హుజూరాబాద్ ఎఫెక్ట్.. సింగరేణిలో కదిలిన ఇండ్ల ఫైలు

హుజూరాబాద్ ఎఫెక్ట్.. సింగరేణిలో కదిలిన ఇండ్ల ఫైలు
  • సింగరేణిలో ఎట్టకేలకు కదిలిన ఇండ్ల పట్టాల ఫైలు
  • హుజూరాబాద్​ ఎన్నికల నేపథ్యంలో సర్కారు నిర్ణయం
  • మంచిర్యాల జిల్లాలో మూడేండ్ల తర్వాత జారీకి సన్నాహాలు
  • హుజూరాబాద్ నియోజకవర్గంలో 10వేల మంది వరకు కార్మికులు
  • మొదలైన రిజిస్ట్రేషన్ల ప్రక్రియ 
  • ఈ నెల 12న కేటీఆర్ చేతుల మీదుగా పంపిణీకి కసరత్తు

మందమర్రి​, వెలుగు: మంచిర్యాల జిల్లాలోని సింగరేణి స్థలాల్లో కార్మికులు, కార్మికేతరులు సొంతంగా కట్టుకున్న ఇండ్లకు పట్టాలివ్వడానికి సర్కార్​ రెడీ అయింది. గత అసెంబ్లీ ఎన్నికల ముందు సీఎం కేసీఆర్​ ఇచ్చిన హామీ అమలుకోసం మూడేళ్లుగా ఈ ప్రాంతవాసులు ఎదురుచూస్తుండగా, హుజూరాబాద్​ ఉప ఎన్నికల కారణంగా కల సాకారమవుతోంది. ఈనెల 12న మంత్రి కేటీఆర్​ చేతుల మీదుగా సింగరేణి ప్రాంతాల్లోని ఇళ్ల స్థలాకు పట్టాలిచ్చేందుకు ఆఫీసర్లు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర సర్కార్​ 2019లో ఇచ్చిన జీవో నెంబరు 76 ప్రకారం 2014కు ముందు నుంచి సింగరేణి స్థలాల్లో నివాసం ఉంటున్న వారందరికీ పట్టాలు అందజేయనున్నారు. 

మూడేండ్ల కింద సీఎం హామీ..
40 యేండ్ల కింద బొగ్గు గనుల ఆవిర్భావంతో  వివిధ ప్రాంతాల నుంచి ఉద్యోగరీత్యా కార్మికులు, కార్మికేతరులు మంచిర్యాల జిల్లాలోని మందమర్రి, రామకృష్ణాపూర్​, శ్రీరాంపూర్​, నస్పూర్​, కాసిపేట, బెల్లంపల్లి ప్రాంతాలకు వచ్చి సింగరేణి  స్థలాల్లోనే నివాసాలు ఏర్పాటు చేసుకొని ఉంటున్నారు. వీరిలో ప్రస్తుత హుజూరాబాద్​ నియోజకవర్గం నుంచి ఏకంగా 8 వేల మంది దాకా కార్మికులు, రిటైర్డ్​ కార్మికులు ఉన్నారు. గోదావరిఖని ప్రాంతంలో మరో 3వేల మంది దాకా ఉన్నారు. జమ్మికుంట, కమాలపూర్​, వీణవంక, హుజురాబాద్​ టౌన్​, చుట్టు పక్కల గ్రామాలకు చెందిన ఈ సింగరేణి కార్మిక కుటుంబాలు రాబోయే హుజూరాబాద్​ ఉప ఎన్నికల్లో గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో ఉండడంతో ప్రభుత్వం పాత ఫైల్​ దుమ్ము దులిపింది. వాస్తవానికి సీఎం కేసీఆర్​ 2018 ఫిబ్రవరి 27న మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్​లో పర్యటించినప్పుడు  కంపెనీ స్థలాల్లోని నివాసాలకు పట్టాలిస్తామని ప్రకటించారు. ఇదే విషయాన్ని అసెంబ్లీ ఎన్నికలకు ముందు  నవంబర్​ 23న  బెల్లంపల్లిలో మరోసారి ప్రస్తావించారు. ఎన్నికలు జరిగిన ఆరునెలల అనంతరం  సర్కార్ ఆదేశాలతో ​ ఆరు జిల్లాల్లో కలిపి సింగరేణి కార్మికులు, కార్మికేతరులు నిర్మించుకున్న  సుమారు 25వేల  పైగా నివాసాలు, ఖాళీస్థలాలకు సంబంధించి 1,713 ఎకరాలను సింగరేణి యాజమాన్యం ఆయా  జిల్లా కలెక్టర్లకు సరెండర్​ చేసింది.  2019 జూన్​లో సింగరేణి స్థలాలకు పట్టాలివ్వాలని సర్కార్​ సర్క్యులర్​ జారీ చేసింది. ఇందు కోసం  రెవెన్యూ శాఖ ఇండ్ల  సర్వే నిర్వహించి  పెద్దపల్లి జిల్లాకు సంబంధించి 1511ఇళ్లు, భద్రాది కొత్తగూడెం జిల్లాలో 8010 నివాస గృహాలు, భూపాలపల్లిలో 3వేలు,  మంచిర్యా జిల్లాలో 16 వేల నివాస గృహాలు సింగరేణి స్థలాల్లో ఉన్నట్లు గుర్తించారు. స్థానికుల నుంచి దరఖాస్తులు, సర్కార్​ సూచించిన విధంగా  స్థలాలకు సంబంధించి ఫీజును డీడీ రూపంలో రెవెన్యూ ఆఫీసర్లకు స్వీకరించారు. మున్సిపల్​ ఎలక్షన్​ ముందు నియోజకవర్గ పరిధిలో పది మందికి మాత్రమే పట్టాలిచ్చారు. ఇప్పుడు మిగిలిన కుటుంబాల్లోని మహిళల పేరిట మూడురోజులుగా రెవెన్యూ ఆఫీసర్లు యాజమాన్యపు హక్కు పత్రాలు అందజేస్తున్నారు. వీటి ఆధారంగా రిజిస్ట్రేషన్​ చేసుకునేందుకు సబ్​రిజిస్ట్రార్​ ఆఫీసుల్లో లబ్ధిదారులు బారులుతీరుతున్నారు.

