బీఆర్ఎస్​ పాలనపై ఆర్థిక మంత్రి భట్టి ఫైర్

బీఆర్ఎస్​ పాలనపై ఆర్థిక మంత్రి భట్టి ఫైర్

హైదరాబాద్, వెలుగు : పదేండ్ల పాలనలో బీఆర్ఎస్ అభివృద్ధేం చేయలేదని, ఆర్థిక విధ్వంసం సృష్టించిందని డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఆర్థిక వనరులు పుష్కలంగా ఉన్న రాష్ట్రాన్ని ఆరు లక్షల కోట్ల అప్పుల్లో ముంచిందని ఫైర్ అయ్యారు. తెలంగాణ ఏర్పడే నాటికి కేవలం రూ.72 వేల కోట్ల అప్పు మాత్రమే ఉండగా, పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో 6.71లక్షల కోట్లకు పెరిగిందని చెప్పారు. ఇన్ని రోజులు తెలంగాణ ప్రజలు కేవలం రూ.5 లక్షల కోట్ల అప్పు మాత్రమే ఉందని అనుకున్నారని.. కానీ గత బీఆర్ఎస్ సర్కార్ నిజాలను దాచిపెట్టిందని మండిపడ్డారు. 

2014లో14 శాతమున్న రుణభారం.. బీఆర్ఎస్ పాలనలో 34 శాతానికి పెరిగిందని తెలిపారు. కార్పొరేషన్లు పెట్టి, అధిక వడ్డీలకు అప్పులు తీసుకురావడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని చెప్పారు. అప్పు కట్టడానికి మళ్లీ అప్పు చేయాల్సిన దుస్థితి నెలకొందన్నారు. ఇవన్నీ ప్రజలకు తెలియజేయాలనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వైట్ పేపర్ రిలీజ్ చేశామని పేర్కొన్నారు. ఇందులో వేరే ఉద్దేశమేమీ లేదని, ప్రతిపక్ష సభ్యులు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని, రాష్ర్టానికి నష్టం జరుగుతుందని ఆవేదన చెందవద్దని అన్నారు. బుధవారం అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వైట్ పేపర్ ను భట్టి ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా జరిగిన చర్చలో సభ్యులకు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలు చెప్పారు. అప్పుల కిస్తీలు, వడ్డీల కిందనే ఏటా రూ.53 వేల కోట్లు చెల్లించాల్సిన దుస్థితిని బీఆర్ఎస్  తీసుకొచ్చిందని భట్టి మండిపడ్డారు. రోజువారి ఖర్చులకు కూడా ఓడీపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల నుంచి వాటర్ ట్యాక్స్ వసూలు చేసి అప్పులు కడతామని కాళేశ్వరం, మిషన్ భగీరథ కోసం బీఆర్ఎస్ సర్కారు లోన్లు తీసుకుందని.. ఈ మేరకు బ్యాంకులకు డీపీఆర్ ఇచ్చిందని పేర్కొన్నారు. మిషన్ భగీరథ పథకంపైనా విచారణ చేయించాలని సీఎంను కోరారు.  

మీరు తెచ్చింది ఫామ్ హౌస్ లే.. 

