హైదరాబాద్ లోని మల్కాజ్ గిరి విష్ణుపురి కాలనీలో అగ్నిప్రమాదం జరిగింది. మైత్రి నివాస్ అపార్టుమెంట్ లో ఏర్పాటు చేసిన గణేష్ మండపంలో అర్థరాత్రి తర్వాత మంటల చెలరేగాయి. విగ్రహం ముందు ఏర్పాటు చేసిన జ్యోతి కింద పడటంతో మంటలు అంటుకున్నాయి. అంతా నిద్రలో ఉండటంతో మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. దీంతో మంటలు గమనించిన వాచ్ మెన్.. అపార్టుమెంట్ వాసులను అలర్ట్ చేశారు. ఈ ప్రమాదంలో గ్రౌండ్ ఫ్లోర్ లో పార్కింగ్ చేసి ఉన్న 10 బైకులు, 4 కార్లు పూర్తిగా కాలిపోయాయి.
సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. పక్క అపార్టుమెంట్లకు కూడా మంటలు వ్యాపించకుండా జాగ్రత్త పడ్డారు. అయితే రాత్రి టైం కావటంతో భారీగా ఆస్తి నష్టం జరిగిందంటున్నారు స్థానికులు. అగ్ని ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

