
నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న చిత్రం ‘ది ప్యారడైజ్’. శుక్రవారం కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేయడంతో పాటు నాని పాత్రను రివీల్ చేశారు మేకర్స్. ఇందులో అతను ‘జడల్’ క్యారెక్టర్‌లో కనిపించనున్నట్టు ప్రకటించారు. రగ్డ్ మీసం, గెడ్డం, రెండు జడలతో కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని హడల్ పుట్టించేలా ఉన్న ఈ ‘జడల్’ పోస్టర్ సినిమాపై మరింత క్యూరియాసిటీని క్రియేట్ చేస్తోంది.
బ్యాక్‌గ్రౌండ్‌లో కత్తులు బుల్లెట్లతో ఉన్న ఒక రౌండ్ వీల్ కనిపిస్తుంది. ‘ఇది ఒక అల్లికగా ప్రారంభమైంది. ఒక విప్లవంగా ముగిసింది’ అంటూ ఈ ఫొటోకు క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హైదరాబాద్, సికింద్రాబాద్ నేపథ్యంలో సాగే ఇంటెన్స్ పీరియడ్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కుతోంది.
ఈ మూవీతో ‘కిల్’ ఫేమ్ రాఘవ జూయాల్ విలన్‌గా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. మార్చి 26న తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, ఇంగ్లీష్, స్పానిష్ సహా మొత్తం ఎనిమిది భాషల్లో పాన్ వరల్డ్ మూవీగా రిలీజ్ చేస్తున్నారు. ‘దసరా’ తర్వాత నాని, -శ్రీకాంత్ ఓదెల కాంబోలో రాబోతోన్న చిత్రం కావడంతో అంచనాలు ఏర్పడ్డాయి.