ప్రైవేట్​ టీచర్ల అకౌంట్లలోకే ఆర్థికసాయం

ప్రైవేట్​ టీచర్ల అకౌంట్లలోకే ఆర్థికసాయం
  • ఈ నెల 20 నుంచి ఖాతాల్లో రూ.2 వేలు జమ 
  • 21 నుంచి రేషన్ షాపుల ద్వారా బియ్యం పంపిణీ
  • ఇయ్యాల్టి నంచే అప్లికేషన్లు
  • దరఖాస్తులను పంపే బాధ్యత మేనేజ్‌మెంట్లదే
  • గైడ్ లైన్స్ రిలీజ్ చేసిన సర్కార్

హైదరాబాద్, వెలుగు: ప్రైవేట్ స్కూళ్ల టీచర్లు, సిబ్బందికి అందజేసే రూ.2 వేల సాయాన్ని నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే జమ చేయాలని సర్కారు నిర్ణయించింది. రేషన్ షాపుల ద్వారా 25 కిలోల బియ్యం పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేసింది. ప్రైవేట్ టీచర్లకు అందజేయనున్న సాయానికి సంబంధించిన గైడ్ లైన్స్ ను శుక్రవారం రిలీజ్ చేసింది. అప్లికేషన్లను టీచర్ల ద్వారా కాకుండా ఆయా స్కూల్ మేనేజ్మెంట్ల ద్వారా తీసుకోనుంది. శనివారం నుంచే ఆన్ లైన్ లో అప్లికేషన్ల ప్రాసెస్ ప్రారంభం కానుంది. అధికారిక లెక్కల ప్రకారం రాష్ట్రంలో 10,700 ప్రైవేట్ స్కూళ్లలో 1.18 లక్షల మంది టీచర్లు, 27 వేల మంది నాన్​ టీచింగ్ స్టాఫ్​వర్క్ చేస్తున్నారు. కరోనా వల్ల స్కూళ్లు బంజేయడంతో వారంతా రోడ్డున పడ్డారు. మేనేజ్మెంట్లు జీతాలు చెల్లించకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రైవేట్ స్కూల్ టీచర్లందరికీ నెలకు రూ.2 వేలు, 25 కిలోల సన్న బియ్యం ఇస్తామని సీఎం కేసీఆర్ సర్కార్ ప్రకటించారు. దీంతో టీచర్ల వివరాలు సేకరించే పనిలో అధికారులు పడ్డారు. 

పోయినేడాది మార్చి వరకు పని చేసినోళ్లకు..  
ప్రైవేట్ స్కూళ్లలో పనిచేసే టీచర్లు, సిబ్బంది వివరాలు స్కూల్ ఎడ్యుకేషన్ వద్ద ఉన్నప్పటికీ.. అధికారులు మరోసారి ప్రైవేటు స్కూల్ మేనేజ్మెంట్ల నుంచి సేకరిస్తున్నారు. అయితే చాలామందిని ఈ మధ్య కాలంలో మేనేజ్మెంట్లు తీసేశాయి. దీంతో పోయినేడాది జనవరి నుంచి మార్చి మధ్య పని చేసినోళ్లందరికీ సాయం అందజేయాలని అధికారులు నిర్ణయించారు. అయితే ఒక్కో టీచర్ అప్లై చేసుకోవడం ద్వారా ఇబ్బందులు వస్తాయని భావించి.. స్కూల్ ప్రిన్సిపల్స్, మేనేజ్మెంట్లు సర్టిఫై చేసి అప్లై చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఏమైనా తప్పుడు వివరాలు అందజేస్తే, మేనేజ్మెంట్లదే బాధ్యతని స్పష్టం చేశారు. డబ్బులు నేరుగా టీచర్ల ఖాతాల్లో వేసేందుకు గాను ఆధార్ నెంబర్లతో పాటు బ్యాంక్ ఖాతాల వివరాలు సేకరిస్తున్నారు. ఒకవేళ మేనేజ్మెంట్లు ఎవరి వివరాలైన పంపించకపోతే, సదరు టీచర్లు నేరుగా కలెక్టర్లకు అప్లై చేసుకునే అవకాశం కల్పించారు. దీనిపై విచారణ జరిపి, చర్యలు తీసుకుంటారు.

ఈ నెల 16 నుంచి వెరిఫికేషన్...
ఈ నెల 10 నుంచి 15 వరకు అప్లికేషన్లను స్వీకరించనున్నారు. మరోవైపు ఈ నెల14లోపే ఎంఈఓల ద్వారా ఆయా మండలాల్లోని టీచర్ల వివరాలను సేకరించనున్నారు. 16 న జిల్లా స్థాయిలో స్క్రూటినీ చేస్తారు. 17 నుంచి 19 వరకు స్టేట్ లెవెల్ వెరిఫికేషన్ ఉంటుంది. 20 నుంచి 24 వరకు టీచర్ల ఖాతాల్లో సర్కారు అందించే రూ.2 వేలు వేయనున్నారు. అలాగే ఈ నెల 21 నుంచి 25 వరకు రేషన్ షాపుల ద్వారా 25 కిలోల సన్న బియ్యం పంపిణీ చేయనున్నారు. ఇందుకోసం పౌరసరఫరాల శాఖ అధికారులతో కలిసి ఏర్పాట్లు చేశారు. 

బడులు ప్రారంభమయ్యే దాకా ప్రైవేట్ టీచర్లకు సాయం
మంత్రులు సబిత, గంగుల వెల్లడి 

సర్కార్ గుర్తింపు పొందిన ప్రైవేటు స్కూళ్లలో పని చేస్తున్న అర్హులైన టీచర్లు, సిబ్బంది అందరికీ ప్రతినెల రూ.2 వేలు, 25 కిలోల బియ్యం పంపిణీ చేయనున్నట్లు మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్​వెల్లడించారు. బడులు తిరిగి ప్రారంభమయ్యే దాకా ఈ సాయం కొనసాగిస్తామని తెలిపారు. శుక్రవారం హైదరాబాద్ లోని బీఆర్​కే భవన్​ నుంచి జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. కలెక్టర్లు అర్హులైన టీచర్లు, సిబ్బందిని గుర్తించాలని మంత్రులు ఆదేశించారు. ప్రైవేట్​టీచర్లకు నెలనెలా రూ.2 వేల చొప్పున ఇచ్చేందుకు గాను రూ.29 కోట్లు, 25 కిలోల చొప్పున బియ్యం ఇచ్చేందుకు గాను రూ.13.57 కోట్లు ఖర్చవుతుందని గంగుల చెప్పారు. పంపణీ కోసం 3,625 మెట్రిక్​ టన్నుల బియ్యం సిద్ధం చేశామన్నారు.