మంటలార్పే సిలిండర్లు పేలిపోయాయి: సికింద్రాబాద్ లో అగ్నిప్రమాదం

మంటలార్పే సిలిండర్లు పేలిపోయాయి: సికింద్రాబాద్ లో అగ్నిప్రమాదం

సికింద్రాబాద్ : మారేడ్ పల్లిలోని ఓ భవనంలో భారీ పేలుడు జరిగింది. అగ్ని ప్రమాదాలు జరిగిన సమయంలో మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు వాడే ఏరో సెల్ సిలిండర్లు భారీ శబ్దం చేస్తూ పేలిపోయాయి. భారీగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలతో ఆ  ప్రాంతమంతా భయానకవాతావరణం ఏర్పడింది.

మారేడ్ పల్లి సయ్యద్ జలాల గార్డెన్ వద్ద ఓ భవనంలో పై అంతస్తులో రిలయన్స్ ఫైర్ అండ్ సేఫ్టీ పరికరాలను అమ్ముతున్నారు. ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ప్రమాద తీవ్రతను తగ్గించేందుకు ఈ సిలిండర్లను వాడుతుంటారు. వీటిని అక్కడి బిల్డింగ్ పై అంతస్తులో పెట్టారు. మధ్యాహ్నం 12 గంటలకు.. బిల్డింగ్ పై అంతస్తులో భారీ శబ్దాలతో పేలుడు జరిగింది. పేలుడు ధాటికి పై అంతస్తు మొత్తం ధ్వంసమైంది. ఓ వ్యక్తి సజీవ దహనం అయ్యాడు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. మంటలను ఆర్పుతుండగా… ఓ ఫైర్ సేఫ్టీ వర్కర్ కూడా వేడి తీవ్రతకు తట్టుకోలేక పై అంతస్తునుంచి కిందపడిపోయాడు. ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తిని రాజుగా గుర్తించారు.