అప్పులు చేసి ఆస్తులు సృష్టించామని బీఆర్ఎస్ చెబుతోందని, మరి వాళ్లు సృష్టించిన ఆస్తులేవీ అని భట్టి ప్రశ్నించారు. ‘‘ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి తక్కువ నిధులే కేటాయించినా అనేక ఆస్తులు సృషించాం. కంటికి కనిపించే నాగార్జున సాగర్, శ్రీశైలం, జూరాల, ఎస్ఆర్ఎస్పీ, దేవాదుల, కడెం ప్రాజెక్టులతో పాటు హైదరాబాద్ చుట్టూ రింగ్ రోడ్, ఇంటర్నేషనల్​ ఎయిర్ పోర్టు, ఐఐటీ.. ఇలా ఎన్నో చేశాం. హైదరాబాద్​కు మంజీరా, గోదావరి నీళ్లు తెచ్చాం” అని చెప్పారు. ‘‘మేం అతి తక్కువ డబ్బులతోనే ఇన్ని ఆస్తులు సృష్టించినప్పుడు.. ఈ పదేండ్లలో లక్షల కోట్ల బడ్జెట్​తో బీఆర్ఎస్ ఇంకా ఎన్నో ఆస్తులు సృష్టించాల్సింది. కానీ వాళ్లు సృష్టించిన ఆస్తులేవీ ఎక్కడా కనిపించడం లేదు. పదేండ్లలో బీహెచ్​ఈల్, బీడీఎల్​ తీసుకొచ్చారా? తెచ్చిన ఐటీఐఆర్ ప్రాజెక్టునూ పోగొట్టారు. కేవలం రెండు ఫామ్​హౌస్​లు మాత్రమే తెచ్చారు. కాళేశ్వరం, పాలమూరు– రంగారెడ్డి, సీతారామ ప్రాజెక్టులు తెచ్చారు కానీ.. ఇప్పటికీ పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులో పంపులు పెట్టలేదు. సీతారామలో బ్యారేజీనే లేదు. కట్టక కట్టక కట్టిన  కాళేశ్వరంలో మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోయాయి” అని విమర్శించారు. 

బీఆర్ఎస్​తో జనం విసిగిపోయిన్రు.. 

తెలంగాణ వస్తే అంతా బాగుంటుందని ప్రజలు ఎన్నో కలలు కన్నారని, కానీ బీఆర్ఎస్ ఆ కలలను కల్లలు చేసిందని భట్టి ఫైర్ అయ్యారు. ‘‘తెలంగాణ వస్తే అద్భుతంగా అభివృద్ధి జరిగి తమ జీవితాల్లో వెలుగులు వస్తాయని.. అందరికీ కొలువులు, భూములు వస్తాయని.. ఆత్మగౌరవంతో తలెత్తుకుని జీవించే అవకాశం వస్తుందని ప్రజలు రాష్ట్రం కోసం పోరాడారు. ప్రజల పోరాటం చూసి కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది. కానీ రాష్ట్రం ఏర్పడి దశాబ్ద కాలమైనా ప్రజల జీవితాల్లో మార్పు, వెలుగులు రాలేదు. బీఆర్ఎస్ పాలనతో విసిగిపోయిన ప్రజలు.. మార్పు కోసం కాంగ్రెస్ ను గెలిపించారు. తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చడానికి అంకితభావంతో పనిచేస్తం” అని చెప్పారు. 2014లోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఉంటే తెలంగాణ భూతల స్వర్గంగా మారేదని, ప్రజలకు ఈ బాధలు ఉండేవి కావన్నారు. 

వైట్ పేపర్ లో ఎలాంటి తప్పుల్లేవ్.. 

తాము విడుదల చేసిన వైట్ పేపర్ లో ఎలాంటి తప్పుల్లేవని భట్టి స్పష్టం చేశారు. గత బడ్జెట్‌‌ లెక్కలు, ఆర్​బీఐ, కాగ్ నుంచి సేకరించిన వివరాలతోనే రిపోర్టు తయారు చేశామని పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీలు తమకు శత్రువులు కాదని ప్రత్యర్థులు మాత్రమేనని అన్నారు. ‘‘ఆంధ్రా రిటైర్డ్ అధికారులతో వైట్ పేపర్ తయారు చేయించామని హరీశ్ రావు మాట్లాడటం సరికాదు. తెలంగాణ అధికారులను అవమానించేలా ఆయన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రా అధికారులతో వైట్ పేపర్ తయారు చేయించాల్సిన అవసరం మాకు లేదు. సర్వీస్ లో ఉన్న తెలంగాణ అధికారులు చాలా నిష్ణాతులు. వాళ్లతోనే ఈ నివేదికను తయారు చేయించాం. తెలంగాణ క్యాడర్ ఐఏఎస్, ఐపీఎస్ లపై నమ్మకం లేక మీరే(హరీశ్ రావు) ఆంధ్రా క్యాడర్​అధికారులను పిలిపించుకుని సీఎస్, డీజీపీ పోస్టులు ఇచ్చారు. వాళ్లనే సలహాదారులుగా పెట్టుకున్నారు” అని విమర్శించారు. కాగా, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కామెంట్లపై స్పందిస్తూ.. ‘ఇందిరమ్మ రాజ్యంలో కేవలం కడియం శ్రీహరికే కాదు.. ఆ పార్టీ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలకు, రాష్ట్రంలో ఉన్న నాలుగు కోట్ల మందికి స్వేచ్ఛ, వాక్ స్వాతంత్ర్యం వచ్చింది” అని అన్నారు.  

