కఠ్మండూ: ఆల్ నేపాల్ ఫుట్‌బాల్ అసోసియేషన్ (అన్ఫా)పై ఫిఫా నిషేధం విధించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ సస్పెన్షన్ కొనసాగుతుందని తెలిపింది. ఫిఫా రూల్స్‌లోని ఆర్టికల్ 16కు లోబడి అన్ఫాపై చర్యలు తీసుకున్నట్టు ఫిఫా కౌన్సిల్ బ్యూరో గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఫిఫా రూల్స్ ప్రకారం.. ఏ దేశ ఫుట్‌బాల్ అసోసియేషన్ అయినా స్వతంత్రంగా పనిచేయాలి.
అందులో ప్రభుత్వాల లేదా థర్డ్ పార్టీల జోక్యం ఉండకూడదు. అన్ఫా ఈ నిబంధనలను ఉల్లంగించినట్టు ఫిఫా గుర్తించి, సస్పెన్షన్ విధించింది. దీంతో నేపాల్‌కు చెందిన దాదాపు అన్ని జాతీయ జట్లు, స్థానిక క్లబ్‌లు అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనే అర్హతను కోల్పోయాయి. ఫిఫా, ఆసియా ఫుట్‌బాల్ కాన్ఫెడరేషన్ (ఏఎఫ్‌సీ) నిర్వహించే టోర్నమెంట్లలోనూ నేపాల్ జట్లు ఆడటానికి వీల్లేదు.
అన్ఫా, దాని అనుబంధ సంస్థలు, అధికారులకు ఫిఫా, ఏఎఫ్‌సీ అందించే డెవలప్‌మెంట్ ఫండ్స్ కూడా నిలిచిపోనున్నాయి. ఫిఫా అందించే డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్స్, కోర్సులు, ట్రైనింగ్ సెషన్స్‌లో పాల్గొనే అవకాశం ఉండదు. ఫిఫా నిబంధనల్లోని ఆర్టికల్ 13 ప్రకారం లభించే అన్ని రకాల సభ్యత్వ హక్కులను కూడా అన్ఫా కోల్పోయింది.
