచ్‌ ప్రతినిధుల బృందం ఇండియాకు వచ్చింది. బుధవారం సీఓఏ సభ్యులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. హెచ్‌ఐ.. స్పోర్ట్స్‌ కోడ్‌ను అమలు చేయకపోయినా, ఎన్నికలను పూర్తి చేయలేకపోయినా.. వచ్చే జనవరిలో జరిగే మెన్స్‌ వరల్డ్‌ కప్‌ ఆతిథ్య హక్కులను ఇండియా కోల్పోనుంది.

ఏఐఎఫ్‌‌‌‌ఎఫ్‌‌‌‌ను గాడిలో పెట్టేందుకు ఇదో అవకాశం: బైచుంగ్‌‌‌‌

ఏఐఎఫ్‌‌‌‌ఎఫ్‌‌‌‌పై బ్యాన్‌‌‌‌ చాలా కఠినమైన నిర్ణయమని ఇండియా ఫుట్‌‌‌‌బాల్‌‌‌‌ మాజీ కెప్టెన్ బైచుంగ్‌‌‌‌ భూటియా అన్నాడు. అదే సమయంలో ఇండియా ఫుట్‌‌‌‌బాల్‌‌‌‌ సమాఖ్య పాలనను తిరిగి గాడిలో పెట్టేందుకు దీన్ని ఓ అవకాశంగా భావించాలన్నాడు. ‘బ్యాన్‌‌‌‌ నిర్ణయం బాధాకరం. మన వ్యవస్థను సరిదిద్దుకోవడానికి ఇదొక గొప్ప అవకాశంగా భావిస్తున్నా. ఇప్పుడు అందరు వాటాదారులు,- ఫెడరేషన్, రాష్ట్ర సంఘాలు కలిసి వచ్చి వ్యవస్థను సరిదిద్దడంతో పాటు భారత ఫుట్‌‌‌‌బాల్ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ  కృషి చేయడం చాలా ముఖ్యం’ అని భూటియా అభిప్రాయపడ్డాడు. మాజీ ఫుట్‌‌‌‌బాలర్లు షబ్బీర్‌‌‌‌ అలీ, మెహ్తాబ్‌‌‌‌ హుస్సేన్‌‌‌‌ కూడా ఫిఫా నిర్ణయం దురదృష్టకరమని అన్నారు.