- కేజ్రీవాల్ పార్టీకి 50 కోట్లు ఇచ్చిన
- సత్యేంద్ర జైన్ బెదిరించి రూ.10 కోట్లు తీసుకున్నడు
- ఆర్థిక మోసగాడు సుకేశ్ చంద్రశేఖర్ సంచలన ఆరోపణలు
- ఏజెన్సీలతో దర్యాప్తు జరిపించాలని ఢిల్లీ ఎల్జీకి లేఖ
న్యూఢిల్లీ : ప్రస్తుతం జైలులో ఉన్న ఆర్థిక నేరగాడు సుకేశ్ చంద్రశేఖర్ సంచలన ఆరోపణలు చేశాడు. ఆప్ నేత, మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ తన వద్ద రూ.10 కోట్లను బెదిరించి తీసుకున్నారని చెప్పాడు. జైలులో సురక్షితంగా ఉండాలంటే డబ్బు ఇవ్వాలని చెప్పారని పేర్కొన్నాడు. ఈ మేరకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు లేఖ రాశాడు. రూ.200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో అరెస్టయిన సుకేశ్.. ప్రస్తుతం మండోలి జైలులో ఉన్నాడు. ఎల్‌జీ సక్సేనాకు తాను రాసిన లేఖను అక్టోబర్ 8న లాయర్ అశోక్ కే సింగ్ ద్వారా అందజేశాడు. అతడి లేఖను ఢిల్లీ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీకి అదే రోజున పంపామని, అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించామని గవర్నర్ కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. ‘‘దక్షిణాదిలో ముఖ్యమైన పదవి ఇస్తామని చెప్పడంతో ఆమ్ ఆద్మీ పార్టీకి రూ.50 కోట్లకు పైనే ఇచ్చాను. రాజ్యసభకు నామినేట్ చేస్తామని కూడా చెప్పారు. నేను తీహార్ జైలులో ఉన్నప్పుడు సత్యేంద్ర జైన్ (జైళ్ల శాఖ మంత్రిగా ఉన్నారు) వచ్చి కలిశారు. ‘ఆప్‌కు డబ్బులు ఇచ్చిన దాని గురించి దర్యాప్తు సంస్థలకు ఏమైనా చెప్పావా?’ అని అడిగారు. 2019లో మరోసారి వచ్చారు. అప్పుడు ఆయన తన సెక్రటరీ, ఫ్రెండ్ సుశీల్‌తో కలిసి వచ్చారు. జైలులో మంచి సౌకర్యాలు, భద్రత కల్పించేందుకు ‘ప్రొటెక్షన్ మనీ’గా రూ.2 కోట్లు ప్రతి నెల ఇవ్వాలని చెప్పారు. జైళ్ల శాఖ డీజీ సందీప్ గోయల్‌కు రూ.1.5 కోట్లు ఇవ్వాలన్నారు. ఈ డబ్బును కోల్‌కతాలోని జైన్ సహచరులు తీసుకున్నారు. మొత్తంగా సత్యేంద్ర జైన్‌కు రూ.10 కోట్లు, డీజీ గోయల్‌కు రూ.12.5 కోట్లు ఇచ్చాను” అని ఆ లేఖలో సుకేశ్ ఆరోపించాడు.
జైలులో బెదిరించారు..
సత్యేంద్ర జైన్, గోయల్ డబ్బు తీసుకోవడంపై ఈడీకి సమాచారం ఇచ్చానని లేఖలో సుకేశ్ పేర్కొన్నాడు. ‘‘సీబీఐతో దర్యాప్తు చేయించాలని ఢిల్లీ హైకోర్టులోనూ పిటిషన్ వేశాను. వచ్చే నెలలో కోర్టు విచారణ జరపనుంది. అరెస్టయి తీహార్ జైలుకు వచ్చిన సత్యేంద్ర జైన్.. డీజీ, జైలు అధికారులతో కలిసి నన్ను బెదిరిస్తున్నారు. హైకోర్టులో వేసిన పిటిషన్ విత్ డ్రా చేసుకోవాలని బెదిరిస్తున్నారు. వేధిస్తున్నారు. దీనిపై ఏజెన్సీలతో దర్యాప్తు జరిపించండి’’ అని ఎల్జీని కోరాడు.
దొంగనే దోచుకున్నరు : బీజేపీ ఎద్దేవా
సుకేశ్ ఆరోపణల నేపథ్యంలో బీజేపీ ఘాటుగా స్పందించింది. ఆప్.. మహా థగ్ పార్టీ అని, దొంగనే దోచుకున్నదని ఎద్దేవా చేసింది. ‘‘ఇక్కడ థగ్ (దొంగ) సుకేశ్ అయితే.. అతడిని దోచుకున్న థగ్ ఆమ్ ఆద్మీ పార్టీ నేత సత్యేంద్ర జైన్’’ అని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా విమర్శించారు.
అప్పుడు విశ్వాస్.. ఇప్పుడు సుకేశ్: కేజ్రీవాల్
మోర్బిలో తీగల వంతెన కూలిన ఘటన నుంచి దృష్టి మళ్లించేందుకే బీజేపీ ఈ ఆరోపణలు చేస్తున్నదని ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. పంజాబ్ ఎన్నికలప్పుడు కుమార్ విశ్వాస్‌ను తెరపైకి తెచ్చారని, ఇప్పుడు గుజరాత్ ఎన్నికలు ఉండటంతో సుకేశ్‌తో ఆరోపణలు చేయిస్తున్నారని విమర్శించారు.