బీఆర్ఎస్ మాయమాటలతో ప్రజలను మోసం చేసింది.. 

బీఆర్ఎస్ హయాంలో 2014 నుంచి 2023 వరకు పెట్టిన వార్షిక బడ్జెట్లన్నీ వాస్తవాలకు దూరంగా ఉన్నాయని భట్టి అన్నారు. తప్పుడు లెక్కలతో ప్రజలకు భ్రమలు కల్పించారని మండిపడ్డారు. ‘‘బడ్జెట్ లో ఎక్కడైనా అంచనాలకు, ఖర్చుకు మధ్య 5 శాతం తేడా ఉంటుంది. కానీ బీఆర్ఎస్ పెట్టిన బడ్జెట్లలో కేటాయింపులు, ఖర్చులకు మధ్య 20శాతానికి పైగా తేడా ఉంది” అని పేర్కొన్నారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, కర్నాటక, కేరళ లాంటి రాష్ర్టాల్లో బడ్జెట్ లో పెట్టిన దాని కంటే ఎక్కువ ఖర్చు చేశారని చెప్పారు. ఇంటికో ఉద్యోగం, దళిత సీఎం, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, కేజీ టు పీజీ స్కూళ్లు, ప్రతి మండలంలో మూడు రెసిడెన్షియల్ స్కూళ్లు, ప్రతి నియోజకవర్గంలో అదనంగా లక్ష ఎకరాలకు నీళ్లు.. ఇలా ఎన్నో మాయమాటలు చెప్పి తెలంగాణ ప్రజలను బీఆర్ఎస్ మోసం చేసిందని ఫైర్ అయ్యారు. 

రోజువారి ఖర్చులకూ ఓడీలపైనే ఆధారం..  

రోజువారి ఖర్చులకు కూడా ఓడీ (ఓవర్ డ్రాఫ్ట్) పైనే ఆధారపడి పాలన చేసుకోవాల్సిన దుస్థితిని గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిందని భట్టి మండిపడ్డారు. ఈ దుస్థితి రావడం  దురదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. దశాబ్ద కాలంగా జరిగిన ఆర్థిక అరాచకత్వం, తప్పిదాలపై రాష్ట్ర ప్రజలందరికీ చెప్పాల్సిన బాధ్యత తమపై ఉందని, అందుకే వైట్ పేపర్ రిలీజ్ చేశామన్నారు. ప్రజల ఆకాంక్షలు, ఆశలు,  కళలు నెరవేర్చడం కోసం రాష్ట్రంలో ఉన్న ఆర్థిక స్థితిగతులను అందరికీ తెలియజేస్తున్నామన్నారు. ‘‘ఎన్నో కలలు, ఆశలు, ఆకాంక్షలతో ప్రత్యేక రాష్ట్రం కావాలని ప్రజలు పోరాడారు. నీళ్లు, నిధులు, నియామకాలు నినాదంతో రాష్ట్రాన్ని సాధించుకున్నాం. కానీ పదేండ్ల పాలనలో రాష్ట్ర ఆర్థిక వనరులను బీఆర్ఎస్ కొల్లగొట్టింది. తెలంగాణ ప్రజల కలలను హరించింది” అని మండిపడ్డారు.