ప్రచారంలో బాణసంచా : 29 గుడిసెలు దగ్ధం

ప్రచారంలో బాణసంచా : 29 గుడిసెలు దగ్ధం

ఎన్నికల ప్రచారంలో భాగంగా బాణాసంచా కాల్చడంతో.. ఆ నిప్పు రవ్వలు ఎగిరిపడి 29 పూరిళ్లు దగ్ధమైన ఘటన విజయనగరంలో చోటుచేసుకుంది. జిల్లాలోని డెంకాడ మండలం చల్లంగిపేటలో వైసీపీ నేతలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆ గ్రామ పంచాయతీ పరిధిలోని పోతయ్యపాలెంకు రాగానే  తమ అభ్యర్థి అప్పలనాయడు ప్రచారం చేస్తున్న సమయంలో ఆ పార్టీ కార్యకర్తలు బాణాసంచా కాల్చారు. ఆ క్రమంలో నిప్పురవ్వలు ఎగిసి పడి సమీపంలో ఉన్న పూరిళ్లకు అంటుకున్నాయి. దీంతో ఆ గుడిసెలన్నీ తగలబడ్డాయి.

ఈ ప్రమాదంతో గుడిసెల్లో నివసిస్తున్న వారంతా తమ సర్వం కోల్పోయారు. స్థానికుల సమాచారంతో ఆ ప్రాంతానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది  రెండు అగ్నిమాపక శకటాలతో మంటలను అదుపు చేశారు. అప్పటికే పూర్తిగా నష్టం జరిగిపోయిందని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.40 లక్షల మేర ఆస్తి నష్టం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు.