తుమ్మిళ్ల నీటి విడుదలపై రగడ

తుమ్మిళ్ల నీటి విడుదలపై రగడ
  •     ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యే 
  •     మోటార్ ఆన్ చేసేందుకు పోటీపడ్డ కాంగ్రెస్, బీఆర్ఎస్  
  •     ఆలంపూర్ ఎమ్మెల్యే విజయుడిని అరెస్ట్ చేసిన పోలీసులు 
  •     ఎట్టకేలకు నీటి విడుదల  

శాంతినగర్/అయిజ, వెలుగు : తుమ్మిళ్ల లిఫ్ట్ ఇరిగేషన్ నీటి విడుదలపై మంగళవారం రాజకీయ రగడ రగులుకున్నది. ఎమ్మెల్యే విజయుడు మోటార్ ఆన్ చేయగా, మాజీ ఎమ్మెల్యే సంపత్​కుమార్​ బంద్ చేయించారని ఎమ్మెల్యే ఆరోపణలు చేశారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. రాజోలి మండలం తుమ్మిళ్ల సమీపంలోని తుంగభద్ర నదిపై ఆర్డీఎస్ కాల్వలకు నీళ్లిచ్చేందుకు తుమ్మిళ్ల లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేశారు. 

.తుంగభద్ర నదికి వరద వస్తుండడంతో మంగళవారం తుమ్మిళ్ల లిఫ్ట్ మోటార్ ఆన్ చేసేందుకు ఆఫీసర్లు అన్ని సిద్ధం చేశారు. ఉదయం 7: 15 గంటలకు ఆలంపూర్ ఎమ్మెల్యే విజయుడు తుమ్మిళ్ల లిఫ్ట్ దగ్గరకు చేరుకొని మోటార్ ఆన్ చేసి అక్కడికి నాలుగు కిలోమీటర్ల దూరంలోని ఆర్డీఎస్ కాల్వ డెలివరీ పాయింట్ (డిస్ట్రిబ్యూటర్ 22, 23) వద్దకు చేరుకొని నీళ్ల రాక కోసం వేచి ఉన్నారు. అయితే, అనుకున్న టైంకు నీళ్లు రాకపోవడంతో మోటార్ ఆఫ్ చేశారంటూ ఎమ్మెల్యే విజయుడు అక్కడే బైఠాయించారు. తర్వాత ఏఐసీసీ సెక్రెటరీ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ లిఫ్ట్ దగ్గరకు చేరుకొని మళ్లీ మోటార్లు ఆన్ చేశారు. అయితే టెక్నికల్ ఇష్యూ కారణంగా నీళ్లు రాలేదు. 

సంపత్​కుమార్​పై ఎమ్మెల్యే ఆరోపణలు 

తాను మోటార్​ఆన్​ చేసిన తర్వాత మాజీ ఎమ్మెల్యే సంపత్​కుమార్ ఆఫ్​ చేయడంతోనే నీళ్లు రాలేదని ఎమ్మెల్యే విజయుడు ఆరోపించారు. తుమ్మిళ్ల లిఫ్ట్​డెలివరీ పాయింట్​ వద్ద ఆయన మాట్లాడుతూ కనీసం వార్డ్ మెంబర్ అర్హత కూడా లేని సంపత్ కుమార్ ఎలా మోటార్ ఆన్ చేస్తారని ప్రశ్నించారు.  ఆఫీసర్లు టెక్నికల్​ ఇష్యూ వల్ల నీళ్లు రావడం లేదని చెప్పినా వినలేదు. దీంతో అడిషనల్ ఎస్పీ గుణశేఖర్, డీఎస్పీ సత్యనారాయణ వచ్చి ఆయనకు సర్ధి చెప్పేందుకు ప్రయత్నం చేశారు. వినకపోవడంతో ఎమ్మెల్యేను అరెస్టు చేసి స్టేషన్​కు తరలించారు. ఈ సందర్భంగా కొద్దిసేపు తోపులాట జరిగింది. పోలీసులకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ శ్రేణులు నినాదాలు చేశారు. 

మోటార్ ​ఆన్​చేయాలని సంపత్​ ఆందోళన

ఎమ్మెల్యే అరెస్టు తర్వాత సంపత్ కుమార్ తుమ్మిళ్ల డెలివరీ పాయింట్ వద్దకు చేరుకొని ఆందోళన చేశారు. మోటార్ ఆన్ చేసే వరకు ఎక్కడికీ వెళ్లేది లేదని భీష్మించుకు కూర్చున్నారు. కలెక్టర్, ఇరిగేషన్ అధికారులతో  ఫోన్​లో మాట్లాడి నీటిని విడుదల చేయాలని పట్టుబట్టారు. దీంతో చివరకు చేసేది లేక సాయంత్రం అధికారులు మోటార్ ఆన్ చేశారు. పలు నాటకీయ పరిణామాల మధ్య తుమ్మిళ్ళ మోటార్ ఆన్ కావడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. 

 మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ సెక్రెటరీ సంపత్​కుమార్​ మాట్లాడుతూ బీఆర్ఎస్ లీడర్లు ఆర్డీఎస్ ను రాజకీయాల కోసం వాడుకుంటున్నారని మండిపడ్డారు. తుమ్మిళ్ల లిఫ్ట్ దగ్గర మాట్లాడుతూ ఆర్డీఎస్ కోసం తాను రక్తాన్ని ధారపోశాననే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. మోటార్ ఆన్ చేస్తే కాంగ్రెస్ పార్టీ వాళ్లు ఆఫ్ చేశారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కమిట్​మెంట్​తో ఉన్నారని, త్వరలోనే మల్లమ్మ కుంట రిజర్వాయర్​ను   కూడా నిర్మించి తీరతామన్నారు.