తెలుగు ఫిలిం ఛాంబర్ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి షూటింగ్ లకు కొత్త వారికి కూడా అవకాశం కల్పించాలని నిర్ణయించింది. సభ్యత్వం లేనివారిని కూడా షూటింగ్ లకు తీసుకోవాలని ఫలిం ఛాంబర్ భేటీలో నిర్ణయించారు. కార్మికుల జీతాల పెంపును వ్యతిరేకిస్తున్నట్లు సోమవారం (ఆగస్టు 04) ప్రకటన విడుదల చేసింది.
వేతనాలు పెంచాలని గత కొంత కాలంగా కార్మికులు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. వేతనాల పెంపుపై ఫిలిం ఫెడరేషన్ ఆధ్వర్యంలో కార్మికులు ధర్నాకు దిగారు. షూటింగ్ లను నిలిపివేసి ఆందోళన చేపట్టారు. జీతాలు పెంచే వరకు విధులకు హాజరయ్యేది లేదని తేల్చిచెప్పారు.
కార్మికుల డిమాండ్లపై ఫిలిం ఛాంబర్ సభ్యులు భేటీ అయ్యారు. కార్మిక సంఘాలు కోరుతున్నట్లు 30 శాతం జీతాల పెంపు సాధ్యం కాదని TFCC ప్రకటన విడుదల చేసింది. తెలుగు సినీ పరిశ్రమ ఇబ్బందుల్లో ఉందని.. ఈ పరిస్థితుల్లో జీతాలు పెంచాలనడం సరికాదని ప్రకటనలో పేర్కొంది. సామరస్య పూర్వకంగా చర్చలు జరుపుతున్న సమయంలో ఆందోళనలు నిర్వహించడం సమంజసం కాదని తెలిపింది.
కార్మికుల వేతనాల పెంపుతో చిన్న నిర్మాతలు ఇబ్బందులకు గురవుతారని.. వారు ఆర్థిక భారాన్ని భరించలేరని.. వేతనాల పెంపును నిర్మాతలందరూ ఏకగ్రీవంగా వ్యతిరేకించినట్లు ప్రకటనలో పేర్కొంది. కనీస వేతన చట్టం ప్రకారం ఏ కార్మికుడినైనా నియమించుకునే హక్కు నిర్మాతలకు ఉందని తెలిపింది.
హైదరాబాద్ లో లివింగ్ కాస్ట్ ఇతర నగరాలతో పోల్చితే తక్కువే ఉందని.. ఇతర సినీ పరిశ్రమలు ఇస్తున్నదాని కంటే ఇక్కడ ఎక్కువ వేతనాలు ఇస్తున్నట్లు ఫిలిం ఛాంబర్ తెలిపింది. ఈ క్రమంలో ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. ఇక నుంచి యూనియన్ లో సభ్యత్వం లేని కార్మికులకు సైతం అవకాశం కల్పించాలని సభ్యులు నిర్ణయించారు.
సినీ పరిశ్రమలో పనిచేసేందుకు ఎంతో మంది కార్మికులు సిద్ధంగా ఉన్నప్పటికీ.. యూనియన్ లలో సభ్యత్వం కోసం లక్షల్లో డిమాండ్ చేస్తూ కొత్త వాళ్లను రానివ్వటం లేదని.. ఇది ఎంతో మంది కార్మికుల పొట్టకొట్టడమే అవుతుందని టీఎఫ్ సీసీ పేర్కొంది. అందుకోసం ఇక నుంచి కొత్త వారికి కూడా అవకాశాలు కల్పించాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటనలో పేర్కొంది.
