వండర్ కిడ్: నానమ్మను చూడటానికి వేల కి.మీ.లు నడిచాడు

వండర్ కిడ్: నానమ్మను చూడటానికి వేల కి.మీ.లు నడిచాడు

న్యూఢిల్లీ: ఇంటర్నెట్‌ చాలా కథలు, కథనాలతో నిండి ఉంటుంది. కానీ వాటిలో కొన్ని స్టోరీస్ మాత్రమే హృద్యంగా ఉంటాయి. అవి మిమ్మల్ని నవ్విస్తాయి, ఏడిపిస్తాయి, ఎమోషనల్‌‌గా టచ్ చేస్తాయి. ఇలాంటి కథల సరసన నిలిచేదే ఈ బుడతడి స్టోరీ. పదేళ్ల రోమియో కాక్స్ తన తండ్రితో కలసి ఇటలీలోని సికిలీ నుంచి యూకేలోని లండన్ వరకు కాలినడకన నడిచాడు. అది కూడా ఎందుకో తెలుసా? తన నానమ్మకు హగ్ ఇవ్వడానికి. వింటుంటే ఆశ్చర్యంగా ఉందా. కానీ ఇది నిజం. బిజీ లైఫ్‌‌లో కంటి ముందున్న కన్నోళ్లను పట్టించుకోని ఈ రోజుల్లో కాక్స్ తన నానమ్మను చూడటానికి వేల కిలో మీటర్లు నడవడం షాకింగే మరి.

కాక్స్ తన జర్నీకి సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఇన్‌‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేశాడు. ‘2,800 కి.మీ.ల దూరంలో ఉన్న లండన్‌‌‌కు వెళ్తున్నా.. అది కూడా మా గ్రానీని చూడటానికి‘ అంటూ రాసి ఉన్న ఓ అట్ట ముక్కను కాక్స్ తన వీపుపై ఉన్న బ్యాగ్‌‌‌కు తగిలించుకోవడం విశేషం. ‘శరణార్థులకు మద్దతు ఇవ్వడానికి నేను 2,800 కి.మీ.ల దూరం నడుస్తున్నా. ప్రతి రెఫ్యూజీ సమాన విద్య, జీవించే అవకాశం పొందాలి. మా నానమ్మను కౌగిలించుకోవడానికి ఎదురు చూస్తున్నా. నేను ఆమెను చూసి ఏడాది దాటింది. లాక్‌‌డౌన్‌‌లో తను ఒంటరిగానే ఉంది’ అని కాక్స్ చెప్పాడు. గత నెల 21న లండన్‌‌లోని ట్రఫల్‌‌గర్ స్క్వేర్‌‌కు కాక్స్ చేరుకున్నాడు. నానమ్మను కలవడానికి అంత దూరం నుంచి నడిచొచ్చినా కరోనా కారణంగా కాక్స్‌‌ను క్వారంటైన్‌‌లో ఉంచారు. ఆ తర్వాత అతడు తన గ్రానీని కలిశాడు. ఈ పిల్లాడి ఓడిపోని తత్వం, పోరాడే తీరుకు అందరూ ఫిదా అవుతున్నారు. నానమ్మను కలవడంతోపాటు శరణార్థుల కోసం మంచి సంకల్పంతో ముందుకు సాగిన ఈ బుడతడి కహానీ అందరికీ స్ఫూర్తిమంతమే అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.