పంజాగుట్ట, వెలుగు: తెలంగాణ ప్రయోజనాలను కాపాడేందుకు పోరాటాలకు సిద్ధమని హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ‘నీళ్లు ఆంధ్రకు.. కన్నీళ్లు తెలంగాణకా?’ అనే అంశంపై తెలంగాణ బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు యెర్రా సత్యనారాయణ అధ్యక్షతన అఖిలపక్ష రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జల వనరుల కోసం గతంలో పోరాటాలు చేశామని గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం నీళ్లను రక్షించుకునేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. జల వనరుల సంఘం మాజీ అధ్యక్షుడు వి. ప్రకాశ్ మాట్లాడుతూ.. జూరాల నుంచి ప్రవహించే 400 టీఎంసీల నీటిలో కనీసం 11 టీఎంసీల నీరు కూడా తెలంగాణ ప్రాంతంలో పారడం లేదని, సీమాంధ్ర ప్రాంతానికే వెళ్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇక్కడి నీళ్లు ఆంధ్రకు పారుతూ తెలంగాణకు కన్నీళ్లు మిగులుతున్నాయని ఎద్దేవా చేశారు. సమావేశంలో ప్రభుత్వ సలహాదారు వీహెచ్, బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ కోఆర్డినేటర్ గుజ్జ కృష్ణ, కటకం నర్సింగ్‌రావు, నందా గోపాల్, ప్రముఖ న్యాయవాది నాగుల శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
