
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లోనే ప్రభుత్వ భూముల్లో అర్హులైన పేదలకు ఇండ్ల స్థలాలను కేటాయిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ నెల 24 నుంచే పోడు పట్టాలను పంపిణీ చేస్తామని, బీసీలకు రూ.లక్ష ఆర్థిక సాయం కూడా ప్రారంభిస్తామని వెల్లడించారు. శుక్రవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సెక్రటేరియెట్లో జాతీయ జెండాను ఎగురవేసి రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను ప్రారంభించారు. న్యూట్రిషన్ కిట్ల పంపిణీని మిగతా 24 జిల్లాల్లోనూ ప్రారంభిస్తామని తెలిపారు. గృహలక్ష్మి పథకం కింద ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.3 లక్షలను మూడు దశల్లో అందిస్తామన్నారు. దళితబంధు పథకం కింద ఈ ఏడాది బడ్జెట్ లో రూ. 17,700 కోట్లు కేటాయించామని, రెండో విడతగా 1.30 లక్షల మందికి దళితబంధు సాయం అందిస్తామన్నారు. ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు అందించడంలో రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉందన్నారు.
ఒక పంట పోయినా పర్వాలేదన్నరు..
రాష్ట్రంలో దాదాపు 75 లక్షల ఎకరాలకు సాగునీటి వసతి ఏర్పడిందని సీఎం తెలిపారు. రెండు, మూడేళ్లలో మరో 50 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. రాష్ట్రంలో 1.25 కోట్ల ఎకరాలకు సాగునీరు అందించాలన్న స్వప్నం సాకారం కాబోతున్నదన్నారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు 80 శాతంపైగా పూర్తయిందని తెలిపారు. ‘‘ఇటీవల వర్షాలకు రైతులు పంటలు నష్టపోయారు. అయితే, ఒక పంటపోయినా పర్వాలేదని, సర్కారు అందిస్తున్న సాయంతో మరో పంట పండించుకుంటామని రైతులు చెప్పడం సంతోషాన్ని కలిగించింది” అని కేసీఆర్ తెలిపారు.