డ్రిప్ ఇండస్ట్రీస్‌‌లో అగ్నిప్రమాదం.. రూ.3 కోట్ల ఆస్తి నష్టం

డ్రిప్ ఇండస్ట్రీస్‌‌లో అగ్నిప్రమాదం.. రూ.3 కోట్ల ఆస్తి నష్టం

అయిజ, వెలుగు: గద్వాల జిల్లా అయిజ పట్టణ శివారు  రాయచూరు రోడ్డులోని పరమేశ్వర డ్రిప్ ఇండస్ట్రీస్‌‌లో శనివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో దాదాపు రూ.3 కోట్ల మేర ఆస్తి నష్టం జరిగినట్లు ఫ్యాక్టరీ యజమాని ప్రతాప్ రెడ్డి తెలిపారు. ఆయన తెలిపిన ప్రకారం.. ఉదయం ఫ్యాక్టరీలో కార్మికులు పనిచేస్తుండగా అకస్మాత్తుగా షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు చెలరేగాయి. డ్రిప్ పైపులు, పైపుల తయారీకి ఉపయోగించే ప్లాస్టిక్ ముడిసరుకు, మెషీన్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. 

మంటలు వేగంగా వ్యాపించడంతో దట్టమైన పొగ పరిసర ప్రాంతాలను కమ్మేసింది. స్థానికులు, సమీప ఫ్యాక్టరీ యాజమానులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న గద్వాల, అలంపూర్ అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

ప్రమాదంలో ప్రాణనష్టం జరగలేదు. అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, మున్సిపల్ చైర్​పర్సన్ సీఎం సురేశ్, బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు రామచంద్రారెడ్డి ఘటనాస్థలానికి చేరుకుని యజమానిని ఓదార్చారు.