ఫిఫా వరల్డ్ కప్ ట్రోఫీ విలువ రూ.6 కోట్లు.. నాలుగేళ్లలోనే ట్రోఫీలో బంగారం విలువ రెట్టింపు

ఫిఫా వరల్డ్ కప్ ట్రోఫీ విలువ రూ.6 కోట్లు.. నాలుగేళ్లలోనే ట్రోఫీలో బంగారం విలువ రెట్టింపు

న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన 'ఫిఫా వరల్డ్ కప్(ఫుట్ బాల్)' ట్రోఫీ విలువ గత నాలుగేండ్లలో ఊహించని విధంగా పెరిగింది. లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ గ్రూప్ (-ఎల్‌‌‌‌ఎస్‌‌ఈజీ) నివేదిక ప్రకారం.. 2022 ఖతార్ వరల్డ్ కప్ సమయంతో పోలిస్తే ట్రోఫీలోని బంగారం విలువ ఇప్పుడు రెండు రెట్లకు పైగా పెరిగింది. ఈ ట్రోఫీని మొత్తం 6.175 కిలోల 18 క్యారెట్ల బంగారంతో తయారు చేయగా.. అందులో 4.93 కిలోల స్వచ్ఛమైన గోల్డ్ ఉంది. 

ప్రస్తుతం ట్రోఫీలోని కేవలం బంగారం విలువే సుమారు 7,13,000 అమెరికన్ డాలర్లు.. అంటే మన ఇండియన్ కరెన్సీలో సుమారు రూ. 6 కోట్లు ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతలు, వ్యాపార అనిశ్చితి కారణంగా బంగారం ధరలు భారీగా పెరగడంతో ఫిఫా వరల్డ్ కప్ విలువ కూడా పెరిగింది. 

2022లో అర్జెంటీనా ఫిఫా వరల్డ్ కప్ కప్పును గెలుచుకున్నప్పుడు దానిలోని గోల్డ్ విలువ సుమారు 2,77,000 డాలర్లు (దాదాపు రూ. 2.31 కోట్లు) మాత్రమే ఉండేది. ఇక 1974లో సరికొత్త డిజైన్‌‌ను మొదటిసారి ప్రవేశపెట్టినప్పుడు దీని విలువ కేవలం 25,000 డాలర్లు (సుమారు రూ.21 లక్షలు) మాత్రమే కావడం గమనార్హం.

అత్యంత ఖరీదైన కప్పు ఫిఫా

ప్రపంచ క్రీడారంగంలో మరే ఇతర పెద్ద టోర్నమెంట్ ట్రోఫీని కూడా ఇంత భారీగా బంగారంతో తయారు చేయలేదు. అందుకే కరిగించి చూసే విలువలో (మెల్ట్ వాల్యూ) ఫిఫా వరల్డ్ కప్ ట్రోఫీకి సాటిలేదు. ఫిఫా కప్ క్రీడా ప్రపంచంలో అత్యంత ఖరీదైన కప్పుగా నిలిచింది. 

మిగతా ట్రోపీలను పరిశీలిస్తే..యూరోపియన్ ఫుట్‌‌బాల్ అసోసియేషన్ (యుఈఎఫ్ఏ) నిర్వహించే ఛాంపియన్స్ లీగ్(ఫుట్‌‌బాల్) ట్రోఫీ విలువ 16,950 డాలర్లు (సుమారు రూ.14.15 లక్షలు), అలాగే యూరప్ లీగ్ ట్రోఫీ(ఫుట్‌‌బాల్‌‌) విలువ 22,600 డాలర్లు (సుమారు రూ.18.87 లక్షలు) మాత్రమే ఉంటుంది.

ఎందుకంటే ఈ రెండు కప్పులను స్టెర్లింగ్ వెండి(92.5% స్వచ్ఛత)తో తయారు చేస్తారు. అమెరికాలో ఇచ్చే క్రీడా ట్రోఫీల్లో 'ఇండియానాపోలిస్ 500(కార్ రేసింగ్)'  విజేతకు ఇచ్చే 'బోర్గ్-వార్నర్ ట్రోఫీ' అత్యంత బరువైనది. 1.62 మీటర్ల ఎత్తున్న ఈ ట్రోఫీలో ఏకంగా 69 కిలోల స్టెర్లింగ్ వెండి ఉంటుంది. దీని మెల్ట్ వాల్యూ దాదాపు 1,56,000 డాలర్లు (సుమారు రూ.1.30 కోట్లు) ఉంటుంది. అలాగే.. అమెరికన్ సూపర్‌‌బౌల్(రగ్బీ లాంటి ఆట) విజేతలకు ఇచ్చే 'విన్స్ లంబార్డి ట్రోఫీ'లో 3.2 కిలోల వెండి ఉంటుంది. 

దీని విలువ సుమారు 7,230 డాలర్లు (అంటే దాదాపు రూ.6.03 లక్షలు). గుర్రపు పందాల విజేతకు ఇచ్చే 'వుడ్‌‌లాన్ వేస్' ట్రోఫీ విలువ దాదాపు 24,860 డాలర్లు (రూ.20.75 లక్షలు) ఉంటుంది. ప్రపంచంలోని మిగిలిన ట్రోఫీలన్నీ వెండితో తయారైతే, ఫిఫా కప్పు మాత్రం బంగారంతో మెరిసిపోతూ ప్రత్యేకంగా నిలుస్తోంది. ప్రస్తుతం అమెరికా, మెక్సికో, కెనడాల వేదికగా 2026 ఫిఫా వరల్డ్ కప్ టోర్నమెంట్ ఎంతో ఉత్కంఠభరితంగా సాగుతోంది. 

ఈసారి టోర్నమెంట్‌‌లో జట్ల సంఖ్యను గతంలో ఉన్న 32 నుంచి ఏకంగా 48 జట్లకు పెంచడంతో పోటీ మరింత తీవ్రంగా మారింది. ఈ అమూల్యమైన ట్రోఫీని ముద్దాడటం ఏ ఆటగాడికైనా జీవితకాల స్వప్నం. కానీ అందులోని బంగారం విలువ పెరిగిన తీరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతున్నది.