- దక్షిణాది రాష్ట్రాలపై హిందీని రుద్దొద్దు: నటుడు ప్రకాశ్ రాజ్
- ‘దక్షిణ భారత భాషలు- గుర్తింపు, రాజకీయాలు’ అంశంపై సదస్సుకు హాజరు
హైదరాబాద్, వెలుగు: నార్త్ ఇండియాలోని కొన్ని రాష్ట్రాల వారికి హిందీ మాత్రమే వచ్చని, ఇతర భాషలు రావని సినీ నటుడు ప్రకాశ్ రాజ్ అన్నారు. దీంతో వాళ్లు దక్షిణాది రాష్ట్రాలపై హిందీని బలవంతంగా రుద్దేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికొచ్చి తమ భాష, సంస్కృతిని దెబ్బతీయాలనే చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ‘దక్షిణ భారత భాషలు -గుర్తింపు, రాజకీయాలు’ అనే అంశంపై శనివారం జాతీయ సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రకాశ్ రాజ్ చీఫ్ గెస్ట్‌గా హాజరై, మాట్లాడారు. ‘‘మన భాష, మన సంస్కృతి మన ధ్వని, మన గర్వం, మన గుర్తింపు.. దీన్ని ఎవరు దెబ్బతీయాలని చూసినా.. ఎట్టి పరిస్థితుల్లో మా ఉనికిని వదులుకోం. నా మాతృభాష కన్నడ. కానీ, నేను తెలుగుతో సహా 7 భాషలు మాట్లాడగలను. అన్ని భాషలనూ గౌరవిస్తా. కానీ, కొందరు మాత్రం తమదే గొప్ప భాష అని, అదే పురాతనమైనదని ఫీల్ అవుతుంటరు.
మిగతా భాషలను చిన్నచూపు చూస్తున్నరు’’అని ప్రకాశ్ రాజ్ అన్నారు. తాము నార్త్ ఇండియా స్టేట్స్కు వ్యతిరేకం కాదని ఓపెన్ వర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి అన్నారు. ‘‘దక్షిణాది రాష్ట్రాలపై జరుగుతున్న సాంస్కృతిక దాడిని, నిధుల కేటాయింపుల్లో జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తాం. ప్రకాష్ రాజ్ కేవలం నటుడే కాదు.. దక్షిణాది రాష్ట్రాల సాంస్కృతిక వారధి’’అని చక్రపాణి అన్నారు. మాతృభాషలో మన భావాలను చెప్పుకున్నప్పుడు వచ్చే కిక్కే వేరని రచయిత్రి మీనా కందసామి అన్నారు.
శ్రీలంకలో తమిళ ఈలం ఉద్యమం భూమి కోసం మాత్రమే కాదని, భాషా గుర్తింపు కోసం జరిగిందని గుర్తు చేశారు. భాష అనేది కేవలం ఒక గుర్తింపు మాత్రమే కాదని, అది విద్య, అధికారాలను అందించే రాజకీయ మౌలిక వనరు అని ఆంధ్రజ్యోతి మాజీ ఎడిటర్ కే శ్రీనివాస్ అన్నారు. ఈ సదస్సులో సెమినార్ డైరెక్టర్ ఎన్.రజని, రాణి రజిత మాధురి, రిజిస్ట్రార్ ఎల్.విజయకృష్ణారెడ్డి, పుష్పా చక్రపాణి, పలువురు భాషా ప్రముఖులు పాల్గొన్నారు.