మా ప్రాంతాలకూ వర్తింపజేయాలె
సింగరేణి ప్రాంతాల్లో రెవెన్యూ, మున్సిపల్​, సింగ రేణి జాయింట్​గా  చేపట్టిన సర్వే నత్తనడకన సాగింది. పలుచోట్ల కొన్ని సాంకేతికపరమైన అంశాలు, సింగరేణి క్వార్టర్లలంటూ, బొగ్గు గనులు వస్తాయంటూ  అడ్డదిడ్డమైన నిబంధనలు తెరపైకి తేవడంతో సర్వే నిలిచిపోయింది.  మందమర్రి మున్సిపాలిటీ ఏజెన్సీ యాక్ట్​ పరిధిలోకి రావడంతో అక్కడ పట్టాలిచ్చే పరిస్థితులు లేకుండా పోయింది. క్యాతన్​పల్లి మున్సిపాలిటీలో సుమారు 3,500 మంది పట్టాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. తారకరామాకాలనీ (మొదటివార్డు), జ్యోతినగర్​(రెండోవార్డు)లోని కొన్ని ప్రాంతాలు మందమర్రి ఏజెన్సీ యాక్ట్​ పరిధిలో ఉన్నాయంటూ సర్వే చేయ లేదు. నస్పూర్​ మున్సిపాలిటీలో 2843 మంది అప్లై చేసుకోగా  ఆర్కే6 కొత్తగుడిసెలు(మైన్​వైపు), శ్రీరాంపూర్​కాలనీ కొత్తరోడ్​ మధ్యలోని లక్ష్మీనగర్, గణేశ్​నగర్​, ఆర్కే6 గుడిసెలు, కృష్ణమూర్తినగర్​,  ఆర్కే8 కాలనీ క్వార్టర్లను ఆనుకొని ఉన్న ఇండ్లను సర్వే చేయలేదు. ఓసీపీ వస్తుందని సాకు చూపు తున్నారు. బెల్లంపల్లి మున్సిపాలిటీలో 2722 మంది దరఖాస్తు చేసుకున్నారు.  బూడిదగడ్డ బస్తీ, శాంతి ఖని, కన్నాలబస్తీ, నెంబరు 2 ఇంక్లైయిన్​, సి క్లాస్​ క్వార్టర్ల ఏరియాలో సర్వే చేయలేదు. సింగరేణి క్వార్టర్ల ప్రాంతాలు  కావడంతో రెవెన్యూ ఆఫీసర్లు సర్వే చేయలేకపోయమంటున్నారు.  అన్ని ప్రాంతాల్లోని ఇండ్లకు పట్టాలు వర్తింపజేయాలని స్థానికులు డిమాండ్​చేస్తున్నారు.